కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు షురూ
భక్తులకు తప్పని నరకయాతన!
మరుగుదొడ్ల కుండీలకు సరైన ఫిట్టింగ్ లేక అధ్వాన్నంగా నిర్మాణం.. పగిలి, చిరిగిపోయిన రేకుల తలుపులు
అధికారుల నిర్లక్ష్యమా? కాంట్రాక్టర్ల చేతివాటమా?*
రేపటిలోగా మరమ్మతులు పూర్తి చేయిస్తామన్న ఈవో మదనేశ్వర్ రెడ్డి
చిన్నచింతకుంట: మండల కేంద్రంలోని అమ్మాపూర్ గ్రామ శివారులో వెలసిన శ్రీ కురుమూర్తి స్వామి(Kurumurthy Swamy) వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో మొదటి ఘట్టమైన 'అలంకరణ మహోత్సవం' మొదలవడంతో స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. అయితే, భక్తుల రద్దీకి తగ్గట్టుగా కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కుండీలకు సరైన ఫిట్టింగ్ లేక.. పగిలిన తలుపులతో అధ్వాన్నంగా మరుగుదొడ్లు
ఆలయ ప్రాంగణంలో, ముఖ్యంగా గోశాల పక్కన భక్తుల కోసం నిర్మించిన మరుగుదొడ్ల సముదాయం అత్యంత దయనీయంగా, వినియోగానికి ఏమాత్రం పనికిరాకుండా ఉంది. మరుగుదొడ్ల లోపల అమర్చిన కుండీలకు (బేసిన్లకు) చుట్టూ సరైన సిమెంట్ ఫిట్టింగ్ కూడా చేయకుండా, మధ్యలో ఖాళీలు వదిలేసి అత్యంత నాసిరకంగా బిగించారు. పైగా, ఆ కుండీలలో సిమెంట్ బస్తాలు, ప్లాస్టిక్ బాటిళ్లు, చెత్తాచెదారం నిండిపోయి కనీసం అడుగుపెట్టలేని దుస్థితి నెలకొంది.
మరోవైపు, మరుగుదొడ్లకు అమర్చిన నాసిరకం రేకుల తలుపులు చిరిగిపోయి, పగిలి దర్శనమిస్తున్నాయి. కనీసం మరుగుదొడ్ల వద్ద నీటి వసతి కూడా కరువైంది. దీంతో దూర ప్రాంతాల నుండి వచ్చే మహిళా భక్తులు, వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యమా? కాంట్రాక్టర్ల చేతివాటమా?
ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసినా, కనీసం మరుగుదొడ్ల నిర్మాణాన్ని సక్రమంగా పూర్తి చేయకపోవడం పట్ల భక్తులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుండీల చుట్టూ కనీస ఫిట్టింగ్ లేకుండా అసంపూర్తిగా వదిలేయడం, నాసిరకం తలుపులు బిగించడం చూస్తుంటే ఇది కాంట్రాక్టర్ల చేతివాటమా లేక పనులను పర్యవేక్షించాల్సిన దేవస్థానం అధికారుల నిర్లక్ష్యమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్సవాలు మొదలైనా కనీస పనులు పూర్తి కాకపోవడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈవో మదనేశ్వర్ రెడ్డి వివరణ
మరుగుదొడ్ల దుస్థితిపై కురుమూర్తి స్వామి దేవస్థానం ఈవో (EO) మదనేశ్వర్ రెడ్డిని వివరణ కోరగా ఆయన స్పందించారు. గోశాల పక్కన ఉన్న మరుగుదొడ్ల వద్ద గతంలో ఉన్న పెద్ద గుండ్లను (బండరాళ్లను) పగలగొట్టే క్రమంలో బ్లాస్టింగ్ దెబ్బకు రేకులు దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు.
ప్రస్తుతం తాము స్వామివారి 'అలంకార మహోత్సవం' విధుల్లో ఉన్నామని, మరుగుదొడ్ల మరమ్మతులకు సంబంధించిన మెటీరియల్ అంతా ఇప్పటికే సిద్ధం చేశామని చెప్పారు. కుండీల ఫిట్టింగ్, పగిలిన రేకుల మరమ్మతు పనులు జరుగుతున్నాయని, స్వయంగా తానే అక్కడికి వెళ్లి పరిశీలించి ఈ రాత్రికి లేదా రేపు ఉదయంలోగా (నవంబర్ 15) పనులన్నీ పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని ఈవో స్పష్టం చేశారు.