01-09-2025 01:23:15 AM
నిర్మల్, ఆగస్టు 31 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో వరద నష్టం రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చెరువులు, నదులు ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలతో నిండుకొని వరద రూపంలో పంట చేలను, పట్టణాలను నీట ముంచడంతో నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. జిల్లాలోని కడెం, పెంబి, ఖానాపూర్, కుంటాల, లోకేశ్వరం, సారంగాపూర్, దిల్వార్పూర్, మామడా, లక్ష్మణ చందా, ముధోల్, కుబీర్, తానూర్ మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి.
నాలుగు రోజుల్లోనే సుమారు 2250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం వర్ష బీభత్సవానికి ప్రత్యేక నిదర్శనం. దీనికి తోడు మహారాష్ర్టలో కూడా భారీ వర్షాలు కురవడంతో జిల్లాలోని ప్రాజెక్టులకు రికార్డ్ స్థాయిలో వరద రాగా దాన్ని గోదావరిలోకి వదలడం మరింత నష్టాన్ని తెచ్చిపెట్టింది. జిల్లాలోని బాసర పట్టణం రెండు రోజులు నీటిలోనే మునగడం, బాసర బ్రిడ్జి వద్ద 31 అడుగులు గోదావరి వరద ప్రవహించడం, శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ అనేక గ్రామాలను చుట్టుముట్టడం వరద నష్టానికి కారణమైంది. 1983 తర్వాత ఇంత భారీ స్థాయిలో వరద ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెపుతున్నారు.
బాసరలో 500 ఇండ్లు, 200 వ్యాపార దుకాణాలు నీటిలో మునుగగా శ్రీరామ్‌సాగర్ దిగువన సోను, కూచంపల్లి, గాంధీనగర్, లక్ష్మణ్ చందా, మామిడి, ఖానాపూర్ మండలంలోని సుమారు 10 గ్రామాలు గోదావరి నీటితో నిండాయి. గోదావరి నదికి ఉపనదులైన స్వర్ణ గడ్డనవాగు, కడెం, బైంసా చిన్న వాగు, బిదిరెల్లి వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో గోదావరి నదిలో నీళ్లు వెళ్లలేక ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో జిల్లాలో పంటలు నష్టానికి కారణమైంది.
ఈ నేపథ్యంలో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరి గింది. పత్తి, సోయా, మొక్కజొన్న, పసుపు, కూరగాయ పంటలతో పాటు పసులు తోటలు పదివేల ఎకరాల వరకు దెబ్బతిన్నట్టు అధికారులు చెపుతున్నారు. జిల్లాలో 20 చెరువులకు గండిపడగా ఐదు చెరువులు పూర్తిగా నీరు ఖాళీ అయ్యాయి. పంచాయతీరాజ్ రోడ్లు 35 చోట్ల తెగిపోగా, ఆర్ అండ్ బి రోడ్డు 25 చోట్ల ధ్వంసం అయినట్టు జిల్లా అధికారులు పేర్కొన్నారు. వర్షాల వల్ల సుమారు 100 ఇండ్లు దెబ్బతినగా 10 ఇండ్లు కూలిపోయినట్టు అధికారు లు పేర్కొంటున్నారు. వాగులు చెరువుల కింద గండుపడడంతో పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో రైతులు కన్నీరు మున్నూరుగా రోదిస్తున్నారు
బాసర వద్ద శాంతించిన గోదావరి
బాసర వద్ద రెండు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి ఆదివారం శాంతించింది. దీంతో బాసర ముంపు ప్రజలతోపాటు రైతులు ఉపశమనం పొందుతు న్నారు. బాసర వద్ద గోదావరి 31 అడుగుల ప్రవాహాన్ని కొనసాగించడంతో బాసర పట్టణంలో 500 ఇండ్లు వేలాది, ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. ఉధృతి కారణంగా ఆలయం వరకు ఆర్టీసీ బస్సులను రద్దు రైలు రాకపోకలు సైతం నిలిపివేశారు. శనివారం అర్ధరాత్రి నుంచి వరద తగ్గుముఖ పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం గోదావరి రెండు గడ్డలను ఆనుకొని మెట్ల వరకు ప్రవహిస్తున్నది.
వరద తగ్గినప్పటికీ ఇంకా లోతట్టు ప్రాంతాల్లో ఇండ్ల చుట్టూ నీరు నిలిచి ఉన్నది. ఇండ్లలో ఉన్న బురదను కుటుంబ సభ్యులు బయటకు తీస్తున్నారు. బాసర ఆలయం నుంచి గోదావరి వరకు వెళ్లే మార్గం నీటితో తేలిపోయింది. గోదావరి నది ఒడ్డున నిలిపి ఉన్న బోట్లు తిప్పలు వరదలో కొట్టుకపోవడంతో మత్స్య కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం రెవెన్యూ అధికారులు ముంపునకు గురైన కాలనీలో పర్యటించి, జరిగిన నష్టంపై వివరాలను సేకరించారు.
భద్రాచలం వద్ద తగ్గిన వరద
భద్రాచలం(విజయక్రాంతి): భద్రాచలం వద్ద శనివారం సాయంత్రం 6 గంటలకు 47.90 అడుగులకు గోదావరి ప్రవాహం తగ్గడంతో రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. ఆదివారం కూడా 47.90 అడుగులతో స్థిరంగా ఉంది. అయితే భద్రాచలంకు ఎగువ ప్రాంతంలో ఉన్న పేరూరు వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుతూ ఉండటంతో సోమవారం భద్రాచలం వద్ద కూడా తగ్గే అవకాశం ఉంది. కాగా భద్రాచలంలోని గోదావరి స్నాన ఘట్టాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి దీంతో యాత్రికులను స్థానానికి అనుమతించడం లేదు.
ప్రభుత్వం ఆదుకుంటేనే ప్రయోజనం
నిర్మల్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా రైతులు సాగు చేసుకుంటున్న పంటలకు తీవ్ర నష్టం జరిగిన నేపథ్యంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సర్వే నిర్వహించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పంటలు ఎదుగుతున్న దశలో వరద నీటిలో ముం పునకు గురి కావడంతో దిగుబడులు వచ్చే అవకాశం లేదని రైతులు కన్నీటి పర్యవంతం అవుతున్నారు. పంట పెట్టుబడికి ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చు పెట్టామని ఇప్పుడు నీరు తగ్గిన రెండో పంట వేసుకునే అవకాశం లేదని పేర్కొన్నారకు. ప్రభుత్వం వెంటనే ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.