ఎన్నికల తర్వాత మొబైల్ ఛార్జీల బాదుడు

24-04-2024 01:15:12 AM

విశ్లేషకుల అంచనా

ముంబై, ఏప్రిల్ 23: వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత టెలికం ఆపరేటర్లు మొబైల్ ఛార్జీలను 15 శాతం మేర పెంచుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  టారీఫ్ పెంపు తప్పదంటూ యాంటిక్ స్టాక్ బ్రోకిం గ్ తాజాగా ఒక రిపోర్ట్ విడుదల చేసింది. టెలికం టారీఫ్‌లు చివరిసారిగా 2021 డిసెంబర్‌లో 20 శాతం పెరిగాయన్నది. దీంతో దేశంలో రెండో పెద్ద కంపెనీ అయిన భారతి ఎయిర్‌టెల్ అధికంగా లబ్దిపొందిందని, ఈ దఫా ఛార్జీల పెంపుతో సైతం ఇదే సంస్థ ఎక్కువగా లాభపడుతుందని యాంటిక్ బ్రోకింగ్ వివరించింది.

ప్రస్తుతం రూ.208 ఉన్న భారతి ఏపీఆర్‌యూ (ఏవరేజ్ రెవెన్యూ పర్ యూజర్) మూడేండ్లలో రూ.286కు పెరుగుతుందని అంచనా వేసిం ది. టారీఫ్ పెరుగుదలతో రూ.55 మేర, 2జీ కస్టమర్లు 4జీకి మారడం ద్వారా రూ.10, కస్టమర్లు 4జీ, 5జీకి అప్‌గ్రేడ్‌కావడం, పోస్ట్‌పెయిడ్‌కు మారడంతో రూ. 14 మేర ఏపీఆర్‌యూ పెరుగుతుందని బ్రోకరేజ్ కంపెనీ అంచనా వేసింది. భారతి మార్కెట్ వాటా గత ఏడాదికాలంగా 29.4 శాతం నుంచి 33 శాతానికి, జియో వాటా 21.6 శాతం నుంచి 39.7 శాతానికి చేరిందని రిపోర్ట్ తెలిపింది.