24-09-2025 12:00:00 AM
కేంద్ర ప్రభుత్వం పలు రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గించడంతో ఆటోమొబైల్ రంగానికి ఊతమిచ్చినట్లయింది. ఒక్కో వస్తువుపై కనీసం ఐదు శాతం నుంచి గరిష్టంగా 15 శాతం వరకు జీఎస్టీ తగ్గించడంతో ముఖ్యంగా వాహనాల ధరలు పెద్దమొత్తంలో తగ్గనున్నాయి. దీంతో కొత్తగా ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేద్దామ నుకుంటున్న వినియోగదారులకు ఇది ఊరటనిచ్చే అంశం. గతంలో ప్రతీ వాహనంపై రెండు శాతం ట్యాక్స్ పెంచుతున్నట్టు ఆగస్టు 13న రాష్ర్ట ప్రభు త్వం ప్రకటించింది.
దీంతో ఆ రోజు నుంచే కొనుగోళ్లపై ప్రభావం కనిపించిందని షోరూం నిర్వాహకులు అంటున్నారు. అయితే తాజాగా జీఎస్టీ స్లా బుల్లో జరిగిన మార్పులు ఈ నెల 22 నుంచి అమల్లోకి రావడంతో వివిధ రకాల వాహనాల ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. ప్రతీ ద్విచక్ర వాహనంపై సగటున ఆరు వేల రూపాయలు మొదలుకొని గరిష్టంగా 20 వేల రూపాయల వరకు.. ఇక కార్లపైన 80 వేల నుంచి గరిష్టంగా రూ. 1.50లక్షల వరకు తగ్గనున్నాయి. వాహనాల ధరలు భారీ మొత్తంలో తగడంతో వినియోగదారులతో ఆటోమొబైల్ షోరూంలు కిటకిటలాడుతున్నా యి. ప్రస్తుతం దసరా, దీపావళి పర్వదినాలు ఉండడంతో కొనుగోళ్లు కూ డా భారీగా పెరిగే అవకాశముంది. ముఖ్యంగా పండుగ రోజుల్లో కొనుగోళ్లు గరిష్ట స్థాయికి చేరే అవకాశముంది.
ధరలు ఎక్కువగా ఉన్నప్పుడే విరివిగా వాహనాలు కొనుగోలు చేసిన వినియోగదారులు తాజాగా జీఎస్టీ తగ్గింపుతో కొత్తగా కొనుగోలు చేసే వారి సంఖ్య రెట్టింపు కానుంది. ఈ సీజన్‌లో అన్ని షోరూంల్లోనూ నెలకు సగటున కనీసం ఇరవై కోట్ల రూపాయల వరకు బిజినెస్ ఉండే అవకాశముంది. మధ్యతరగతి ప్రజలు అధి కంగా వినియోగించే ద్విచక్రవాహనాలపై జీఎస్టీ 10 శాతం వరకు తగ్గనుండటంతో కొనుగోళ్లు ఊపందుకునే చాన్స్ ఉంది. అలాగే 10 లక్షల లోపూ విలువ కలిగిన కార్లపై కూడా రూ. లక్ష వరకు తగ్గే అవకాశం ఉండడంతో మధ్యతరగతి ప్రజలు కార్ల కొనుగోలుపై ఆసక్తి చూపే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగం వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ కొత్త శ్లాబులు అమలు వల్ల సెకండ్ హ్యాండ్ వెహికిల్ మార్కెట్‌పైనా తీవ్ర ప్రభావం పడనుంది. ద్విచక్రవాహనాల ధరలు కనీసం 10,000 రూపాయల వరకు తగ్గనుండటంతో పాత వాహనాలు కొనుగోలు చేయాలనే ఆలోచనతో ఉన్న వినియోగదారులు తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
రూ. లక్ష విలువ చేసే కొత్త బైకు.. సెకండ్ హ్యాండ్‌లో 70,000 రూపాయల వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే కార్ల ధరల్లోనూ భారీగా తగ్గింపులు ఉండడంతో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు పూర్తిగా మందగించాయి. 10 లక్షల రూపాయల విలువ చేసే ప్రీ మియం వెరైటీ కారు ధరలో తగ్గించిన జీఎస్టీ స్లాబు ప్రకారం 10 శాతం కింద లక్ష రూపాయల వరకు ఆదా అవనుంది. ఈ లెక్కన చూసుకుంటే సెకండ్ హ్యాండ్‌లో ఆరు లక్షల రూపాయల నుంచి ఏడు లక్షల రూపాయల మధ్య లభించే కారు కన్నా.. కొత్త కారుపై లక్ష రూపాయలు వరకు తగ్గుముఖం పడుతుండటంతో మరో రెండు లక్షల రూపాయలు వెచ్చిస్తే కొత్త వాహనమే వస్తున్నందున ఆలోచనలు విరమించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబుల్లో మార్పులు ప్రకటించినప్పటి నుంచే పాత వాహనాల కొనుగోళ్లు మందగించినట్లు సెకండ్ హ్యాండ్ వాహనాల విక్రేతలు వాపోతున్నారు.
కామిడి సతీష్ రెడ్డి, 9848445134