ముదిరాజ్‌లు.. రాజులు!

24-04-2024 02:03:48 AM

మన కులాలు..

భారతదేశంలో అతి ప్రాచీనమైనది ముదిరాజ్ కులం. సహజంగా ప్రతి కులం ఆవిర్భావం ఏదో ఒక చారిత్రక ప్రముఖుని జీవితంతో ముడిపడి ఉంటుంది. మహాభారత మూలపురుషుడైన యయాతి చక్రవర్తి ముదిరాజుకు మూలపురుషుడు. చారిత్రక ఆధారాలు, పరిశీలకుల వ్యాసాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ హెచ్‌ఈహెచ్ ది నిజాం డోమినియన్ అనే గ్రంథాన్ని 1920లో అప్పటి నిజాం హైకోర్టు న్యాయవాది సయ్యద్ సిరాజుల్ హసన్ రాసిన పరిశోధన గ్రంథంలో ముదిరాజుల సమగ్ర చరిత్ర ఉన్నది.

యయాతి మహారాజు, రాక్షసుల గురువు శుక్రాచార్యుల కుమార్తె దేవయానిని వివాహం చేసుకున్నారు. దేవయానిని అత్తవారింటికి పంపేసమయంలో ఆమెకు తోడుగా దౌత్య రాజకుమార్తెయగు శర్మిష్టను చెలికత్తెగా పంపించారు. యయాతి, దేవయానిలకు ఇద్దరు కుమారులు జన్మించారు. వారు యాదవుడు, దుర్వానుడు. యయాతి చక్రవర్తి దేవయాని చెలికత్తే శర్మిష్ట అందమునకు ఆకర్షితుడై రహస్యంగా ఆమెను గంధర్వ వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమ వివాహానికి ఫలితంగా ముగ్గురు కుమారులు జన్మించారు. మొదటివాడు అను, రెండోవాడు ధృవుడు, మూడోవాడు పురు. యయాతి రహస్య వివాహం, సంతానం విషయం తెలుసుకున్న దేవయాని ఆగ్రహం చెంది తన తండ్రి శుక్రాచార్యులతో మొరపెట్టుకొని భర్తకు గుణపాఠం నేర్పాలని కోరింది.

శుక్రాచార్యుని శాపం

శుక్రాచార్యుని ఏకైక కుమార్తె దేవయాని. ఆమె పట్ల ఆయనకు ప్రేమానురాగాలు మెండు. కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని ఆగ్రహించిన శుక్రాచార్యులు.. యయాతి మహారాజును శపించారు. ‘ఏ యవ్వన ఉద్రేకాంతో వివాహాన్ని చేసుకున్నాడో ఆ ఉద్రేకానికి దూరమై ముసలివాడవవుగాక’ అని శపించారు. శాప ఫలితంగా యయాతికి పండు ముసలి రూపం వచ్చింది. తన తప్పిదాన్ని తెలుసుకొని యయాతి పశ్చాత్తాప మనస్కుడై, తన తప్పును ఒప్పుకొని.. తనను శాప విముక్తిడిని చేయవసిందిగా శుక్రాచార్యులను వేడుకొన్నారు.

ముదిమి పై బడటం వల్ల రాజ్యపాలన చేసే శక్తిని కోల్పోయానని, యవ్వనోద్రేకంలో జరిగిన తప్పిదానికి చింతిస్తున్నానని.. పరిపరి విధాల శుక్రాచార్యులను వేడుకొని తరుణోపాయం అడిగాడు యయాతి రాజు. దీంతో శుక్రాచార్య మనసు చలించింది. పశ్చాత్తాపం చెందిన యయాతి పట్ల జాలి కలిగి శాపవిమోచనకు ఒక మార్గం సూచించారు. యయాతి కుమారులలో ఎవరైనా ఆయన ముసలితనాన్ని స్వీకరించి, వారి యవ్వనాన్ని ఇవ్వగలిగితే శాపవిమోచనం కలుగుతుందని చెప్పారు.

ముదిరాజ్ వదోత్పత్తి

శుక్రాచార్యుని శాపమెంత కఠినమైనదో, తండ్రి ముసలితనం తీసుకోవడం కూడా అంతే కఠినమైనది అని యయాతి రాజు కుమారులు భావించారు. సమస్త సౌఖ్యాలను అనుభవించిన తరువాత కూడా ముదిమి భారాన్ని అంగీకరించనప్పుడు, ఎలాంటి సుఖసౌఖ్యలను చవిచూడని తాము ముసలితనాన్ని ఎలా స్వీకరించగలమని తమలో తాము ప్రశ్నించుకో సాగారు. తన ముసలితనాన్ని స్వీకరించిన తనయునికి రాజ్యాభిషేకం చేస్తానని యయాతి రాజు తెలియజేసినప్పటికీ సుఖభోగాలు అనుభవించలేదని, ముసలితనం వద్దని తండ్రి కోరికను మన్నించలేకపోయారు. చివరివాడైన పురు ధైర్యంగా ముందుకు వచ్చి తండ్రి ముసలితనాన్ని తాను స్వీకరించి, తన యవ్వనాన్ని తండ్రికి ధారపోయడంతో యయాతికి యవ్వనం వచ్చింది.

శుక్రాచార్యుల శాపం నుంచి విమోచనం కలిగింది. తండ్రి ముసలితనం పురునకు ప్రాప్తించింది. యయాతి చక్రవర్తి చిన్న కుమారుని పితృ ప్రేమను మెచ్చి బహుమానంగా అతనికి సింహాసనం అప్పగించి రాజ్యాభిషేకం చేశారు. రాజ్యపాలన చేస్తున్న ముసలి రాజును ప్రజలు ముదిరాజా అని పిలిచేవారు. ముది అనగా ముసలి. ఇదే పదముతో పురురాజు పురు ముదిరాజుగా రాజ్యపాలన చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. యయాతి చక్రవర్తి పూరి ముదిరాజు నుంచి ముసలితనంను తిరిగి తీసుకోవడం, పురుముదిరాజు యవ్వనుడు కావడం తదనంతరం పూర్తి భూమండలాన్ని వశపర్చుకొని ఏకచత్రాధిపతిగా ప్రజారంజక రాజ్యపాలన చేశారు.

ఆయన వంశపారంపర్వంలోనే పాండవులు ఉద్భవించారు. ఈ వృత్తాంతమంతా నిజాం రాజ్యములోని జాతులు, కులములు అనే గ్రంథంలో సిరాజుల్ హసన్ క్రోడీకరించారు. ముదిరాజుల కులం వారు దక్షిణ భారతదేశంలో రాజులుగా చక్రవర్తులుగా మహోన్నత పరిపాలనాధ్యక్షులుగా కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. భారత వర్షము నేలిన యయాతి చక్రవర్తి ‘ముదిరాజు’ మూలపురుషుడు కావడం గర్వకారణం. అదేవిధంగా దక్షిణ భారతంలో తెలుగు భావుటా ఎగురవేసిన విజయనగర సామ్రాజ్యధిపతి శ్రీకృష్ణదేవరాయలు రాసిన అముక్తమాల్యద గ్రంథంలో తాను ముదిరాజునని స్పష్టం చేశారు.