టొరంటోలో భూకంపం సృష్టించాడు..

24-04-2024 12:57:23 AM

గుకేశ్‌పై కాస్పరోవ్ ప్రశంసలు

న్యూఢిల్లీ: అత్యంత పిన్న వయస్కుడిగా ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ నెగ్గి చరిత్ర సృష్టించిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్‌పై రష్యా చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఒక భారతీయుడు తన ఆటతో టొరంటోలో భూకంపం సృష్టించాడంటూ మాజీ చాంపియన్ అతన్ని ఆకాశానికి ఎత్తాడు. గుకేశ్ విజయం చెస్ ప్రపంచానికి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిందని.. మిత్రుడు విశ్వనాథన్ ఆనంద్ అకాడమీ నుంచి వచ్చిన మరో కలికితురాయి గుకేశ్ అని ప్రశంసించాడు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ కంగ్రాట్స్! గుకేశ్.. టొరంటోలో భూకంపాన్ని సృష్టించావు.

నీ అద్భుతమైన మైండ్‌గేమ్‌కు 64 గళ్ల చెస్ బోర్డు పలకలు పగిలిపోయాయి. కెరీర్‌లో అత్యుత్తమ టైటిల్ సాధించేందుకు 17 ఏళ్ల గుకేశ్ త్వరలోనే చైనీస్ చాంపియన్ డింగ్ లారెన్‌ను ఎదుర్కోబోతున్నాడు. అక్కడ ఏం విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి. విషీ ఆనంద్ ‘పిల్లలు’ తమ గురువు బాటలో నడుస్తూ గొప్ప శిష్యులు అనిపించుకుంటున్నారు’ అని పోస్ట్ చేశాడు. ఇక గుకేశ్ టొరంటో వేదికగా జరిగిన ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో 14వ రౌండ్‌లో అమెరికాకు చెందిన నకమురతో మ్యాచ్‌ను డ్రా చేసుకొని 9 పాయింట్లతో టైటిల్‌ను అందుకున్నాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్యాండిడేట్స్ చెస్ టోర్నీ నెగ్గిన రెండో భారతీయుడిగా, అత్యంత పిన్న వయస్కుడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు.