30-12-2025 02:03:50 AM
ప్రభుత్వ ఉద్యోగుల గోస
హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి) : దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇంతవరకు పీఆర్సీ ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గతంలో కేసీఆర్ 43 శాతం, 39 శాతం పీఆర్సీ అందించారని, ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ జీవోను కూడా ఇచ్చామని గుర్తు చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జీరో అవర్‌లో హరీశ్‌రావు మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ఈహెచ్‌ఎస్ అమలుచేస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇప్పటికీ అమ లు చేయలేదని మండిపడ్డారు. రిటైర్డ్ ఉద్యోగులు 39 మంది ప్రభుత్వ బెనిఫిట్స్ అందక మనోవేదనతో మరణించా రని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో 17 వేల మంది ఉద్యోగులు రిటైర్ అయి తే అందరికీ టైంకి డబ్బులు అందించామని, తాను అసెంబ్లీకి వస్తుంటే సిద్దిపేట నుంచి రిటైర్డ్ జేడీ వెటర్నరీ డాక్టర్ జగత్‌కుమార్ రెడ్డి కలిసి అక్టోబర్ 2024లో రిటైర్ అయితే ఇప్పటివరకు ఒక్క రూపా యి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారని వివరించారు.
ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పి రెండేళ్లు దాటినా అతీగతి లేదని, సీపీఎస్ కింద ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ డబ్బులను రెండేళ్ల నుంచి దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల 2 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఐదు సరెండర్ లీవులు పెండింగ్‌లో ఉన్నాయని, టీఏ, డీఏలు, స్టేషన్ అలవెన్సులు రావడం లేదని గుర్తు చేశారు.
రాష్ర్టంలో లక్ష మంది పోలీసులు ఇబ్బంది పడుతున్నారని, గతంలో మా ప్రభుత్వం ఎప్పటికప్పుడు వీటిని విడుదల చేసిందని చెప్పారు. పోలీసులకు ఉన్న ఆరోగ్య భద్రత స్కీమును బంద్ చేసి, కేవలం లక్ష రూపాయలకే పరిమితం చేశారని, కానిస్టేబుళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య భద్రత పథకాన్ని పునరుద్ధరించి కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యం అందేలా చూడాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తక్షణమే పీఆర్సీ ఇస్తామని, పెండింగ్ డీఏలు, బకాయిలు ఇస్తామని, ఓపీఎస్ తెస్తామని మాట ఇచ్చారని, కానీ రెండేళ్లయినా అమలు చేయకుండా ఉద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, పోలీసులకు ఇచ్చిన హామీ ప్రకారం బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను కోరారు.
జీరో అవర్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాతపూర్వకమైన సమాధానాన్ని వచ్చే సెషన్ లోపు సభ్యులకు అందించాలని, గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాలు పంపించిందన్నారు. కొత్త సభ్యులు మాట్లాడుతుంటే జీరో అవర్ కాస్తా అరణ్యరోదనగా మారుతోందని, అలా మార్చవద్దని హరీశ్‌రావు సూచించారు.
మీరా మాట్లాడేది? వహ్వా
హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి) : శాసనసభలో మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రస్తావించిన అంశాలన్నీ నోట్ చేసుకున్నామని, కానీ ప్రభుత్వ ఉద్యోగుల గురించి, వారి సంక్షేమం గురించి హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ పార్టీవారు మాట్లాడటం వితంగా, దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై హరీశ్‌రావు మాట్లాడ టంపై స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు..
ఉద్యోగులకు ప్రతి నెలా 20 తారీఖు వరకు జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితిలో గతంలో వారు ప్రభుత్వాన్ని నడిపారని విమర్శించారు. మళ్లీ ఇప్పుడు వారు ఉద్యోగుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఏదేమైనా ఉద్యోగుల సంక్షేమం, వారికి రావాల్సిన జీపీఎఫ్, రిటైర్ అయినా ఉద్యోగుల విషయంలో ఒక విధానాన్ని ఏర్పాటుచేసి వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా అన్ని విధా లా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.