బిట్‌కాయిన్ స్కాం శిల్పాశెట్టి దంపతుల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

19-04-2024 01:29:00 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18 : బిట్‌కాయిన్లతో మోసాలకు సంబంధించిన రూ.6,600 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా దంపతుల ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ గురువారం ప్రకటించింది. మొత్తంగా రూ.97.79 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేయగా అందులో జుహు ప్రాంతంలో శిల్పాశెట్టి పేరు మీద ఉన్న నివాస స్థలం, పుణెలో రాజ్‌కుంద్రా పేరు మీద ఉన్న నివాస భవనం, ఈక్విటీ షేర్లను ఈడీ అటాచ్ చేసింది. ఈ వ్యవహారం అంతా సింగపూర్ కేంద్రంగా ఫర్మ్ వేరియబుల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగినట్లు వెల్లడించింది. 2018లో జరిగిన ఈ స్కామ్‌కు సంబంధించి మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు అనేక కేసులు నమోదు చేయగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ వ్యవహారంలో రాజ్‌కుంద్రా లబ్ధి పొందారని స్పష్టం చేసింది.

వేరియబుల్ టెక్నాలజీ సంస్థ దేశవ్యాప్తంగా అనేక మంది పెట్టుబడిదారుల నుంచి 80,000 బిట్‌కాయిన్లు సేకరించగా, వాటి విలువ ప్రస్తుత ధరల ప్రకారం రూ.6,600 కోట్లు ఉంటుందని తెలిపింది. బిట్‌కాయిన్లలో పెట్టుబడులు పెడితే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని అమాయకులను నమ్మించారని, ఆ తర్వాత ఇన్వెస్టర్లను మోసం చేసి ఇతర దేశాల్లో ఆస్తుల కొనుగోలుకు ప్రయత్నించారని ఈడీ ప్రకటించింది.

ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్‌కుంద్రా 285 బిట్‌కాయిన్లు తీసుకున్నారని, వాటితో ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్ మైనింగ్ ఫర్మ్‌ను ఏర్పాటు చేయాలనుకున్నారని తెలిపింది. ఇప్పటికీ ఆ బిట్‌కాయిన్లు రాజ్‌కుంద్రా వద్దనే ఉన్నాయని, వాటి విలువ రూ.150 కోట్ల కంటే ఎక్కువే ఉంటుందని, అందుకే వారి ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ వివరించింది. కాగా ఈ స్కామ్‌లో ప్రధాన నిందితులుగా ఉన్న అజయ్ భరద్వాజ్, మహేంద్ర భరద్వాజ్ ఇప్పటికీ పరారీలో తిరుగుతున్నారని వెల్లడించింది. ఈ స్కాంతో సంబంధం ఉన్న ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నిఖిల్ మహజన్‌ను ఈడీ జనవరిలో అరెస్ట్ చేసింది. ఈయన దుబాయ్‌లో అనేక సెమినార్లు నిర్వహించి పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఒక బిట్‌కాయిన్ విలువ రూ.51 లక్షల వరకు ఉంది. కాగా ఈ బిట్‌కాయిన్ వ్యాపారం చట్టబద్ధమైనది కాదు.