సర్కారు బడులకు కొత్త సొబగులు!

19-04-2024 01:30:26 AM

l వేసవి సెలవుల్లో పాఠశాలలకు మరమ్మతులు

l మౌలికవసతులు కల్పనకు ప్రభుత్వం పెద్దపీట

l జూన్ 11 కల్లా పనులు పూర్తి చేసేలా టార్గెట్

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. పదో తరగతి పరీక్షలు ఇటీవల పూర్తి కాగా ఈ నెల 15 నుంచి  ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎస్‌ఏ (సమ్మెటివ్ అసెస్‌మెంట్) పరీక్షలు జరుగుతున్నాయి. ఈ విద్యాసంవత్సరానికి ఈనెల 23వ తేదీ చివరి పనిదినం కాగా 24వ తేదీ నుంచి జూన్ 11 వరకు విద్యార్థులందరికీ వేసవి సెలవులను ప్రకటించనున్నారు.

మళ్లీ కొత్త విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ వేసవి సెలవుల్లో ఆయా పాఠశాలల్లో ఉన్న చిన్న, పెద్ద మరమ్మతు పనులను పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పెండింగ్ పనులతో పాటు పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను మహిళా సంఘాలతో ఏర్పాటు చేసే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు ప్రభుత్వం ఇటీవల అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కమిటీలను ఏర్పాటు చేసి, వారిచేత బ్యాంక్ ఖాతాలను తెరిపించడం, ఇంజినీరింగ్ అధికారులతో పనుల అంచనాలు, అనుమతులు, ఇన్‌స్పెక్షన్ తదితర పనులు అధికారులు చేపడుతున్నారు. 

10 రకాల పనులు...

పాఠశాలల్లో మొత్తం 10 రకాల పనులను అధికారులు చేపట్టనున్నారు. స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన, టాయిలెట్స్ నిర్మాణం, ప్రహరీ గోడలు, తరగతి గదులు, తలుపులు, మంచినీటి వసతి, విద్యుద్దీకరణ పనులు, శానిటేషన్  సహా సివిల్స్ వర్క్స్ పనులతోపాటు మేజర్, మైనర్ మరమ్మతులు కొంత కాలంగా పేరుకుపోయాయి. వీటన్నింటిని వేసవి సెలవుల్లో పూర్తి చేయనున్నారు. రాష్ట్రంలో 30,023 పాఠశాలలుండగా, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మన ఊరు బడి, మన బస్తీ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో 9,153 పాఠశాలల్లో పనులను ప్రారంభించారు. ఇందులో 1,200 వరకు పాఠశాలల పనులు పూర్తవడంతో వాటిని గత సంవత్సరంలోనే ప్రారంభించారు.

మరికొన్ని పాఠశాలల్లో పనులు జరుగుతున్న క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఆ పనులు పెండింగ్‌లో పడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత కొద్ది రోజుల క్రితం విద్యాశాఖపై సమీక్ష చేసిన ఆయన పాఠశాల్లోని మౌలికవసతుల కల్పనపై దృష్టి సారించారు. అయితే కొత్తగా ఏర్పడ్డ రేవంత్ సర్కార్ మన ఊరు బడి, మన బస్తీ పేరును ఉపయోగించకుండా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతోనే పనులను చేపడుతోంది. ఇప్పటికే పాఠశాలల్లో పనులు చేపట్టేందుకు  రూ.1,100 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటితో పనులను చేపట్టేందుకు అధికారులు అంచనాలను రూపొందిస్తున్నారు.

తూతూమంత్రంగానే అమ్మ ఆదర్శ కమిటీల ఏర్పాటు

హైదరాబాద్‌తోపాటు మరికొన్ని జిల్లాలోని పాఠశాల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను వేయకుండానే బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయాలని విద్యాశాఖాధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అధికారుల ఒత్తిడిని తట్టుకోలేకనే కొందరు హెచ్‌ఎంలు ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండానే తూతూమంత్రంగా కమిటీల సభ్యుల పేర్లు రాసి బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు అధికారులు ఈ రకంగా ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.