బిందెలను చూసి హామీలివ్వాల్సింది

24-04-2024 01:39:23 AM

l హామీలు నెరవేర్చలేక వాయిదాలు వేస్తున్నారు

l ఇందిర రాకముందే మెదక్‌లో పరిశ్రమలున్నయ్

l రేవంత్‌రెడ్డికి రఘునందన్‌రావు కౌంటర్

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీలకు సంబంధించిన వ్యాఖ్యలపై మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు విమర్శలు చేశారు. ప్రభుత్వం వద్ద లంకె బిందెలు ఉన్నాయని భారీ హామీలిచ్చానని, ఇక్కడ చూస్తే ఖాళీ బిందెలున్నాయని రేవంత్ అంటున్నారని, హామీలు ఇచ్చే ముందు ఏ బిందెలు ఉన్నాయో చూసుకోవాలి కదా అని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేక వాయిదాలు వేసుకుంటూ పోతున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఏ అభివృద్ధి చేయలేదని, ఇందిరమ్మ ఎంపీగా ఎన్నికైన తర్వాతే మెదక్ అభివృద్ధి జరిగిందని, ఆమె వచ్చాకే బీహెచ్‌ఈఎల్, ఇక్రిశాట్, బీడీఎల్ వచ్చాయని సీఎం అబద్ధాలు చెబుతున్నారని రఘునందన్‌రావు అన్నారు.

ఇందిరమ్మ 1980లో ఆమె మెదక్‌కు వచ్చిందని, బీహెచ్‌ఈఎల్ 1964లో, బీడీఎల్ 1970లో, ఇక్రిశాట్ 1972లోనే వచ్చాయని ఆయన అన్నారు. మెదక్‌కు మోదీ చేసిన అభివృద్ధిని చూసేందుకు వస్తానన్న రేవంత్‌రెడ్డి.. రెండు రోజులైనా రాలేదని, అందుకే తాను బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అభివృద్ధి పుస్తకాన్ని సీఎంకు కొరియర్ ద్వారా పంపిస్తున్నానని చదివి తెలుసుకోవాలన్నారు. సెప్టెంబర్ 17న నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తా అని అంటున్న రేవంత్ వ్యాఖ్యలు చూస్తే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతానని కేసీఆర్ ఇచ్చిన హామీ గుర్తుకు వస్తుందన్నారు. చెరకు ఫ్యాక్టరీపై అసెంబ్లీ హౌస్ కమిటీ 100 రోజుల్లో నివేదిక ఇచ్చిందని, ఆ నివేదికను అమలు చేస్తే వెంటనే ఫ్యాక్టరీని తెరిపించవచ్చని, ఇందుకు కోడ్ కూడా అడ్డం కాబోదన్నారు.

వాయిదాల రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆగస్టు 15న రైతు రుణమాఫీ జరగదు, సెప్టెంబర్ 17న చెరుకు ఫ్యాక్టరీ తెరవబోరని తెలిపారు. ఊరూరికి ఇందిరమ్మ బ్యాంకులను తెచ్చిందని జగ్గారెడ్డి అంటున్నారని, అప్పుడు బ్యాంకులే లేవని మోదీ పాలనలోనే బ్యాంకులు వచ్చాయన్నారు. 30 కోట్ల జన్‌ధన్ ఖాతాలను ఉచితంగా ఇచ్చిన ఘనత మోదీదని రఘునందన్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేటీఆర్ మెడలు వంచారని, ఆయనకు దమ్ముంటే మెదక్‌లో నాపై గానీ, కరీంనగర్‌లో బండి సంజయ్‌పై గానీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. కేటీఆర్ పరిస్థితి ఘోరంగా ఉందని, తీహార్ జైళ్లో చెల్లె ఏడుస్తోంని,  నడుం విరిగి నాన్న ఏడుస్తున్నారని అన్నారు. అహంకారం వల్లే వారికి ఈ గతి పట్టిందన్నారు. బీసీలను అన్యాయం చేసింది బీఆర్‌ఎస్ పార్టీనే అన్నారు. మెదక్ జిల్లాలో 7 ఎమ్మెల్యే స్థానాలుంటే ఐదుగురు బీసీలకు అవకాశం ఇచ్చామని తెలిపారు.