కశ్మీర్లో మరో ఉగ్రదాడి?
- కిష్తార్ జిల్లాలో ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల మృతదేహాలు లభ్యం
- శరీరంపై బుల్లెట్ గాయాలు.. సర్వీస్ ఆయుధాలూ మాయం
- టెర్రరిస్టులే కిడ్నాప్ చేసి.. చంపి ఉంటారని అనుమానం
శ్రీనగర్, నవంబర్ 12: జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో మరో ఉగ్రదాడి జరిగిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కుల్గాం ఉగ్రదాడి ఘటనను మర్చిపోకముందే కిష్తార్ జిల్లాలో మరో విషాదకర ఘటన వెలుగు చూసింది. విధుల్లో ఉన్న ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు బుధవారం అదృశ్యమయ్యారు. మరుసటి రోజే తూటాల గాయాలతో విగత జీవులుగా కనిపించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మృతులను రిషిపాల్ సింగ్ (45), బాబీ చంద్ (57)గా గుర్తించారు. బుధవారం వీరు వెళ్తుండగా దేహర్నా అటవీ ప్రాంతంలో కాల్పుల శబ్దాలు వినిపించాయి.
ఆ దిశగా వెళ్లిన ఇద్దరు సిబ్బంది తర్వాత కనిపించకుండా పోవడంతో పోలీసులు, ప్రత్యేక ఆపరేషన్ బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. గురువారం ఉదయం ఇద్దరి మృతదేహాలు లభించినట్లు కిష్తార్ ఎమ్మెల్యే షగున్ పరిహార్ తెలిపారు. వారి శరీరాలపై పలు బుల్లెట్ గాయాలున్నాయి. వారి సర్వీస్ ఆయుధాలు కూడా కనిపించలేదని భద్రతా వర్గాలు తెలిపాయి. దీంతో వీరిని ఉగ్రవాదులే హత్య చేసి ఉండచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
భద్రతా దళాలకు సవాల్ విసురుతున్న టెర్రరిస్టులు
ఈ రెండు ఘటనలతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదుల కదలికలు, స్థానికంగా వారికి అందుతున్న సహకారం, భద్రతా వ్యవస్థలకు ఎదురవుతున్న సవాళ్లపై దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు.. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్న కేంద్ర ప్రభుత్వ వాదనను నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ప్రశించారు. భద్రతా దళాలకు టెర్రిస్టులు సవాల్ విసురుతున్నారన్నారు. సీఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడిని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఖండించారు.
కుల్గాంలో జవాన్లను ముందే బెదిరించిన బాలుడు
కుల్గాంలో సీఆర్పీఎఫ్ చెక్ పోస్టుపై కాల్పులకు ముందే ఒక బాలుడు జవాన్లను బెదిరించాడు. ఆ తర్వాత రెండు రోజులకే ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎస్ సిబ్బంది గాయపడ్డారు. పదో తరగతి విద్యార్థిగా భావిస్తున్న ఓ బాలుడు సోమవారం చెక్‌పోస్టు వద్దకొచ్చి.. ‘హమ్ తుమ్హే ఛోడేంగే నహీ’ (మేము మిమ్మల్ని వదిలిపెట్టం) అని అక్కడ విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బందిని బెదిరించినట్లు స్థానికులు చెప్పారు. అతడి మాటలను భద్రతా దళాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. రెండు రోజుల తర్వాత అదే చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బాలుడి ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. ఆ బాలుడి కోసం గాలిస్తున్న పోలీసులు ఉగ్రదాడితో అతడి హెచ్చరికకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో విచారణ చేపట్టారు.
ఆకస్మిక దాడిలో గాయపడినప్పటికీ సీఆర్పీఎఫ్ సిబ్బంది ఎదురు కాల్పులు జరపడంతో టెర్రరిస్టులు పారిపోవడంతో నష్టం తగ్గింది. ఉగ్రవాదుల కొన్ని తూటాలు తీవ్రంగా గాయపడిన జవాన్ ధరించిన బుల్లెట్ ప్రూఫ్ రక్షణ కవచాన్ని సైతం ఛేదించినట్లు సమాచారం. కుల్గాం దాడి వెనుక నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ నెట్వర్క్ ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దాడి తర్వాత చెట్ల మధ్య నుంచి నౌపూర్ వైపు పారిపోయినట్లు సమాచారం. ఈ దాడిలో ఇటీవల భద్రతా దళాల నుంచి తప్పించుకున్న స్థానిక కమాండర్ మహమ్మద్ లతీఫ్ భట్ ప్రమేయం ఉందని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.