విదేశాలకు వెళ్లి దేశంపై కుట్రలు

01-11-2026 | 05:05am
  1. ఎవరు ఎవరిని కలుస్తున్నారో గమనించాలి
  2. దేశాన్ని అస్థిరపరచాలన్నదే వాళ్ల ఎజెండా
  3. ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఆరోపణలు

అహ్మదాబాద్, అక్టోబర్ 31: దేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అన్నారు. ‘కొందరు విదేశాలకు వెళ్లి ఎవరెవరినో కలుస్తున్నారు. మన దేశంపై కుట్రలు పన్నుతున్నారు. ఆ శక్తుల పన్నాగమంతా ఈ దేశాన్ని విభజించడం, అస్థిరపర్చడమే. దశాబ్దానికిపైగా ఆ శక్తులు నిరాశ, నిస్పృహలో ఉన్నాయి. అందుకే విదేశాల్లో పర్యటిస్తూ పథకాలు రచిస్తున్నారు’ అని పరోక్షంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉంటేనే కుట్రలను ఛేదించగలమని తెలిపారు. శనివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా గుజరాత్ అహ్మదాబాద్‌లోని ఆయన విగ్రహం వద్ద ప్రధాని మోదీ నివాళులర్పించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. విదేశాలకు వెళ్లి ఎవరు ఎవరిని కలుస్తున్నారో, వారికి ఏ శక్తులు సహకరిస్తున్నాయో గమనించాలని ప్రజలకు సూచించారు. దేశాన్ని అస్థిరపరిచే శక్తుల ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. తుది శ్వాస వరకు కూడా తాను దేశ  ప్రజల సేవలోనే ఉంటానని తెలిపారు. 

దిమాగీ నక్సల్స్‌తో జాగ్రత్త

నక్సలిజాన్ని అంతం చేశామని.. ఇక మిగిలింది అర్బన్ నక్సలిజమేనని ప్రధాని మోదీ అన్నారు. ‘మారుమూల గ్రామాల్లో నక్సలిజాన్ని తుదముట్టించాం. నక్సల్స్ హింస నుంచి పల్లెలు విముక్తిపొందాయి. కానీ, ఇంకా అర్బన్‌లో దిమాగీ నక్సల్స్‌తో అప్రమత్తంగా ఉండాలి. అబద్ధాలను, అసత్యాలను వ్యాపింపజేయడం.. దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే వాళ్ల పని. ప్రజలంతా సర్దార్ వల్లభాయ్ పటేల్  స్ఫూర్తితో కలిసి ముందుకు సాగితే ఆ దిమాగీ నక్సల్స్ ఏమీ చేయలేరు’ అని ఆయన తెలిపారు. గత పాలకులు ‘గరీబీ హఠావో’ నినాదానికే పరిమితమయ్యారని.. కానీ, 12 ఏండ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల వల్ల దేశంలో భారీగా పేదరికం తగ్గిందని, ఇటీవలే వరల్డ్ బ్యాంక్ కూడా తన నివేదికలో ప్రస్తావించిందని ప్రధాని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు