ఇది మన సంపద!

24-04-2024 02:23:45 AM

సంస్కృతి, కళలతో పురివిప్పి నాట్యం చేసే నెమలి తెలంగాణ. ఇక్కడి భాష, యాస, సంస్కృతులు, కళలు వైవిధ్యభరితమైనవి, విలక్షణమైనవి. భిన్న కళారూపాలకు ఇదొక నిలయం. ప్రాచీనమైన నాటకాలు, యక్షగానాలు, చిందు భాగవతం, నృత్యం, సంగీతం, కట్టు, బొట్టు చాలా భిన్నమైనవి. కళాకృతులకు కొదువే లేదు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు ప్రత్యేకమైనవి. పండుగలు, కోలాటాలు, జాతరలు తెలంగాణ వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. భిన్న సంస్కృతుల సమ్మేళనాల కూడలి తెలంగాణ. మన కళారూపాలను ‘ఖజానా’ ముందుకు తీసుకొస్తుంది. ఇది మన సంపద, మన ఆత్మగౌరవం కూడా..! 

బుడ్డర్‌ఖాన్ పాత్రలు ఊరికే రాలే!

ప్రధానంగా తెలంగాణ సాహిత్యం అనేది ఆధిపత్యాన్ని ధిక్కరించే క్రమంలో రూపుదిద్దుకున్నది. దరువు సంప్రదాయం కాకుండా దేవుణ్నైనా ప్రశ్నించగలిగినా చైతన్యం తెలంగాణ సాహిత్యంలో ఉన్నది. ఇక్కడ యుద్ధగాథల సంప్రదాయం ఎక్కువగా ఉంటుంది. దాంట్లో భాగంగానే ఒగ్గు కళారూపాలు కానీ, యాక్ష గాన కళారూపాలు కానీ, జముకుల కథలు కానీ,అచ్చమైన జానపద కళారూపాలు ఉంటాయి. ఇవి ఎందుకు ఏర్పడ్డవంటే తెలంగాణలో ఎప్పుడు వేదన, యాతన, దుఃఖం ఉన్నవాడు తీరిగ్గా కూర్చొని తమ దుఃఖాన్ని, ఆవేశాన్ని, ఆవేదనను వెల్లగక్కుతున్న క్రమంలో అనేక కళారూపాలు ప్రారంభమైనవి.

అందుకనే జముకుల కథ తీస్కో, లేకుంటే యాక్షగానం తీసుకుంటే.. ఇక్కడి నవాబులను డైరెక్టుగా తిట్టలేక బుడ్డర్‌ఖాన్ పాత్రలను పెడతారు.  రాజులను, పాలకులను, ఏలే వాళ్లను తిట్టలేక ఈ పాత్రలను పెట్టేవారు. తెలంగాణ కళారూపాలకు కానీ, తెలంగాణ సాహిత్యానికి కానీ ధిక్కారం అనేది  ఊపిరి. ఆధిపాత్యాన్ని ధిక్కరించడం, మానవీకరణ, అత్యంత సహజత్వమైన బోళాతనం తెలంగాణ కళారూపాల్లో, సాహిత్యంలో ఉంటది. అత్యంత రమనీయమైన శృంగారం కన్నా ఎక్కువ దుఃఖం, బాధ, ఆర్తి తెలంగాణ కళారూపాల్లో కనిపిస్తుంది.   

 జీవకళల స్థావరం 

ఉత్తర దక్షిణ భారత దేశానికి తెలంగాణ పెద్ద దర్వాజా. గంగా మూసీ, కావేరీ మిశ్రమ సంస్కృతులకు కేంద్ర స్థావరం. తనదైన జానపద, ప్రజా కళలకు, సంస్కృతికి మూల పునాది. బౌద్ధ జైనాలు, వీరశైవ, వీరవైష్ణవాలను ప్రజలలోకి వ్యాప్తి చేయడంలో కొత్తపుంతలు తొక్కింది. ఆదివాసీ, జన సంస్కృతులను కాపాడుకుంటూ తన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకున్న విలక్షణమైన ప్రాంతం. తెలంగాణ ప్రజలు ప్రాణాలకు తెగించి కాపాడుకున్న భాష, కళావైభవాలకు పట్టుగొమ్మ. చిందు, ఒగ్గు, మందహెచ్చు, రుంజ, కిన్నెర గానాల సమిష్టి జాతర. ఇరవై రకాల కళలకు విశిష్టమైన ఆహార్యం నేటికీ ప్రబల సాక్ష్యం. అనేక వినూత్న సంగీత వాద్యాలకు నిలయం. ఆదివాసీ కళాత్మక వ్యక్తీకరణలను పోరాడి కాపాడుకున్న నేల. అందుకే ఏ రాష్ట్రంలో లేనంత శిల్పం, నిర్మాణ శైలి, వాస్తు నిర్మాణం కనిపిస్తుంది. గోదావరి జన జీవితంలోంచి వెల్లి విరిసిన సంస్కృతి నేటికీ జీవ సంప్రదాయమై వెలుగొందే జీవకళల స్థావరం.         

                                                                      జయధీర్ తిరుమలరావు, రచయిత