calender_icon.png 27 December, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సావు భాష తప్ప సాగుపై సోయి లేని సీఎం

27-12-2025 02:24:54 AM

  1. మీ చిల్లర రాజకీయాలకు, విధ్వంసకర పాలనకు రైతు బలి
  2. రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం

హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి) : సావు భాష తప్ప సాగు గురించి సోయి లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రైతుల బతుకులు ఇలా క్యూ లైన్లలో తెల్లారాల్సిందేనని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవే దన వ్యక్తం చేశారు. రాష్ర్టంలో యూరియా కొరత - రైతుల కష్టాల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘అందరినీ తొక్కుకుంటూ వచ్చాను’ అని గర్వంగా చెప్పుకునే రేవంత్‌రెడ్డి, మీ చెత్త పాలనతో ఇప్పుడు రైతులనే తొక్కుతున్నారని విమర్శించారు.

మీ చిల్లర రాజకీయాలకు, విధ్వంసకర పాలనకు బలైపోతున్నది రైతేనని స్పష్టం చేశారు. రైతులకు సమయానికి యూరియా కూడా అందించలేని మీరు ముఖ్యమంత్రా అని ప్రశ్నించారు. యూరియా కొరత కనిపించకుండా మసిపూసి మారేడుకాయ చేయడానికి తెచ్చిన యూరియా యాప్ ఏమైందని నిలదీశా రు. యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతులకు యూరియా కష్టాలు మొదలైతే, మీ ప్రభు త్వం ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు.

మీరు జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చుంటే, రైతులు మాత్రం తెల్లవారుజాము నుంచే ఎముకలు కొరికే చలిలో చెప్పులు క్యూలో పెట్టుకుని యూరి యా కోసం ఎదురు చూ స్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా మీరు చెప్పిన ‘మార్పు’, గత సీజన్లో ఎదురైన యూరియా కొరత చేదు అనుభవాల నుంచి కూడా మీ ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం తెలంగాణలో యూరియా సమస్య తీరదా? అని నిలదీశారు.