ఓటమే విజయానికి నాంది!

24-04-2024 01:22:49 AM

రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్రెండ్ 

ఎమ్మెల్యేలుగా ఓడి ఎంపీలుగా పోటీ 

సానుభూతి కలిసి వస్తుందనే ధీమా..? 

గత ఎన్నికల్లో ఆరుగురు, ఇప్పుడు పది మంది పోటీ  

కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డికి ఈ పద్ధతి కలిసొచ్చింది

ఒకరు కేంద్రమంత్రి, మరొకరికి సీఎంగా అవకాశం

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాం తి): ‘ఓటమి విజయానికి నాంది’.. ఇప్పుడు రాజకీయాల్లో ఈ కొత్త ట్రెండ్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులు సానుభూతితో తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో గెలు స్తున్నారు. తద్వారా ఢిల్లీలో పలుకుబడి పెంచుకుని రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఎదుగుతున్నారు. ఇది వారికి రాజకీయంగా, పదవుల పరంగా అదనపు మైలేజీని ఇస్తోం ది. 2018 శాసనసభ ఎన్నికలను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన వివిధ పార్టీలకు చెందిన ఆరుగురు కీలక నేతలు 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పుడు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు మరోసారి లోక్‌సభ బరిలో నిలిచారు.  

బీజేపీ నేతలే అధికం.. 

ఎమ్మెల్యేగా ఓడిన వివిధ పార్టీలకు చెంది న పలువురు పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ నుంచి దాదాపు 10 మంది నేతలు ఉన్నారు. బీజేపీ నుంచి ఆరుగురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఉండగా, బీఆర్‌ఎస్ తరఫున మరో ఇద్దరు ఎంపీలుగా పోటీ పడుతున్నా రు. మల్కాజిగిరి పార్లమెంట్  నియోజకవర్గం నంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్.. అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం కేసీఆర్‌పై గజ్వేల్ నియోజకవర్గంతో పాటు హుజూరాబాద్‌లో బీజేపీ నుంచి బరిలోకి దిగారు. ఈ రెండు స్థానాల్లోనూ ఈటల ఓటమి చెందారు. ఇప్పుడు ఎంపీగా గెలిచి ఢిల్లీ బాట పట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు. అందుకు తగినట్లే నియోజకవర్గంలో గట్టిగానే ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఓటర్లు ఎవరికి అనుకూలమైన తీర్పు ఇస్తారో వేచి చూడాల్సిందే. 

బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ కూడా 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిన తర్వాత 2019లో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచారు. ఈ సారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆయన.. మళ్లీ కరీంనగర్ ఎంపీ స్థానా నికి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 

మెదక్ పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే రఘు నందన్‌రావు కూడా.. అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓటమి చెం దారు. అయితే, మెదక్ పరిధిలో  మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్ధిపేట నియోజక వర్గాలు ఉన్నాయి. అందువల్ల ఇక్కడ విజయం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ గత రెండు పర్యాయాలుగా బీఆర్‌ఎస్ నుంచి వర్దన్నపేట ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. అయితే బీఆర్‌ఎస్ నుంచి వరంగల్ పార్లమెంట్‌కు పోటీ చేయాలని ఆశించినా.. అక్కడ టికెట్ రాకపోవడంతో బీజేపీలోకి వెళ్లి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. 

నిజామాబాద్‌లో ఇద్దరు.. 

నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు నిజామాబాద్ లోక్‌సభ నుంచి రెండోసారి పోటీకి దిగుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనుకున్న అర్వింద్‌కు మళ్లీ ఎంపీగానే పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన సన్నిహిత వర్గా లు చెబుతున్నాయి. కాంగ్రెస్ నుంచి నిజామాబాద్ లోక్‌సభకు బరిలో ఉన్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో జరిగిన అసెం బ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన జీవన్‌రెడ్డి, ఆ తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అయితే నిజామాబాద్ నుంచి బీజేపీ, కాంగ్రెస్ నుం చి పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారే కావడం గమనార్హం.  

పెద్దపల్లి లోక్‌సభ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నుంచి బరిలోకి దిగి న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా ధర్మపురి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. బీఆర్‌ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న కొప్పుల ఈశ్వర్.. మాజీ సీఎం కేసీఆర్‌కు నమ్మకస్తుడిగా ఉంటున్నారు. ఎమ్మె ల్యేగా ఓడినప్పటికీ పెద్దపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా కొప్పులను కేసీఆర్ బరిలోకి దిం పారు. కొప్పుల ఈశ్వర్  సీనియారిటీ, అనుభవం లోక్‌సభ ఎన్నికల్లో కలిసి వస్తుందని బీఆర్‌ఎస్ పార్టీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.  

బీఎస్పీ నుంచి బయిటికి వచ్చి.. 

బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ బీఎస్పీ అభ్యర్థిగా రంగంలోకి దిగి ఓడారు. అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో బీఎస్పీ కలిసి పోటీ చేయాలని భావించారు. అందుకు ఆ పార్టీ చీఫ్ మాయవతి ఒప్పుకోకపోవడంతో.. బీఎస్పీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు ప్రవీణ్‌కుమార్. నాగర్‌కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఆర్‌ఎస్పీకి చట్టసభల్లో అడుగుపెట్టే యోగం కలుగుతుందా? లేదా అనేది నాగర్‌కర్నూల్ ఓటర్లు నిర్ణయించనున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి మెదక్ లోక్ సభకు పోటీ చేస్తున్న నీలం మధు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్‌పీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి పఠాన్‌చెరు టికెట్ ఆశించారు. కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యే టికెట్  సాధించుకున్నారు. టికెట్ ఇస్తున్నామని ప్రకటించిన ఏఐసీసీ..  రెండు రోజులు గడవక ముందే ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నది. వెంటనే ఆయన కాంగ్రెస్‌కు రాజీనా మా చేసి బీఎస్పీలో చేరడం.. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. తీరా పార్లమెం ట్ ఎన్నికలు వచ్చేసరికి బీఎస్పీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్‌లో చేరారు. మెదక్ ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. 

నల్లగొండ  పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శానంపుడి సైదిరెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. ఇప్పుడు బీజేపీ నుంచి నల్లగొండ లోక్‌సభకు పోటీ పడుతున్నారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. నల్లగొండ లోక్‌సభకు పోటీ చేసి విజయం సాధించారు. ఉత్తమ్ రాజీనామాతో హుజూర్‌నగర్‌కు వచ్చిన ఉపఎన్నికలో సైదిరెడ్డి బీఆర్‌ఎస్ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. 

ఒకే పార్టీ నుంచి గెలుపొందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్‌కు పోటీలో ఉండి ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, సికింద్రా బాద్ నుంచి పద్మారావుగౌడ్ ఇద్దరు బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అయితే దానం నాగేందర్ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 

కేంద్రమంత్రి స్థాయికి..

2018 అసెంబ్లీ ఎన్నికలను గమనిస్తే..  పలువురు నేతలకు ఎమ్మెల్యేలుగా ఓడిపోవడం కలిసివచ్చిందనే చెప్పాలి! ఓట మి మరో విజయానికి నాంది అవుతుందని ఒకరిద్దరి విషయంలో రుజువైంది. ప్రస్తుత కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి 2018లో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా అవకాశం లభించింది. అనంతరం 2021లో కేంద్ర పర్యటక, సాంస్కృతిక, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఎంపీగా గెలవడంతోనే కిషన్‌రెడ్డి లక్కీఛాన్స్ కొట్టారని ఆ పార్టీ నేతలే చెబుతుంటారు.  ఇప్పుడు మరోసారి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా బరి లోకి దిగారు. బండి సంజయ్ కూడా ఎమ్మెల్యేగా ఓటమి తర్వాత కరీంనగర్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులయ్యారు.ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, పెద్దపెల్లి ఎంపీ వెంకటేశ్ నేత తొలుత ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన తర్వాతే పార్లమెంటు సభ్యులుగా గెలిచారు. 

ఎంపీ నుంచి సీఎంగా.. 

ఇక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా 2018 ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి చెందిన రేవంత్‌రెడ్డి, ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. ఎంపీ గా గెలవడమే రేవంత్‌రెడ్డికి కలిసొచ్చిందని చెబుతుంటారు. ఎంపీగా ఢిల్లీలో ఉండటం, అధిష్టానం పెద్దలతో సత్సంబంధాలు పెంచుకోవడానికి సహకరిం చింది. పీసీసీ చీఫ్ కావడానికి మార్గం ఏర్పడింది. పార్టీ పగ్గాలు చేపట్టాక అసెం బ్లీ ఎన్నికలు రావడం.. ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఇప్పుడు సీఎంగానూ బాధ్యతలు చేపట్టా రు. ఎమ్మెల్యేగా ఓటమే రేవంత్‌కు ఎంపీ, సీఎం పదవులు దక్కాయని చెబుతుంటారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొం డ నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత భువనగరి లోక్‌సభకు పోటీ చేసి గెలుపొందారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హూజుర్‌నగర్‌లో నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రాజీనామా చేసి నల్లగొండ నుంచి ఎంపీగా విజయం సాధించారు.