టికెట్లపై కాంగ్రెస్‌లో అంతర్యుద్ధం!

19-04-2024 02:21:25 AM

హస్తం పార్టీలో కొలిక్కి రాని టికెట్ల వివాదం 

దీక్షలు, ఆందోళనలు చేస్తున్న పార్టీ నాయకులు 

కొన్ని కుటుంబాలకే పెద్దపీట వేయడమేంటని ఆందోళన

ప్రకటించని మూడు స్థానాలపై కొనసాగుతోన్న చర్చ

హైదరాబాద్, ఏప్రిల్ 18(విజయక్రాంతి): హస్తం పార్టీలో పార్లమెంట్ ఎన్నికల టికెట్ల పంచాయితీ ఇంకా కొనసాగుతోంది. ఒకటి, రెండు వర్గాలకే పెద్ద పీట వేసి.. మిగతా వర్గాలను పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు చెల్లు చీటి చెప్పారని, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సూచనలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా టికెట్ల కేటాయింపుల్లో సామాజిక న్యాయం పాటించడం లేదని నిరసనలు, దీక్షలకు వరకు నేతలు వెళ్లారు. ఒక్కో కుటుంబానికి రెండు, మూడు సీట్లు కేటాయించడం వల్ల.. పార్టీ కోసం కష్టపడిన వారి పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సర్వేల ప్రకారమే సీట్లు ఇచ్చామని చెప్పడం అంతా డొల్ల అని కొట్టిపారేస్తున్నారు. రాష్ట్రంలోని 17 స్థానాలకు 14 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఇంకా 3 స్థానాల్లో (ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్) అభ్యర్థులను ప్రకటించడంలో తర్జనభర్జన పడుతోంది. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ పెండింగ్ స్థానాలను ప్రకటించకపోవడం వల్ల ప్రచారానికి సమయం సరిపోదని నేతలు చెబుతున్నారు. ఇప్పటివరకు ప్రకటించిన వాటిలో 5 ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలు ఉండగా, మిగతా 9 స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికి 6 సీట్లు (చేవెళ్ల, మల్కాజిగిరి, నిజామాబాద్, భువనగిరి, నల్లగొండ, మహబూబ్‌నగర్) కేటాయించి పెద్ద పీట వేశారని, బీసీలకు కేవలం మూడు సెగ్మెంట్ల(సికింద్రాబాద్, మెదక్, జహీరాబాద్)లో మాత్రమే టికెట్లు ఇచ్చారని మండిపడుతున్నారు. 

రిజర్వ్‌డ్ స్థానాల్లో.. 

ఇక ఎస్టీ నియోజకవర్గాల్లోని రెండు సీట్లు ఒకటి ఆదివాసీ, లంబాడీలకు కేటాయించారు. మిగతా మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాల విషయంలో వివాదం కొనసాగుతోంది. మూడు సీట్లలో రెండు మాల సామాజిక వర్గానికి, ఒకటి బైండ్ల సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించింది. రాష్ట్రంలో దాదాపు 70 లక్షలకు పైగా ఉన్న మాదిగలకు ఒక్క సీటు కేటాయించకపోవడంతో ఆ వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ టికెట్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవి, ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీకి పెద్దపల్లి టికెట్ కేటాయించారు. ఇప్పటికే వివేక్ సోదరుడు వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.  దీంతో ఒకే కుటుంబం నుంచి ముగ్గురికి అవకాశం ఇస్తే.. పార్టీ కోసం పనిచేస్తున్న మిగతా వారి పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. వరంగల్ నుంచి బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుతూరు కడియం కావ్యకు ఇవ్వడంపైనా ఆ జిల్లా నేతలు భగ్గుమంటున్నారు. కడియం కావ్యను మార్చి మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. 

ఉమ్మడి నల్లగొండలోనూ...

ఇక ఉమ్మడి నల్లగొండలో మూడు కుటుంబాలే సీట్లను పంచుకుంటున్నాయని కాంగ్రెస్‌కు చెందిన మిగతా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ ఎంపీ టికెట్ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డికి కేటాయించారు. ఇప్పటికే జానారెడ్డి మరో తనయుడు జయవీర్‌రెడ్డి నాగార్జునసాగర్ ఎమ్యేల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి హుజూర్‌నగర్, ఆయన సతీమణి పద్మావతికి కోదాడ టికెట్లు ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ అసెంబ్లీ, ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి మునుగోడు అసెంబ్లీ సీటు ఇచ్చారు. 2018లో రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఆ తర్వాత కాంగ్రెస్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడం, ఉప ఎన్నిక రావడం అనివార్యమైంది. ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. తీరా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి మునుగోడు టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. మునుగోడులో అప్పటివరకు పార్టీ కోసం పనిచేసిన నాయకుల్లో కొందరు పార్టీని వీడాల్సి వచ్చిందని కాంగ్రెస్ నేతలు చెబతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.