రేపటి నుంచి ఓపెన్ స్కూలు పరీక్షలు

24-04-2024 01:42:01 AM

ఉదయం, సాయంత్రం రెండు పూటల నిర్వహణ

జిల్లావ్యాప్తంగా  76 పరీక్షా కేంద్రాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 23(విజయక్రాంతి): హైదరాబాద్ జిల్లాలో ఓపెన్ స్కూలు సొసైటీ (టీఓఎస్‌ఎస్) ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి మే 2 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు సూచించారు. ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో మొత్తం 76 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఎస్‌ఎస్‌సీ ఇంటర్మీడియేట్ సెంటర్లున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మొత్తం 17,055 మంది ఉండగా.. ఇందులో ఎస్‌ఎస్‌సీకీ సంబంధించి 8,712 మంది, ఇంటర్మీడియెట్ విద్యార్థులు 8,343 మంది ఉన్నారు. జిల్లా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఫ్లయింగ్ స్కాడ్స్ సిట్టింగ్ స్కాడ్స్ ఉన్నాయి.

సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి

ఓపెన్ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియేట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్షలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. పరీక్షా పేపర్లకు సంబంధించి స్టోరేజీ పాయింట్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు మరో 8 ఏర్పాటు చేశాం.

 ఆర్.రోహిణి, డీఈవో