భారీగా తగ్గిన బంగారం

24-04-2024 01:17:32 AM

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు తగ్గుముఖంపట్టడంతో పాటు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ అధిక వడ్డీ రేట్లను ఎక్కువకాలం కొనసాగిస్తుందన్న అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర క్షీణించిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధి చెప్పారు. రానున్న రోజుల్లో ఎంసీఎక్స్‌లో బంగారం ధరకు రూ.70,000 సమీపంలో మద్దతు ఉన్నదని, ఈ స్థాయిని కోల్పోతే రూ.68,500 స్థాయికి దిగిరావచ్చని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది అంచనా వేశారు.

హైదరాబాద్, ఏప్రిల్ 23: అదేపనిగా పరుగుపెట్టిన పుత్తడి వరుసగా రెండో రోజూ తగ్గింది. ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు చల్లబడిన సంకేతాలు వెలువడటంతో  ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ఫ్యూచర్స్ ధర ఒక్కసారిగా గరిష్ఠస్థాయి నుంచి రెండు రోజుల్లో సుమారు 110 డాలర్ల మేర తగ్గి 2,310 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. దీంతో దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో సైతం 10 గ్రాముల పసిడి ఫ్యూచర్స్ ధర 71,000 దిగువకు పడిపోయింది. 

ఈ క్రమంలో హైదరాబాద్ స్టాప్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర మంగళవారం ఒక్కరోజే  రూ. 1,530 క్షీణించి రూ. 72,160 వద్ద నిలిచింది. వరుస రెండు రోజుల్లో 2,080 మేర తులం ధర దిగివచ్చింది. గత వారాంతంలో నగరంలో ఈ ధర రూ. 74,340 వద్దకు చేరి కొత్త రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే.  22 క్యారట్ల పుత్తడి తులం ధర రూ.1,400 తగ్గి రూ.66,150 వద్ద పలుకుతున్నది. ఇది రెండు రోజుల్లో రూ.1,900పైగా తగ్గింది. 

రూ.2,500 దిగిన వెండి

పసిడి బాటలోనే వెండి ధర సైతం మంగళవారం భారీగా తగ్గింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు వెండి ధర 5 శాతం మేర క్షీణించి 25.5 డాలర్లకు చేరింది. హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర ఒక్క రోజులోనే రూ.2,500 తగ్గి రూ.86,500 స్థాయికి దిగివచ్చింది.