అంగరంగ వైభవంగా కురుమూర్తి రాయుడి ఆభరణాల ఊరేగింపు
ప్రత్యేక పూజలు, ఊరేగింపులో పాల్గొన్న రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి
ఆత్మకూరు ఎస్బీఐ బ్యాంకు నుండి క్షేత్రానికి తరలిన స్వామివారి స్వర్ణాభరణాలు
గోవింద నామస్మరణతో మార్మోగిన గ్రామాలు.. భారీగా తరలివచ్చిన భక్తజనం
చిన్నచింతకుంట నవంబర్ 14 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా(Mahabubnagar District) చిన్న చింతకుంట మండల కేంద్రం పరిధిలోని అమ్మపూరు గ్రామ శివారులో వెలిసిన ప్రజల కొంగుబంగారం శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన స్వర్ణాభరణాల (అలంకారం) ఊరేగింపు భక్తిశ్రద్ధలతో(devotional), అంగరంగ వైభవంగా సాగింది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆత్మకూరు పట్టణంలోని ఎస్బీఐ (SBI) బ్యాంకులో భద్రపరిచిన స్వామివారి ఆభరణాలకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR), ఆలయ చైర్మన్ బత్తుల బాలరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆత్మకూరులోని పురాతన పరమేశ్వరుని ఆలయంలో, అలాగే సంస్థానాధీశులు రాజా సోం భూపాల్ నివాసంలో స్వామివారి అలంకారానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు జరిపారు.
అక్కడి నుండి బ్యాండ్ మేళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాహలం మధ్య స్వామివారి ఆభరణాల ఊరేగింపు ప్రారంభమైంది. ఆత్మకూరు నుండి కొత్తపల్లి, దుప్పల్లి, అమ్మాపూర్ గ్రామాల మీదుగా సాగిన ఈ శోభాయాత్రలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కాలినడకన పాల్గొని భక్తుల్లో ఉత్సాహాన్ని నింపారు. దారి పొడవునా భక్తులు స్వామివారి ఆభరణాలకు నీరాజనాలు పలికారు. గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు, గ్రామాలు మార్మోగాయి.
భక్తి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ ఆధ్యాత్మిక వేడుకలో పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ఆలయ అధికారులు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.