బీజేపీది అతి.. కాంగ్రెస్‌ది కల

24-04-2024 02:13:32 AM

l బీజేపీకి ఎన్నికల్లో 200 సీట్లు కూడా రావు

l కాంగ్రెస్‌కు 100 స్థానాలు వచ్చినా గొప్పే

l బీఆర్‌ఎస్‌ను పది సీట్లలో గెలిపించండి

l రంజిత్‌రెడ్డి, కొండా నమ్మకద్రోహులు

l చేవెళ్ల ఎన్నికల ర్యాలీలో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

l రాహుల్ ప్రధాని అని కాంగ్రెస్ నేతల కలలు

l కేంద్రంలో రాష్ట్రం తరఫున చక్రం తిప్పుదాం

హైదరాబాద్/రంగారెడ్డి, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో బీఆర్‌ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. కేంద్రం మన మాట వినాలంటే 8 సీట్లలో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాజేంద్రనగర్‌లో చేవెళ్ల బీఆర్‌ఎస్ అభ్యర్థి కాసాని జ్ఙానేశ్వర్ ముదిరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్‌గౌడ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, దయానంద్‌తో కలిసి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘లోక్‌సభ ఎన్నికల్లో తమకు 400 సీట్లు వస్తాయని బీజేపీ నేతలు చెప్పుకొంటున్నారు. కానీ 200 సీట్లు దాటడం కూడా కష్టమే. మరోవైపు రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారు. ఆ పార్టీకి 100 నుంచి 150 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా బీఆర్‌ఎస్ పార్టీ సీట్లు కీలకమవుతాయి. అప్పుడే కేంద్రం మనం చెప్పినట్లు వినే అవకాశం ఉంటుంది’ అని తెలిపారు. 

పాలుతాగి రొమ్ముగుద్దే రకం

చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే వ్యక్తులని కేటీఆర్ విమర్శించారు. వారిని బీఆర్‌ఎస్ పార్టీ అక్కున చేర్చుకొని రాజకీయ ఎదుగుదలకు పునాదులు వేస్తే, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బయటకు వెళ్లిపోయి విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇలాంటి మోసకారులకు చేవెళ్ల ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 

బీసీల బాహుబలి కాసాని

రాష్ట్రంలో బలహీన వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత కాసాని జ్ఙానేశ్వర్‌కు దక్కుతుందని కేటీఆర్ అన్నారు. జ్ఞానేశ్వర్ బలహీనవర్గాల బహుబలి అని అభివర్ణించారు. ఇప్పటివరకు చేవెళ్ల నుంచి బీసీ నేత ఏవరూ పోటీచేయలేదని, ఇప్పుడు బీసీ నేత కాసానిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీకి రాష్ట్రంపై ప్రేమ ఉంటే పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్‌తో దేశ ప్రజలంతా వంచించబడ్డారని విమర్శించారు. పదేళ్ల పాలనలో బీజేపీ రాష్ట్రానికి, చేవెళ్లకు చేసిందేమీ లేదని అన్నారు. బీజేపీ మత, కుల రాజకీయం చేస్తున్నదని ఆరోపించారు.

దేశంలో ధరలు పెరిగి సామన్య ప్రజలు అల్లాడుతున్నారని, బండి సంజయ్ మాత్రం మోదీ దేవుడు అంటున్నారని మండిపడ్డారు. మోదీ ఎందుకు దేవుడో చెప్పమంటే తెల్లముఖం వేస్తాడని ఎద్దేవాచేశారు. చేవెళ్లకు బీజేపీ ఏం చేసిందని ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇక్కడ ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. బీజేపీని రాష్ట్రంలో అడ్డుకునేది బీఆర్‌ఎస్ మాత్రమేనని స్పష్టంచేశారు. ఈటల రాజేందర్, అర్వింద్, రఘునందన్‌రావు, సోయం బాపురావువు ఓడించింది బీఆర్‌ఎస్ పార్టీయేనని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పోటీచేసేందుకే భయపడేలా చేసిందని చెప్పుకొచ్చారు. 

10 సీట్లివ్వండి చక్రం తిప్పుదాం 

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను పదిసీట్లలో గెలిపిస్తే కేంద్రంలో తెలంగాణ తరఫున చక్రం తిప్పుతామని కేటీఆర్ అన్నారు. కేంద్రంలో ఎవరు అధికారం చేపట్టాలన్నా మనవద్దకే రావాల్సి ఉంటుందని తెలిపారు. బీఆర్‌ఎస్‌కు 8 నుంచి 10 ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వమున్నా మన మాట వింటుంది అని చెప్పారు. 

రేవంత్‌రెడ్డి మోసకారి

బాహుబలి సినిమాలాగా రేవంత్‌రెడ్డిలో మోసం పార్ట్ 1, పార్ట్ 2 అనే సీక్వెల్ పెట్టుకొన్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఒకసారి ఆరు గ్యారెంటీలను నమ్మి మోసపోయింది చాలని, మళ్లీ మోస పోతే అది మన తప్పే అవుతుందని ఓటర్లను హెచ్చరించారు. కేసీఆర్ పదేళ్ల అభివృద్ధి పాలన ఒకవైపు..కాంగ్రెస్ వందరోజుల అబద్ధాల పాలన మరోవైపు ఉన్నాయని తెలిపారు. చేవెళ్లను అభివృద్ధి చేసుకోవడంతో పాటు 111 జీవోను కూడా ఎత్తివేసి ప్రజల సమస్యను తీర్చామని చెప్పారు. రంజిత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడే ఆ పార్టీ చతికలిపడిందని అన్నారు.