బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి
* ఈ నెల 16న కలెక్టరేట్లో బాలల ప్రజావాణి
* విద్య, వైద్యం, పోషకాహారం, బాలల హక్కులపై ఫిర్యాదుల స్వీకరణ
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి) : బాలల హక్కుల వారోత్సవాలను(Child Rights Week Celebrations) పురస్కరించుకొని ఈ నెల 16న సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో(Nagarkurnool District Collectorate) ప్రత్యేకంగా బాలల ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్(District Collector Hemant Keshav Patil) తెలిపారు. బాలలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకునేందుకు ఈ ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. సాధారణ ప్రజావాణి ప్రాంగణంలోనే పిల్లల కోసం ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేయనున్నారు. విద్య, వైద్యం, పోషకాహారం, బాలల రక్షణ, ప్రాథమిక సౌకర్యాలు, సంక్షేమ పథకాల అమలుపై పిల్లలు తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో సమర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు. పిల్లలు, వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.