30-12-2025 01:49:50 AM
మున్సిపాలిటీని మూడు డివిజన్లుగా ఏర్పాటు చేయాలి
సర్కిల్ ఏర్పాటు కోసం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష
రంగారెడ్డికి పదవిపై ఉన్న శ్రద్ధ, నియోజకవర్గంపై లేదు
నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ నేతల ఆరాటం
తుర్కయంజాల్, డిసెంబర్ 29: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ, నియోజకవర్గంపై లేకపోవడం శోచనీయమని తుర్కయంజాల్ బీఆర్‌ఎస్ నేతలు దుయ్యబట్టారు. తుర్కయంజాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీలో మున్సిపాలిటీల విలీనం, జోన్లు, డివిజన్ల ఏర్పాటుపై రంగారెడ్డి నోరుమెదకపోవడం దారుణమని అన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపాలిటీగా, లక్ష ఓట్లు ఉన్న తుర్కయంజాల్ను కాదని, కేవలం 15వేల ఓట్లు ఉన్న ఆదిభట్లను సర్కిల్గా చేయడం వెనుకున్న ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదన్నారు.
అలాగే కేవలం 7కి.మీ దూరంలో ఉన్న ఎల్బీనగర్ను కాదని, 40 కి.మీ. దూరంలో ఉన్న శంషాబాద్లో తుర్కయంజాల్ను కలపడం అవివేకమని మండిపడ్డారు. ఏదైనా సమస్యపై సాధారణ, మధ్య తరగతి ప్రజలు శంషాబాద్ వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. నామినేటెడ్ పదవులకు ఆశపడి స్థానిక కాంగ్రెస్ నేతలు బర్నింగ్ సమస్యపై మాట్లాడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలు జీహెచ్ ఎంసీలో కలిపినా, ఒక్క జోనల్ ఆఫీసు కూడా తీసుకురాలేకపోవడం ఎమ్మెల్యే రంగారెడ్డి చేతగానితనమేనని బీఆర్‌ఎస్ నేత లు విమర్శించారు.
స్వార్థ, రాజకీయ ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే రంగారెడ్డి 60వేల ఓట్లతో తొర్రూరు వార్డును ఏర్పాటు చేయించుకున్నారన్నారు. మంత్రి పదవి కోసం ఆశపడి, నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గాలికొదిలేశారన్నారు. పాత రెవెన్యూ గ్రామాల ప్రాతిపదికన తుర్కయంజాల్లో మూడు డివిజన్లు ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే ఆదిభట్ల సర్కిల్ను ఎత్తివేసి, తుర్కయంజాల్లో సర్కిల్ ఆఫీసు ఏర్పాటు చేసేలా పోరాడాలని సూచించారు. లేదంటే తుర్కయంజాల్ అఖిలపక్షం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని బీఆర్‌ఎస్ నేతలు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు కందాడ లక్ష్మారెడ్డి, సామ సంజీవరెడ్డి, బొక్క గౌతమ్రెడ్డి, కాకుమాను చిన్నయ్య, మోహన్ గుప్తా, రొక్కం ప్రభాకర్ రెడ్డి, బింధు రంగారెడ్డి, చెరుకు రఘునాథ్ గౌడ్, కళ్యాణ్ నాయక్, కొండ్రు మల్లేశ్, మేతరి అశోక్, గుత్తా మహేందర్ రెడ్డి, చెవుల నరేందర్, బుడ్డ బాబు, తుమ్మలపల్లి వెంకటరెడ్డి, శ్రీకాంత్‌చారి పాల్గొన్నారు.