30-12-2025 01:28:01 AM
జనవరి 1న ముసాయిదా.. 10న ఓటర్ల తుది జాబితా వెల్లడి
అక్టోబర్ 1 నాటి అసెంబ్లీ ఓటర్ల జాబితానే ప్రామాణికం
రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ
117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ఎన్నికల సందడి!
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. పురపాలక సంఘాల్లో కొత్త పాలకవర్గాలను ఎన్నుకునేందుకు ము న్సిపల్ ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టిం ది. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం టీఎస్‌ఈసీ సోమవారం అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రంలోని 117 మున్సిపా లిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల నిర్వహణకు కమిషన్ సన్నాహాలు ప్రారంభించింది.
అసెంబ్లీ జాబితా ఆధారంగానే
గత అక్టోబర్ 1, 2025 నాటికి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితానే ఈ మున్సిపల్ ఎన్నికలకు ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఆ జాబితాలోని డేటా ఆధారంగా మున్సిపల్ వార్డుల వారీగా ఫొ టోలతో కూడిన కొత్త ఓటర్ల లిస్టును సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులను ఆదేశించింది.
వారం రోజుల్లోనే ప్రక్రియ పూర్తి
ఓటర్ల జాబితా తయారీకి ఎన్నికల సం ఘం చాలా తక్కువ సమయాన్ని కేటాయించింది. డిసెంబర్ 30 నుంచి ప్రక్రియ మొద లుపెట్టి, జనవరి 10 నాటికి తుది జాబితాను సిద్ధం చేయాల్సి ఉంటుంది. జనవరి 1న ముసాయిదా జాబితా విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, అన్ని సవరణల అనంతరం జనవరి 10న ఫైనల్ లిస్ట్ ప్రకటించనున్నారు. ఈ జాబితా ఆధారంగానే త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.
ఓటర్ల జాబితా షెడ్యూల్ ఇలా..
డిసెంబర్ 30: ఈసీఐ పోలింగ్ స్టేషన్ల డేటాను మున్సిపాలిటీల వారీగా వేరు చేయడం
డిసెంబర్ 31: 2025 వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల డేటా విభజన, జాబితా రూపకల్పన
జనవరి 1: ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అభ్యంతరాల స్వీకరణ ప్రారంభం
జనవరి 5-6: రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా/మున్సిపల్ స్థాయి సమావేశాలు
జనవరి 10: తుది ఓటర్ల జాబితా ప్రచురణ
అభ్యంతరాలకు అవకాశం
జనవరి 1న ముసాయిదా జాబితా విడుదలైన వెంటనే, వార్డుల వారీగా ఓటర్లు తమ పేర్లను సరిచూసుకోవచ్చు. ఏవైనా తప్పులున్నా, పేర్లు గల్లంతైనా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు అవకాశం కల్పించారు. తుది జాబితా వెలువడిన తర్వాతే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తదుపరి కార్యాచరణ ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి మొదలుకానుంది.