24-12-2025 07:16:38 PM
- ఆసుపత్రులకు వచ్చే వారికి సౌకర్యాలు కల్పించాలి
- రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు
మంచిర్యాల,(విజయక్రాంతి): జిల్లాలో 100% గర్భవతుల నమోదు చేయాలని, ఆసుపత్రులకు వచ్చే వారికి అన్ని రకాలైన వైద్య సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని, మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని బుధ వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంసీహెచ్ లో అందిస్తున్న వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు గర్భవతులకు అన్ని రకాల పరీక్షలు చేయించాలని, వారిని 102 అంబులెన్స్ సహకారంతో స్కానింగ్ కేంద్రానికి తరలించాలి.
స్కానింగ్ కేంద్రంలో ఇచ్చిన ఈడీడీ ప్రకారం గర్భవతుల నమోదు ప్రక్రియను ఎన్సీపీ కార్డులో నమోదు చేయాలని, హైరిస్క్ గర్భవతులను గుర్తించి ప్రతి ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. అదే విధంగా మాతా శిశు సంరక్షణ కేంద్రంలో హెల్ప్ డెస్క్ నుంచి ఫోన్ చేసి గర్భిణీ వివరములను తెలుసుకోవాలన్నారు. గర్భవతులు ఏ ఆసుపత్రిలో ప్రసవం కోసం వస్తారో వారి వివరాలను ముందుగా తెలియజేయాలని, ఆసుపత్రికి వచ్చేవారికి సరైన సౌకర్యాలు కల్పించాలని, సాధారణ ప్రసవాలపైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సి సెక్షన్ లు తగ్గించడం ద్వారా తల్లి బిడ్డలు క్షేమంగా ఉంటారని, మాతా శిశు సంరక్షణలో ఇది ముఖ్యమైన పాత్ర అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ తెలిపారు. మహిళా ఆరోగ్యంతో ఉంటే ఆ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారని, కుటుంబ పరిస్థితులు మెరుగుపడతాయని, అదే విధంగా ఆర్థికంగా ఆరోగ్యంగా ఆ కుటుంబం ఉంటుందన్నారు. దీనితో గ్రామాలు, జిల్లాలు బాగుపడతాయి కావున ప్రతి ఆశ ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు గర్భిణీలకు, మహిళలకు, తల్లులకు, ఇంటి వారికి సాధారణ ప్రసవాలపై అవగాహన కలిగించాలన్నారు.
పుట్టిన పిల్లలకు నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో అత్యవసర సేవలకు సౌకర్యాలు కల్పించాలని, చిన్న పిల్లల వైద్యులను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా నవజాత శిశువులకు అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలను పరీక్షించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు కీటక జనిత వ్యాధులు, మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా లాంటివి ప్రబలకుండా అత్యవసర చర్యలు చేపట్టాలని, ప్రతి వారంలో రెండు రోజులపాటు డ్రైడే పాటిస్తూ కీటక జనిత వ్యాధులను తగ్గించుకోవాలని, వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధులు పట్ల జాగ్రత్త పడాలని సూచించారు.
మంచిర్యాల జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నందున వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భవతులు, బాలింతలు, రోగులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వారికి అవగాహన కలిగించాలని కోరారు. అసంక్రమణ వ్యాధులు జీవనశైలిలో మార్పుల ద్వారా వచ్చే వ్యాధుల వలన చాలా మంది కష్టాలు పడుతున్నందున 30 ఏండ్ల పైబడిన వారందరికీ పరీక్షలు చేసి బీపీ, డయాబెటిస్ ను గుర్తించి చికిత్సలు అందించాలని, క్యాన్సర్ కు సంబంధించిన రోగులు ఎక్కువ ఉన్నందున వారిని గుర్తించడం, వారికి వైద్య సాయం అందించడం చేయాలన్నారు.
మాతా శిశు సంరక్షణ కేంద్రంలో క్యాన్సర్ వార్డును రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ సందర్శించి సిబ్బందికి తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. జాతీయ కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమం నడుస్తున్నందున ఆరోగ్య కార్యకర్తలు వారి ప్రాంతాలలో గ్రామాలలో సర్వే కార్యక్రమాన్ని నిర్వహించి తగు చర్యలు చేపట్టాలని వైద్యులను ఆదేశించారు. జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మొబైల్ ఎక్స్చేంజ్ ద్వారా వైద్య సేవలను గ్రామాలలో అందించాలని, పబ్లిక్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా తొందరగా వ్యాధిగ్రస్తులను గుర్తించడం, చికిత్స చేయడం, అవగాహన కలిగించడం చేయాలన్నారు.
ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపైన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డాక్టర్ ఎస్ అనిత, జీజీహెచ్ సూపరింటెండ్ డాక్టర్ వేదవ్యాస్, ఆర్ఎంఓ (RMO) డాక్టర్ భీష్మ, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ శ్రీమన్నారాయణ, డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ అరుణ శ్రీ, డాక్టర్ ప్రసాద్, మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వైద్యం అందిస్తున్న ప్రసూతి వైద్యులు, డిపిఓ (DPO) ప్రశాంతి, పద్మ సిహెచ్ ఓ (CHO) లు వెంకటేశ్వర్లు, సత్తయ్య, నాందేవ్, డెమో (DEMO) బుక్క వెంకటేశ్వర్, విశ్వేశ్వర రెడ్డి, నర్సింగ్ అధికారులు, ఆశ ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.