calender_icon.png 16 September, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంటాడుతున్న యూరియా కష్టాలు

16-09-2025 01:11:52 AM

  1. సహకార సంఘాల వద్ద రైతుల బారులు 
  2. తెల్లవారకముందే ఇండ్ల నుంచి బయటకు
  3. రాత్రిదాకా క్యూలో ఉన్నా దొరకని బస్తా 

విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో రైతులను యూరియా కొరత వెంటాడుతున్నది. తెల్లవారకముందే ఇండ్ల నుంచి బయటకు వెళ్లిన రైతులు.. సహకార సంఘాల వద్ద, ఫర్టిలైజర్ షాపుల వద్ద రాత్రిదాకా క్యూలో ఉంటున్నారు. అయినా కూడా యూరియా బస్తాలు దొరకడం లేదు. యూరియా దొరక్క సోమవారం పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యూరియా కొరత తాండవిస్తోంది.

పాల్వంచ సహకార సంఘం వద్ద రైతుల ఆకలితో అలమటిస్తుంటే బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు, సహ కార సంఘం ఉపాధ్యక్షులు కాంపెల్లి కనికేష్ నేతృత్వంలో భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలతెల వారక ముందే యూరియా కోసం సహకార సం ఘాల వద్ద లైన్లు కట్టిన ఆఖరికి ఒక యూ రియా బస్తా మాత్రమే లభించడంతో అది ఎటు సరిపోక రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

సూర్యాపేట జిల్లా నూత నకల్ మండల కేంద్రంలోని పిఎసిఎస్ కార్యాలయం వద్ద యూరియా కోసం వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఉదయం నుంచే రైతులు తరలివచ్చి లైన్ లో నిలబడ్డారు. రైతులు తిండి తిప్పలు మానేసి వరుసలో గంటల తరబడి ఎండకు నిలబడలేక వారి స్థానంలో చెప్పులు, ఇటుకలు పెట్టి నీడలో నిరీక్షించారు.

వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం వద్ద పట్టాదారు పాస్ పుస్తకాలు క్యూలో పెట్టారు. గోపాలపేట మండ లంలోని బుద్ధారం చెన్నూరు, రాకలపల్లి ఏదుట్ల, తాడిపర్తి, మున్ననూరు, తిరుమలాపురం గిరిజన తండా వాసులు సైతం యూ రియా కోసం రాత్రి వచ్చి సింగిల్ విండో కార్యాలయం ముందే నిద్రించారు. 

ఆసిఫాబాద్ జిల్లాలో 

ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయం వద్ద తెల్లవారుజాము నుంచే యూరి యా కోసం రైతులు బారులు తీరారు. ఎస్సై పాషా ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. యూరియా కోసం వచ్చిన రైతులు ఆకలితో ఇబ్బందులు పడకూడదని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో కార్యకర్తలు అన్నదానం ఏర్పాటు చేశారు.

కాగజ్‌నగర్ మండలం జంబుగా రైతువేదిక వద్ద, కాగజ్‌నగర్ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల వద్ద తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. అధికారులు కనీస ఏర్పాటు చేయకపోవడంతో రైతుల మధ్య తోపులాట జరిగింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో ఆ కేంద్రం వద్ద భోజనం వసతి ఏర్పడి చేశారు. 

ఆదిలాబాద్ జిల్లాలో

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్రంలో రైతులు యూరియా కోసం ధర్నా చేశారు. మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతులకు సరిపడ యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపించారు. బేల మండల కేంద్రంలో తెల్లవారుజాము నుంచే పెద్దఎత్తున బారులు తీరారు. జిల్లా కేంద్రంలోని డాల్డా కంపెనీ గోదాం వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

తిరుపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతు న్నప్ప టికీ, యూరియా సరిపడా దొరకదేమోనన్న భయంతో రైతులు మహిళలతో కలిసి ఉద యం నుండే క్యూ కట్టారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని సహకార సొసైటీ వద్ద యూ రియా కోసం రైతులు తీవ్ర అవస్థలు పడ్డా రు. తెల్లవారుజాము నుండే రైతులు, మహిళలు క్యూ కట్టారు. 

రేగొండలో..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో అధికారుల వైఫల్యంతో రైతులు అరిగోస పడ్డారు. సోమవారం యూరియా బస్తాలు వస్తాయనే సమాచారంతో రైతులు ఆదివారం రాత్రి నుండే సొసైటీ కేంద్రాల వద్ద జాగారం చేస్తూ వేచి చూశారు. మండల కేంద్రానికి వచ్చింది 500 బస్తాలు కాగా, వివిధ గ్రామాల నుండి వెయ్యికిపైగా రైతులు అక్కడికి చేరుకున్నారు. దీంతో తోపులాట జరిగింది.

ఈ తోపులాటలో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బం దులు పడ్డారు. పోలీసులు చొరవ తీసుకుని రైతులను క్యూ లో నిల్చోబెట్టేందుకు ప్రయ త్నం చేయగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం ఏర్పడింది. అయితే రేగొండలో మన గ్రోమోర్ రైతు సేవా కేంద్రం, పిఎసిఎస్ గోదాం, దమ్మన్నపేట క్లస్టర్‌లో సోమవారం యూరియాను సరఫరా చేశారు. ఏఏ గ్రామాలకు ఎక్కడ యూరియా సరఫరా చేస్తున్నారో అధికారులు ముందుగా రైతులకు తెలుపకపోవడంతో రైతులందరూ పిఎసిఎస్ గోదాం వద్ద బారులు తీరారు.

దీంతో టోకెన్లు ఇచ్చే క్రమంలో కొందరి రైతులను గ్రోమోర్ రైతు సేవా కేంద్రానికి పం పించారు. అయితే వారి టోకెన్లు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రానివి కావడంతో వారికి అక్కడ యూరియా లభించలేదు. దీంతో ఆ రైతులంతా మళ్ళీ పిఎసిఎస్ గో దాం వద్దకు రాగా ఇక్కడ టోకెన్లు అయిపోయాయని వెళ్లగొట్టారు. ఒక్క బస్తా కోసం రాత్రింబవళ్లు నిలిచి ఉంటే మాకు యూరియాను అందజేయకుండా వెళ్లగొట్టారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 

మాజీ మంత్రి గంగుల ఆధ్వర్యంలో ధర్నా

కరీంనగర్ రూరల్ మండలం గోపాలపూర్ గ్రామం వద్ద సోమవారం మండలా నికి సంబంధించిన రైతులతో కలిసి జాతీయ రహదారిపై మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బైఠాయించి, ధర్నాకి దిగారు. మహిళలు యూరియా బస్తాలను బతుకమ్మగా పేర్చి బతుకమ్మ ఆడి, నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాతో ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులకు గంగులకు మధ్య వాగ్వాదం జరిగింది.

అనంతరం గంగులతోపాటు నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల  నిర్లక్ష్యం వల్ల రైతులకు ఎరువుల కొరత ఏర్పడిందన్నారు. సరైన కాలంలో ఎరువులను అందిస్తేనే పైరు చేతికి వస్తుందని లేదంటే పంట పాడైపోయే ప్ర మాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇ ప్పటికైనా పాలకులు స్పందించి రైతులకు ఎ రువు బస్తాలను సమకూర్చాల్సిందిగా హెచ్చరించారు.