calender_icon.png 22 September, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత తప్పనిసరి

22-09-2025 12:46:19 AM

-నగరంలో ఈ ఏడాది 16వేల ఇంకుడు గుంతల నిర్మాణమే లక్ష్యం 

-వర్షపు నీటిని ఇంకిద్దాం.. - భూగర్భజలాలను పెంపొందిద్దాం  

-హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, సిటీ బ్యూరో సెప్టెంబర్ 21 (విజయక్రాంతి):  నీటి ఎద్దడి నివారణకు నగరంలో ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత తప్పనిసరి చేస్తున్నామని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘వర్షపు నీటిని భూమిలో ఇంకిద్దాం.. - భూగర్భజలాలను పెంపొందిద్దాం’ అనే నినాదం తో ప్రతి ఒక్కరూ సైన్యంలా కదలాలని మంత్రి పిలుపునిచ్చారు.  

వరద ముంపునూ అరికట్టవచ్చు 

నగరంలో ఏటా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతున్నప్పటికీ, ఆ నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకుండా పోతోందని మంత్రి తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విస్తరిస్తున్న కాంక్రీ ట్ నిర్మాణాలు ఖాళీ స్థలాలను సైతం కప్పివేయడమే ఇందుకు కారణమన్నారు. వర్షపు నీరు వరద ప్రవాహంగా మారి మురుగు కాల్వల్లో కలిసిపోతోందని,  ఫలితంగా భూగ ర్భ జలాలు అడుగంటి, నిత్యావసరాలకు కూడా ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టి భూమిలో కి ఇంకేలా చేస్తే, నీటి ఎద్దడిని నివారించడమే కాకుండా, నగరంలో వరద ముంపును కూడా అరికట్టవచ్చన్నారు.

ప్రజలకు అవగాహన కల్పించాలి

ప్రభుత్వ నిబంధనల ప్రకారం 300 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మిం చే ఇండ్లలో ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి అని మంత్రి గుర్తుచేశారు. గతం లో ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత పేరుతో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌ను పునరుద్ధరించి, ఇంకుడు గుంతల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచిం చారు. ఇంకుడు గుంతల నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని జలమం డలి ద్వారా అర్హత కలిగిన జియాలజిస్టులతో అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

నిర్మాణాలు చేపట్టాల్సిన ప్రాంతాల గుర్తింపు

భూగర్భ జలాల పెంపునకు కేవలం ఇళ్లలోనే కాకుండా, పార్కులు, ప్రభుత్వ కార్యా లయాలు, విద్యా సంస్థలు, కాలనీల్లోని ఖాళీ ప్రదేశాల్లో కూడా ఇంకుడు గుంతలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది జీహెఎంసీ, హెఎండీఏ, జలమండలి సమన్వయంతో సుమారు 16,000 వర్షపు నీటి సంరక్షణ కట్టడాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే ఎన్జీవోల సహకారంతో నిర్మాణాలు చేపట్టాల్సిన ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు.