calender_icon.png 9 January, 2026 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మామిడి రైతులకు వరం

07-01-2026 12:14:22 AM

ఈ ‘ఫ్రూట్ కవర్లు’ నాణ్యమైన దిగుబడికి మార్గం

రేవల్లి జనవరి 6: ప్రతి ఏటా పండు ఈగ, తామర పురుగుల వల్ల నష్టపోతున్న మామిడి రైతులకు ’ఫ్రూట్ బ్యాగింగ్’ కాయలకు కవర్లు కట్టడం పద్ధతి సరికొత్త భరోసానిస్తోంది. కాయ పిందె దశ నుంచి కొంచెం పెరగగానే ప్రత్యేకమైన పేపర్ కవర్లను తొడగడం ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని ఉద్యానవన నిపుణులు సూచిస్తున్నారు. పండు ఈగలు కాయలపై గుడ్లు పెట్టకుండా ఈ కవర్లు అడ్డుకుంటాయి.

దీనివల్ల కాయలు మచ్చలు లేకుండా, ఎంతో శుభ్రంగా మరియు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఎండ నేరుగా తగలకుండా కవర్ లోపల పెరగడం వల్ల, పండ్లు ఒకే రీతిలో బంగారు పసుపు రంగును సంతరించుకుంటాయి. కవర్లు వాడటం వల్ల పురుగు మందుల పిచికారీ అవసరం తగ్గుతుంది. ఇది రైతుకు సాగు ఖర్చును తగ్గించడమే కాకుండా, వినియోగదారులకు విషరహితమైన పండ్లను అందిస్తుంది.

ఈ పద్ధతి ద్వారా పండించిన మామిడికి ఎగుమతి అవకాశాలు పెరిగి, రైతులకు భారీ లాభాలు అందుతాయి. ప్రారంభంలో కవర్ల కోసం కొంత ఖర్చు అనిపించినా, దిగుబడి నాణ్యత పెరగడం వల్ల వచ్చే లాభం చాలా ఎక్కువ. కాబట్టి రైతులు సంప్రదాయ పద్ధతుల కంటే ఈ ఆధునిక పద్ధతిపై దృష్టి సారించడం శ్రేయస్కరం.