30-12-2025 01:37:41 AM
వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
ఎల్బీనగర్ లో రెండుగా చీలిపోయిన కాంగ్రెస్ పార్టీ నేతలు
నూతన సంవత్సర ఫ్లెక్సీల ఏర్పాట్లలో ఫొటోల వివాదం -
ఫ్లెక్సీలను చించివేసిన కాంగ్రెస్ నాయకుడిపై కేసు
ఎల్బీనగర్, డిసెంబర్ 29 : ఎల్బీనగర్ లో కాంగ్రెస్ పార్టీలో ఫ్లెక్సీల వివాదంతో రెండుగా చీలిపోయింది. ఒకటి జక్కిడి వర్గం.. రెండోది మధుయాష్కీ గౌడ్ వర్గంగా భావిస్తున్నారు. కొంతకాలంగా మధుయాష్కీ గౌడ్ ఎల్బీనగర్ రాజకీయంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో కొన్ని ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి విధేయతగా పనిచేస్తున్న జక్కిడి ప్రభాకర్ రెడ్డి కుటుంబం కూడా పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కానీ, నిజామాబాద్ నుంచి వచ్చిన మధుయాష్కీగౌడ్ ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని తన గుప్పెట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో మధుయాష్కీగౌడ్ ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.
దీనికి కారణం స్థానిక నాయకులు ఆయనకు సహకరించ లేదనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, కొంత మంది మధుయాష్కీగౌడ్ అభిమానులు నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మన్సురాబాద్ డివిజన్ లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అందులో జక్కిడి ప్రభాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఫొటో లేదు. దీంతో జక్కిడి ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం అర్థరాత్రి మధుయాష్కీకి అనుకూలంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో మధుయాష్కీగౌడ్ వర్గం వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఫ్లెక్సీలను చించివేసిన వారిని గుర్తించి, శివచరణ్ రెడ్డి సోదరుడిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
బహిర్గతమైన వర్గ విభేదాలు
ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలు బట్టబయలయ్యాయి. గత ఎన్నికల్లో కలిసి కట్టుగా పని చేస్తున్నట్టు అనుకున్న కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వర్గ పోరు తారస్థాయికి చేరింది. ఎల్బీనగర్ లో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయిందని ప్రజలు అనుకుంటున్నారు. ఒకటి మధుయాష్కీ వర్గం, మరొకటి జక్కిడి వర్గం అనేది ఫ్లెక్సీల రగడతో చర్చనీయాంశంగా మారింది.
బీసీ నాయకులపై కుట్ర: ఈశ్వరమ్మ యాదవ్
ఫ్లెక్సీల చించివేత కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుకు దారి తీసింది. బీసీ నాయకులను ఎదగకుండా అగ్రవర్ణాల నాయకులు కుట్ర చేస్తున్నారని సీనియర్ నాయకురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ భగ్గుమ న్నారు. వనస్థలిపురంలోని డీర్ పార్కులో ఆదివారం నిర్వహించిన బీసీ జనభోజనాల మహోత్సవం నిర్వహించారు. ఈ సభలో ఈశ్వరమ్మ యాదవ్ మాట్లాడుతూ... తాను ఎప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, కానీ, తన వారసులను రాజకీయంగా ఎదగకుండా కుట్ర చేస్తున్నారన్నారు ఆరోపించా రు. ప్రజలకు శుభాకాంక్షలు చెప్పడానికి తన మనుమడు సురేశ్ యాదవ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే చించి వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వివిధ పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు రాజ్యాధికారం సాధించే వరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.