ఓట్ల పండుగ

19-04-2024 02:22:30 AM

l మొదటి రోజు 48 నామినేషన్లు 

l ఆన్‌లైన్‌లో దాఖలు చేసే అవకాశం 

l ఎన్నికల ఖర్చులకు ప్రత్యేక బ్యాంకు ఖాతా 

l నామినేషన్ పత్రాలు జాగ్రత్తగా నింపాలి 

l తప్పులుంటే తిరస్కరణ ప్రమాదం 

l కేసుల పూర్తి వివరాలు బహిర్గతపర్చాలి 

l ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్లు 

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి ): రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొదటి రోజు బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 42 మంది 48 నామినేషన్లు వేశారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం గురువారమే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వెంటనే నామినేషన్ల దాఖలు మొదలైంది. ఈ సందర్భంగా సీఈవో వికాస్‌రాజు గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో 3.31 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నట్టు తెలిపారు. ఓటర్లలో 18  ఏళ్ల వయసు వారు దాదాపు 10 లక్షల మంది ఉన్నారని వెల్లడించారు. 

అభ్యర్థులు అన్‌లైన్‌లో కూడా నామినేషన్లు దాఖలు చేయవచ్చని చెప్పారు. అన్‌లైన్ ద్వారా నామినేషన్ వేస్తే.. వాటికి సంబంధించిన నకలును ఈ నెల 24 లోపు సంబంధిత రిటర్నింగ్ అధికారికి అందజేయాలని సూచించారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను జాగ్రత్తగా నింపాలని కోరారు. ఎన్నికల ఖర్చుపై అభ్యర్థి కొత్తగా బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేయాలని, ఎన్నికల ఖర్చులన్నీ ఆ అకౌంట్ ద్వారానే జరపాలని సూచించారు. బ్యాంకు ఖాతా ఎక్కడైనా ఓపెన్ చేయవచ్చని తెలిపారు. ఒక్కో అభ్యర్థి మూడు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చని చెప్పారు.

వాటితో పాటు కొత్తగా తీయించుకొన్న 5 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు కూడా సమర్పించాలని తెలిపారు. ఫొటోలు స్పష్టంగా ఉండాలని, టోపీలు, కళ్లద్దాలు పెట్టుకుని ఉన్న ఫొటోలు ఇవ్వకూడదని సూచించారు. అఫిడవిట్‌లోని ప్రతి పేజీలో అభ్యర్థులు సంతకం చేయాలని, ప్రతి కాలమ్ నింపాలని కోరారు. నామినేషన్ కార్యక్రమం ఈ నెల 25 వరకు, నామినేషన్ల పరిశీలన 26న ఉంటుందని పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. 

9,500 సమస్యాత్మక కేంద్రాలు 

నామినేషన్ వేసే అభ్యర్థి రూ.25 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని వికాస్‌రాజ్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల అభ్యర్థులకు 15 శాతం తగ్గింపు ఉంటుందని చెప్పారు. రాజకీయ పార్టీలు అభ్యర్థులకు సంబంధించి ఫామ్ ఏ, ఫామ్ బీలను సీఈవో కార్యాలయంతో పాటు రిటర్నింగ్ అధికారికి కూడా అందజేయాలని కోరారు. పోటీచేసే అభ్యర్థులకు పోలీస్‌స్టేషన్లో కేసులు ఉంటే ప్రముఖ దినపత్రికలో ప్రకటించాలని సూచించారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్స్ సరిపడా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 9,500 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు చెప్పారు. 51 అసెంబ్లీ నియోజక వర్గాల్లో భారీగా నగదు ఖర్చు చేసే అవకాశం ఉందని, అక్కడ గట్టి నిఘా పెట్టినట్లు తెలిపారు.

19 ఎన్‌ఫోర్స్‌మెంట్  ఏజెన్సీలు, ఒక నోడల్ అధికారిని ఈసీఐ నియమించిందని పేర్కొన్నారు. 204 అంతర్‌రాష్ట్ర, 444 ప్లయింగ్ స్కాడ్స్, 160 కేంద్ర సంస్థల బలగాలకు సంబంధించి ఇప్పటికే 60 కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని వివరించారు. మరో 100 కంపెనీలు వస్తాయని తెలిపారు. ప్రతి జిల్లాలో 16 మంది నోడల్ అధికారులు ఉండగా, 2,94 లక్షల మంది ఎన్నికల డ్యూటీలో ఉంటారని చెప్పారు. వివిధ జిల్లాల్లో ఇప్పటివరకు 2 వేల ఫిర్యాదుల వచ్చాయని తెలిపారు. 

ఓటింగ్ శాతం పెంచడానికి చర్యలు.  

పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి చర్యలు చేపట్టినట్లు వికాస్‌రాజ్ తెలిపారు. ఎన్నికల పోల్ చీటిలను కూడా నామినేషన్లు ఘట్టం ముగిసిన తర్వాత పంపిణి చేస్తామని చెప్పారు. వేసవి కావడంతో ఎండవేడిమి నుంచి రక్షణకు చర్యలు తీసుకుంటామని, పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీళ్లు, మెడికల్ బృందాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. హెల్ప్‌డెస్క్‌ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్‌కు ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు సమాధానమిచ్చేందుకు వారం రోజుల సమయం కావాలని కోరారని చెప్పారు. 

మొదటిరోజు నామినేషన్లు వేసింది వీళ్లే

అభ్యర్థి నియోజకవర్గం పార్టీ

ఈటల రాజేందర్ మల్కాజ్‌గిరి బీజేపీ

ఈటల జమున మల్కాజ్‌గిరి బీజేపీ

డీకే అరుణ మహబూబ్‌నగర్ బీజేపీ

రఘునందన్‌రావు మెదక్ బీజేపీ

పోతుగంటి భరత్ నాగర్‌కర్నూల్ బీజేపీ

శానంపుడి సైదిరెడ్డి నల్లగొండ బీజేపీ

మల్లు రవి నాగర్‌కర్నూల్ కాంగ్రెస్

నీలం మధు మెదక్ కాంగ్రెస్

సురేష్ షెట్కార్ జహీరాబాద్ కాంగ్రెస్

ప్రచార హోరు మొదలు

నామినేషన్ల పర్వం మొదలు కావటంతో అభ్యర్థులు ప్రచార హోరు పెంచుతున్నారు. తొలిరోజు పలువురు ప్రముఖులు నామినేషన్లు వేశారు. నామినేషన్లకు భారీ ర్యాలీగా కదిలిన నేతలు,సాయంత్రం కూడా ప్రత్యేకంగా ర్యాలీలు చేపట్టారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గానికి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. కిషన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు కూడా నేడు నామినేషన్ వేయనున్నారు. కాగా, బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి దంపతులు కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పురి సమక్షంలో గురువారం బీజేపీలో చేరారు.   

 స్వతంత్రులుగా మహబూబ్‌నగర్‌లో ఒకరు, మెదక్‌లో నలుగురు, చేవెళ్లలో ముగ్గురు, పెద్దపల్లిలో నలుగురు, ఆదిలాబాద్‌లో ఇద్దరు, కరీంనగర్‌లో ఇద్దరు, మల్కాజ్‌గిరిలో ఆరుగురు, జహీరాబాద్, నిజామాబాద్‌లో ఒక్కొక్కరు, నల్లగొండలో ముగ్గురు, భువనగిరిలో ముగ్గురు, వరంగల్‌లో ముగ్గురు, మహబూబాబాద్, ఖమ్మంలో ఒక్కొక్కరు నామినేషన్లు దాఖలు చేశారు.