కొనుగోళ్లు లక్ష్యం చేరేనా!

24-04-2024 01:34:01 AM

వరంగల్ టార్గెట్ 1.50 లక్షల టన్నులు

పూర్తిస్థాయిలో ప్రారంభం కాని కేంద్రాలు

జనగామ ఘటనతో అధికారులు అప్రమత్తం

వరంగల్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): వరంగల్ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. అధికారు ల మధ్య సమన్వయం లోపించడంతో కేం ద్రాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాని పరిస్థితి నెలకొన్నది. వానకాలంలో కొనుగోలు కేంద్రాల ద్వారా నిర్దేశించుకున్న లక్ష్య సాధనలో అధికారులు విఫలమయ్యారనే ఆరోప ణలున్న నేపథ్యంలో యాసంగిలోనైనా టార్గెట్ పూర్తి చేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల మొదటి వారంలో నే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదని తెలుస్తోంది. ఒకవైపు వాతావరణంలో వస్తున్న మార్పులు రైతులను ఆందోళనకు గురిచేస్తుండగా.. అధికారులు పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారుతున్నది. 

207 కేంద్రాలకు ప్రతిపాదనలు

వరంగల్ జిల్లాలోని 13 మండలాల పరిధిలో మొత్తం 207 ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించినప్ప టికీ ఇప్పటివరకు ఐకేపీ, మెప్మా, పీఎసీఎస్‌ల ద్వారా 186 కేంద్రాలు ప్రారంభించారు. అయితే కేంద్రాలు ప్రారంభించినప్పటికీ కొనుగోళ్లు నామమాత్రంగా జరుగుతున్నట్టు తెలుస్తున్నది. మిగతా కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. 

లక్ష్యం 1.50 లక్షల మెట్రిక్ టన్నులు

యాసంగిలో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణను అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలోని 207 కొనుగోలు కేంద్రాల ద్వారా టార్గెట్ పూర్తిచేసేందకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. అయితే తాలు, తేమ విషయంలో రైతులకు ఎలాంటి అవగాహన కల్పించకపోవడంతో కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన తర్వాత సమస్యలు ఎదురవుతున్నాయి. ఈక్రమంలోనే రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించకుండా చూడాల్సిన ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు న్నాయి. వానకాలంలో కూడా వ్యాపారులు రైతుల వద్ద నుంచే నేరుగా కొనుగోలు చేశారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితులు కనిపిస్తుండటం గమనార్హం. 

కొరవడిన సమన్వయం

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారుల్లో సమన్వయం కొరవడినట్టు తెలుస్తోంది. రైతుల నుంచి ధాన్యం సేకరించే క్రమంలో పౌర సరఫరాల సంస్థ, వ్యవసాయ శాఖ, రైస్‌మిల్లర్లు, మార్కెటింగ్ శాఖ, డీఆర్డీఏ, సహకార శాఖలు సంయుక్తంగా జిల్లాలో ఎంత ధాన్యం సేకరించాలో టార్గెట్ నిర్ణయించడం జరుగుతుంది. అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత దాని గురించి పట్టించుకునే వారు కరువయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతోపాటు డబ్బులు ఆలస్యంగా వచ్చే పరిస్థితుల్లో రైతులు కల్లాల వద్దే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నట్టు తెలుస్తోంది. 

మద్దతు ధర గాలికి..

ధాన్యంకు కనీస మద్దతు ధరగా క్వింటాల్‌కు గ్రేడ్ రకానికి రూ.2,203, సాధారణ రకానికి క్వింటాల్‌కు రూ.2,183 ప్రకటించారు. అయితే వాతావరణంలో వస్తున్న మార్పులు, రైతుల అవసరాలను అవకాశంగా తీసుకుంటున్న వ్యాపారులు గ్రామీణ ప్రాంతాల్లోని దళారుల ద్వారా నేరుగా రైతుల నుంచే ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తేమ, తాలును సాకుగా చూపుతూ క్వింటాల్ కేవలం రూ.1,600 మాత్రమే చెల్లిస్తున్నారు. జనగామ మార్కెట్‌లో ఇటీవల జరిగిన ఘటన నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే భావన వ్యక్తమవుతోంది.

రైతులకు అవగాహన కల్పిస్తున్నాం 

రైతు వేదికలలో ఏఈవోల ద్వారా ధాన్యం విక్రయాలపై అవగాహన కల్పిస్తు న్నాం. వరి కోతలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. ఆరబెట్టిన ధాన్యం తీసుకు వస్తే ఎలాంటి సమస్యలుండవు. ఆ విషయంలో రైతులకు మా శాఖ తరఫున  సలహాలు ఇస్తున్నాం . వానకాలంలో లక్ష్యం చేరుకోని మాట వాస్తవమే. ఇప్పటికైనా రైతులు ప్రైవేటు వ్యాపారులకు కాకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకుంటేనే లాభదాయకంగా ఉం టుంది. పూర్తిస్థాయి లో కేంద్రాలు ప్రారంభిస్తాం. గన్నీ సంచు లు, టార్ఫాలిన్ షీట్ లు అందుబాటులో ఉంచుతున్నాం.