కొనసాగిన అప్‌ట్రెండ్

24-04-2024 01:13:15 AM

మూడో రోజూ పెరిగిన స్టాక్ సూచీలు

గరిష్ఠ స్థాయిలో లాభాల స్వీకరణ

ముంబై, ఏప్రిల్  23:  గతవారం ప్రధమార్థంలో వరుస పతనాలతో ఇన్వెస్టర్లను బెంబేలెత్తించిన భారత స్టాక్ మార్కెట్ వారంతంలో కోలుకున్న తర్వాత వరుసగా మూడో ట్రేడింగ్ రోజైన మంగళవారం కూడా అప్‌ట్రెండ్‌ను కొనసాగించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన స్టాక్ మార్కెట్లు ర్యాలీ జరిపిన ప్రభావంతో దేశీయ సూచీ లు సైతం పెరిగాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. అయితే ఇంట్రాడే గరిష్టస్థాయి వద్ద ట్రేడర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో తాజా పెరుగుదల స్వల్పంగా ఉంది. ఇంట్రాడేలో 400 పాయింట్లకుపైగా పెరిగి 74,000 పాయింట్ల స్థాయిని బీఎస్‌ఈ సెన్సెక్స్ దాటినప్పటికీ, చివరకు 89 పాయింట్ల స్వల్పలాభంతో 73,738 పాయింట్ల వద్ద నిలిచింది. దీంతో వరుసగా మూడు రోజులు 1,250 పాయింట్లు లాభపడినట్లయ్యింది. 

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం ఇదేబాటలో ఇంట్రాడేలో 111 పాయింట్ల పెరుగుదలతో 22,447 పాయింట్ల వద్దకు చేరిన తర్వాత గరిష్ఠస్థాయి నుంచి కొంత లాభాల్ని కోల్పోయింది. చివరకు 32 పాయింట్లు పెరిగి  22,368 పాయింట్ల వద్ద నిలిచింది. ఈ సూచి వరుస మూడు రోజుల్లో 382 పాయింట్లు లాభపడింది.  ఆసియాలో టోక్యో, హాంకాంగ్ సూచీలు పెరగ్గా,  సియోల్, షాంఘై ఇండెక్స్‌లు తగ్గాయి. యూరప్‌లో ప్రధాన మార్కెట్లయిన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్‌లు లాభపడగా, కడపటి సమాచారం అందేసరికి అమెరికా డోజోన్స్, ఎస్ అండ్ పీ ఇండెక్స్‌లు లాభాలతో ట్రేడవుతున్నాయి. ప్రపంచ మార్కెట్లో బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ధర 0.41 శాతం పెరిగి 87.36 వద్ద కదులుతున్నది. 

అమ్మకాల బాటలోనే విదేశీ ఇన్వెస్టర్లు

 పెరుగుతున్న క్రూడ్ ధరలు, విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి అమ్మకాలు జరపడం తాజాగా మార్కెట్ లాభాల్ని పరిమితం చేసిందని ట్రేడర్లు వివరించారు. డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అధికస్థాయిలో ఉన్నందున విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతాయని, దేశీయ సంస్థలు మార్కెట్ రికవరీకి మద్దతును ఇస్తాయని అంచనా వేస్తున్నట్టు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.  విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ సోమ, మంగళవారాల్లో రూ.5,000 కోట్ల వరకూ నికర విక్రయాలు జరిపినట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

రిలయన్స్‌లో అమ్మకాల ఒత్తిడి

స్టాక్ సూచీలు స్వల్ప పెరుగుదలతో ముగియడానికి హెవీవెయిట్ షేరు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) తగ్గడం ఒక కారణం. మంగళవారం క్యూ4 ఆర్థిక ఫలితాలు వెల్లడించిన ఆర్‌ఐఎల్‌లో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. దీంతో ఈ షేరు 1.3 శాతం మేర క్షీణించి రూ.2,918 వద్ద ముగిసిం ది.  సెన్సెక్స్ బాస్కెట్‌లో భారతి ఎయిర్‌టెల్ 3 శాతంపైగా పెరిగి ఆల్‌టైమ్ రికార్డుస్థాయి రూ.1,330 వద్ద నిలిచింది. నెస్లే, మారుతి, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఎస్‌బీఐలు సైతం 1 శాతం మధ్య లాభపడ్డాయి.

మరోవైపు సన్‌ఫార్మా, ఆర్‌ఐఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్‌లు నష్టపోయాయి. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా టెలికమ్యూనికేషన్స్ సూచి 4,27 శాతం పెరిగింది. రియల్టీ ఇండెక్స్ 2.42 శాతం, టెక్నాలజీ ఇండెక్స్ 1.23 శాతం, యుటిలిటీస్ ఇండెక్స్ 0.95 శాతం,  కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 0.82 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 0.77 శాతం, కమోడిటీస్ ఇండెక్స్ 0.52 శాతం చొప్పున పెరిగాయి.ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, ఎనర్జీ సూచీలు నష్టపోయాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.05 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.52 శాతం చొప్పున పెరిగాయి.