calender_icon.png 22 September, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా బతుకమ్మ సంబురాలు ప్రారంభం

22-09-2025 12:44:10 AM

-ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ వేడుకలు.

-సందడిగా మారిన ప్రధాన కూడళ్లు, చౌరస్తాలు

ఉప్పల్ సెప్టెంబర్ 21 (విజయక్రాంతి) : ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ నాచారం ఉప్పల్ రామంతపూర్  ప్రాంతాలలో   బతుకమ్మ సంబరాలు ను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే  విధంగా  బతుకమ్మ పండుగ  వైభవంగా మొదలుపెట్టారు.  తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మహిళలు సంబరాలను ప్రారంభించాడు తంగేడు గుణగు బంతి వంటి పూలను జాగ్రత్తగా పేర్చి అందమైన బతుకమ్మలను తయారు చేశారు. నవరాత్రుల చివరి రోజు సద్దుల బతుకమ్మతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.

ఒక్కేసి పువ్వేసి చందమామ..

ముషీరాబాద్, సెప్టెంబర్ 21(విజయక్రాంతి): ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జామునాయే చందమామ.. చిత్తూ చిత్తూల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ అంటూ మహిళలు, యువతులు,  చిన్నారులు పెద్ద ఎత్తున పాటలు పాడుతూ మొదటి రోజైన ఆదివారం సాయంత్రం  ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సంబురాలు ముషీరాబాద్ లో  అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యా యి.  నియోజకవర్గంలోని రాంనగర్, గాంధీనగర్, అడిక్మెట్ కవాడిగూడ, భోలక్ పూర్, ముషీరాబాద్ డివిజన్ లలో మహిళలు, యువతులు,  ఉదయం నుంచి ఉపవాసం ఉండి రంగురంగుల తీరొక్క పూలతో   బతుకమ్మలను అందంగా పేర్చారు.

ఆయా డివిజన్లలోని  ప్రధా న కూడళ్లు, ఆలయాల వద్ద బతుకమ్మలను పెట్టి పాటలు పాడుతూ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. దీంతో ఎక్కడ చూసినా బతుకమ్మ ఉత్సవాల సందడితో కాలనీలు, బస్తీలన్నీ సందడిగా మారాయి.  సాయంత్రం ఐదు గంటల నుం చి రాత్రి వరకు బతుకమ్మలను తమ ఆటపాటలతో గడిపిన మహిళలు  ప్రధాన కూడళ్ల లో  జిహెచ్‌ఎంసి అధికారులు ఏర్పాటు చేసిన చిన్న చిన్న కొలనులలో బతుకమ్మలను  నిమజ్జనం చేశారు. 

అలకాపురిలో పూల సింగిడి

మణికొండ, సెప్టెంబర్ 21: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవనాడి అయిన బతుకమ్మ పండుగకు మణికొండలోని అలకాపూర్ టౌన్షిప్ ఘనంగా స్వాగ తం పలికింది. అలకాపూర్ గణేశ మండలి, ఏటీఆర్డబ్ల్యూఏ సంయుక్త ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు స్థానిక ఎంజీ పార్కులో కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు, మహిళల కోలాటాలు, చిన్నారుల కేరింతలతో ఆ ప్రాం గణమంతా పూల వనాన్ని తలపించింది.

రంగురంగుల పట్టుచీరలలో మెరిసిపోతూ, బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లు చరుస్తూ, ‘ఒక్కొక్క పువ్వేసి చందమామ‘ అంటూ సాగిన వారి ఆటపాటలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ప్రకృతిని ఆరాధిస్తూ, ఆడపడుచుల ఆనందాన్ని చాటే ఈ వేడుక తెలంగాణ పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టింది. ఈ వేడుకల్లో స్థానిక శాసనసభ్యుడు ప్రకాశ్ గౌడ్, పురపాలక సంఘం మాజీ అధ్యక్షుడు కస్తూరి నరేం దర్ పాలుపంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు సైతం ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ ఆడి తమ ఐక్యతను చాటారు.