14 ఏండ్ల గరిష్ఠానికి వాణిజ్య కార్యకలాపాలు

24-04-2024 01:10:40 AM

హెచ్‌ఎస్‌బీసీ ఇండియా కాంపోజిట్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23:  భారత్‌లో వాణిజ్య కార్యకలాపాలు ఈ ఏడాది ఏప్రిల్‌లో మరింత వేగవంతమయ్యాయని ఒక అంతర్జాతీయ ఇండెక్స్ సూచిస్తున్నది. ఎస్ అండ్ పీ గ్లోబల్, హెచ్‌ఎస్‌బీసీలు రూపొందించిన ఫ్లాష్ ఇండియా కాంపోజిట్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 2024 ఏప్రిల్ నెలలో 62.2కు పెరిగింది. మార్చి నెలలో ఇది 61.8గా ఉంది. ఆయా కంపెనీలు వాటి వాణిజ్య అవకాశాలపై ఎంత ఆశాభావంతో ఉన్నాయన్న వివిధ సర్వేల ద్వారా ఈ ఇండెక్స్‌ను రూపొందిస్తారు. ఇండెక్స్ 50లోపు ఉంటే వాణిజ్యం బలహీనపడుతున్నట్టు, 50పైన ఉంటే వృద్ధిచెందుతున్నట్టు పరిగణిస్తారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య కార్యకలాపాల్ని అంచనా వేయడానికి తయారీ, సర్వీసుల పీఎంఐ ఇండెక్స్‌లనే మార్కెట్ వర్గాలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి.

కొత్త ఆర్డర్ల పెరుగుదలతో భారత్‌లో తయారీ, సర్వీసు రంగాలు పటిష్టమైన పనితీరును ప్రదర్శిస్తున్నాయని, దీంతో కాంపోజిట్ ఇండెక్స్ 2010 జూన్ తర్వాత అత్యంత గరిష్ఠస్థాయికి పెరిగిందని హెచ్‌ఎస్‌బీసీ చీఫ్ ఇండియా ఎకానమిస్ట్ ప్రంజుల్ భండారీ తెలిపారు. ఏప్రిల్ నెలలో ముఖ్యంగా సర్వీసుల వృద్ధి వేగం పుంజుకున్నదని, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఆర్డర్లు పెరిగాయాని భండారి వివరించారు. అలాగే ఏప్రిల్‌లో తయారీ రంగ మార్జిన్లు మెరుగయ్యాయని, పెరిగిన ముడి వ్యయాల్ని పటిష్ఠమైన డిమాండ్ కారణంగా కంపెనీలు వినియోగదారులకు మళ్లిస్తున్నాయన్నారు. తయారీ కంపెనీలు వాటి ఉద్యోగుల సంఖ్యను భారీగా పెంచుకుంటున్నాయని, ముడి పదర్థాల కొనుగోలు పెరిగి ందని వివరించారు. ఏప్రిల్ నెలలో సర్వీసుల పీఎంఐ 61.7 వద్దకు, తయారీ పీఎంఐ 59.1 స్థాయికి చేరింది.