ఆశావర్కర్ల ఆందోళన..

16-11-2026 | 06:52pm

నిర్మల్ నవంబర్ 16 ( విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆశా వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(Telangana ASHA Workers and Helpers Union) (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఆశావర్కర్లు మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజలకు నిరంతరం ఆరోగ్య సేవలు అందిస్తున్న తమకు ఎన్నికల మేనిఫెస్టోలో నెలకు రూ.18 వేల వేతనం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఆ హామీని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల వేతనం కూడా అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.

ఆశావర్కర్లకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏఎన్ఎం, జీఎన్ఎం శిక్షణ పొందిన వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన రెండు డీఏలను ఆశావర్కర్లకు కూడా వర్తింపజేయాలని కోరారు. రెండో పీఆర్సీలో ఆశావర్కర్లకు నెలకు రూ.30 వేల వేతనం నిర్ణయించాలన్నారు. అనంతరం డీఆర్ఓ రాథోడ్ రమేష్‌కు వినతిపత్రం అందజేశారు.

మరిన్ని వార్తలు