ప్రజాధనంతో పార్టీ సదస్సా?
- ప్రభుత్వ నిధులను ఎలా వినియోగిస్తారు?
- సమ్మిట్ పేరుతో దేశ వ్యతిరేక శక్తులు ఏకం
- దేశాభివృద్ధిని అడ్డుకునే కుట్రలు
- రాహుల్ విజన్ ఏమిటో ప్రపంచానికి చెబుతారా?
- ఓటములను కప్పి పుచ్చుకునేందుకే సమ్మిట్
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్
- హైదరాబాద్‌లో ‘భారత్ సమ్మిట్’ నిర్వహణపై తీవ్ర అభ్యంతరం
హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): ‘భారత్ సమ్మిట్ పేరుతో హైదరాబాద్‌లో ఏం సాధించాలనుకుంటున్నారు? ఈ సదస్సు నిర్వహణకు ప్రాతిపదిక ఏమిటి? కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి తెలంగాణ ప్రజల సొమ్ము ఎలా ఖర్చు చేస్తారు? పాక్ అనుకూల, భారత్ వ్యతిరేక శక్తులన్నీ హైదరాబాద్ వేదికగా ఏకమవుతున్నాయి.
దేశాభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలకు తెలంగాణను వేదికగా మార్చడం దురదృష్టకరం’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) మండిపడ్డారు. ప్రధాని మోదీపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం, రాజ్యాంగబద్ధ సంస్థల ను బద్నాం చేయడం తప్ప ఈ సమ్మిట్ ద్వారా దేశానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అని కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చిత్రీకరిస్తూ ప్రజాధనాన్ని వినియోగించ డంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘రాహుల్‌గాంధీకి అస లు ఏం విజన్ ఉంది? ఆయన రాజకీయ వైఫల్యాలను, కాంగ్రెస్ వరుస ఓటములను కప్పిపుచ్చుకునేందుకే హైదరాబాద్‌లో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు’ అని విమర్శిం చారు. రాహుల్‌గాంధీ నాయకత్వంలో వంద ఓటములు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరాయని, వాటిని తక్కువ చేసి చూపించే ప్రయత్నంలో భాగమే సమ్మిట్ అని పేర్కొన్నారు. భారత్ సమ్మిట్ వేదికగా రాహుల్‌గాంధీ విజన్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయని, అసలు రాహుల్‌కు ఏం విజన్ ఉందని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అనే తేడా లేకుండా.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి, పెట్టుబడుల కోసం ఆరోగ్యకరమైన పోటీ పడుతున్నాయని, అభివృద్ధిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ‘భారత్ సమ్మిట్’ పేరుతో కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఒకవైపు హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని చెబుతూనే.. మరోవైపు దేశంలోకి విదేశీ పెట్టుబడులు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని వారు మండిపడ్డారు.
దేశ వ్యతిరేక శక్తుల అజెండా అమలుకే సదస్సు..
‘దేశంలో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది.. అవినీతికి అడ్డుకట్ట పడింది.. కుల, మత రాజకీయాల ప్రభావం తగ్గింది.. కుటుంబ రాజకీయాల కు ప్రాధాన్యం లేకుండా పోతోంది. దేశంలో చోటుచేసుకుంటున్న ఈ మార్పులను, అభివృద్ధిని రాహుల్‌గాంధీ ఏనాడైనా స్వాగతించారా? కనీసం ప్రశంసించారా?’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. దేశంలో జరుగుతున్న ప్రగతిని గుర్తించకుండా, భారత్ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
భారత వ్యతి రేక శక్తులు నిర్దేశిస్తున్న అజెండాను అమలు చేసేందుకే హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్ నిర్వహిస్తు న్నారని ఆరోపించారు. సొంత ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ప్రతులను చించేసి, నాటి ప్రధాని మన్మోహన్‌ను అవమానించిన చరిత్ర రాహుల్‌గాంధీది అని మండిపడ్డారు. దేశంలో బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక వంటి పరిస్థితులు వస్తాయని ప్రచారం చేయడమంటే దేశ భద్రతకు విఘాతం కలిగించడమేనని మండిపడ్డారు.
దంతేవాడలో 76 మంది సీఆర్‌ఫీఫ్ జవాన్లను నక్సలైట్లు హత్యచేస్తే ఖండించకుండా, నక్సలిజం సామాజిక సమస్య అంటూ సమర్థించడం దేశ భద్రతపై రాహుల్‌కున్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తుందన్నారు. బలూచిస్తాన్‌లో భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని వ్యాఖ్యలు చేయడం భారతీయుడిగా రాహుల్ విధానమా? అని ప్రశ్నించారు. ఏ రోజు కూడా దేశ గౌరవం పెంచే విధంగా రాహుల్‌గాంధీ వ్యవహరించలేదని విమర్శించారు. జార్జ్ సోరోస్ లాంటి వ్యక్తులు రాహుల్‌గాంధీని వెపన్‌లా వాడుకుంటూ దేశ గౌరవాన్ని మంటగలిపే ప్రయత్నం చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.
హామీలను సమ్మిట్‌లో ప్రస్తావించాలి
2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ హైదరాబాద్ వచ్చి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను సమ్మిట్‌లో ప్రస్తావించాలని మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తల్లి, చెల్లి, మీ సీఎంతో కలి సి ఇచ్చిన గ్యారంటీలు, హామీలు, అందులో ఏవేవి అమలవుతున్నాయో చెప్పాలన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోందని, హైకో ర్టు జోక్యం చేసుకుని పెండింగ్ బిల్లును చెల్లించాలని ఆదేశించడం అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ చేసిన అప్పులను కాంగ్రెస్ సర్కార్ మరింతగా పెంచి పోషిస్తోందని, తద్వారా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి అసమర్థత, రాహుల్‌గాంధీ విజన్ లేని డైరెక్షన్ కారణంగా రాష్ర్టం ఆర్థిక సంక్షో భం వైపు వెళ్తుందన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు విరమణ బెనిఫిట్స్ అందడం లేదని, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, కౌలు రైతులకు రైతుభరోసా, బీసీ డిక్లరేషన్ తదితర హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందించలేదని, ఒక్కో ఆడబిడ్డకు ప్రభుత్వం రూ.85వేల బకాయి పడిందన్నారు.
వితంతువులు, దివ్యాంగులు, నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగులను.. ఇలా ప్రతి వర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రీయిం బర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని, విద్యారంగ సమస్యలు కూడా ఎక్కడి గొంగళి అక్క డే అన్నట్టుగా ఉన్నాయని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షలు, గ్రామ పంచాయతీలకు రూ.25 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. వెయ్యి రోజులు గడిచినా ఆప్రస్తావనే తేవడం లేదని మండిపడ్డారు. ఇవన్నీ భారత్ సమ్మిట్‌లో అంతర్జాతీయ ప్రతినిధులకు తెలియజేయాలని పేర్కొన్నారు.