calender_icon.png 30 December, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీశ్‌కు ఇంత అహంకారమా!

30-12-2025 01:55:35 AM

ఇరిగేషన్‌లో తానే మాస్టర్ అనుకుంటున్నాడు

  1. ఆయన తీరును చూసి గోబెల్స్ ఆత్మకూడా సిగ్గుపడుతోంది 
  2. అబద్ధాల పునాదులపై బీఆర్‌ఎస్
  3. కృష్ణా జలాల్లో 299 టీఎంసీల నీటికి సంతకం చేశారు 
  4. మేడిగడ్డ పనులు త్వరలోనే మొదలవుతాయి 
  5. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్  29(విజయక్రాంతి): కృష్ణా జలాల్లో పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయం జరుగుతుందంటూ బీఆర్‌ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్త మ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. ‘బీఆర్‌ఎస్ ఎమ్మె ల్యే హరీశ్‌రావు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు.. ఇరిగేషన్‌లో తానే మాస్టర్ అని అనుకుంటున్నా డు.. అంత అహంకారం ఎందుకు’..? అని మంత్రి ఉత్తమ్ ఫైర్ అయ్యారు.

హరీశ్‌రావు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని చూసి గోబెల్స్ ఆత్మకూడా సిగ్గు పడుతోందని మండిపడ్డారు.  సోమవారం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియా తో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ కృష్ణా జలాల్లో పాలమూరు-రంగారెడ్డికి బీఆర్‌ఎస్ 90 టీఎంసీలు డిమాం డ్ చేస్తే.. తమ ప్రభు త్వం 45 టీఎంసీలే అడిగినట్లుగా  బీఆర్‌ఎస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎవరి హ యాంలో ఏం జరిగిందో అన్ని పత్రా లు బయటపెడుతామన్నారు.

పాలమూరు-రంగారెడ్డిలో 90 టీఎంసీలకు గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం ప్రతిపాదించిందని, దానినే తాము ముందుకు తీసుకెళ్లుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పాత జీవో కాపీలను మంత్రి ఉత్తమ్ మీడియాకు చూపించారు. తమ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేసి పాలమూరు జిల్లాకు నీరు అందిస్తామన్నారు.  బీఆర్‌ఎస్ అబద్ధ్దాల పునాదుల మీదనే బతుకుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. 

‘గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 2 వేల కోట్లతో పూర్తయ్యే  ఎస్‌ఎల్‌బీసీని పట్టించుకోలేదు. నార్లాపూర్ నుంచి ఎదులాబాద్ లింగ్ పనులను నిలపివేడయంతో పాటు డిస్ట్రిబ్యూటరీ ఛానెల్ పనులు ప్రారంభించలేదు. ఈ ప్రాజెక్టు ద్వారా నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, నల్లగొండ, ఖమ్మంలో జిల్లాలకు 12.3  లక్షల ఎకరాలకుపైగా నీరు అందించే ప్రాజెక్టును పక్కన పెట్టింది.  రూ. 900 కోట్లు ఖర్చుపెడితే పూర్తయ్యే కల్వకుర్తిని పట్టించుకోలేదు.

ఇరిగేషన్‌పై రూ. 1.83 లక్షల కోట్లు ఖర్చు చేసినా..  కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమా, డిండి లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్‌లోనే ఉన్నాయి. పదేళ్లలో పాలమూరు- రంగారెడ్డి లిప్ట్ ఇరిగేషన్‌కు రూ. 27 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఈ ప్రాజెక్టును రూ. 35 వేల కోట్ల ప్రాథమిక అంచనాతో ప్రారంభించి .. ఏడేళ్ల తర్వాత అదే ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి పంపించే నాటికి రూ. 55 వేల కోట్ల అంచనాకు పెంచారు.

రూ. 55 వేల కోట్ల వ్యయ అంచనాలో ఆయకట్టు కాలువలకు అవసరమైన  30 వేల ఎకరాల భూ సేకరణకు పూర్తి చేయలేదు. ప్రస్తుతం పాలమూరు- రంగారెడ్డి (పీఆర్‌ఎల్‌ఐ) ప్రాజెక్టు పథకం పూర్తి ఖర్చు రూ. 70 వేల కోట్లకు మించిపోయే అవకాశం ఉంది. ఇదే ప్రాజెక్టుపై రూ.  27 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికి ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లుగా రూ. 7 వేల కోట్లు ఖర్చు చేసి 11 పంపులను ఏర్పాటు చేశాం. 67 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు, 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు , 9 మీటర్ల పొడవున్న ప్రెజర్ మెయిన్‌లను వేయడం ద్వారా పనులు వేగవంతం చేశాం.

బీఆర్‌ఎస్ హయాంలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతుల కోసం పట్టించుకోలేదు. అదే కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల కోసం చాలా పనిచేసింది. దీంతో పాలమూరు- రంగారెడ్డిపై ప్రభుత్వానికున్న పక్షపాత వైఖరి స్పష్టమవుతుంది. పాలమూరు-రంగారెడ్డి  విషయంలో రోజుకు 2  టీఎంసీల నుంచి ఒక టీఎంసీకి తగ్గించగా, అదే కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వస్తే 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచారు.

అంతేకాకుండా పాలమూరు పనుల స్పీడ్‌ను తగ్గించాలని 2021లో  ఇంజనీర్లు మురళీధర్‌రావు, విజయభాస్కర్‌రెడ్డి, ఇతరులకు మౌఖికంగా  ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు కూడా సాధించలేదు’ అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 2019లోనే పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగానే రెండేళ్ల పాటు బహిరంగ విచారణ పూర్తి చేసిందని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ట్రిబ్యునల్ తీర్పు వచ్చే నాటికి కృష్ణా నీటి వినియోగాన్ని 299 టీఎంసీలకే పరిమితం చేయడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అఫెక్స్ కౌన్సిల్‌లో ఒప్పందం చేసుకుందన్నారు.

సుప్రీంకోర్టు విచారణలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో కొన్ని అంశాలపై 7 టీఎంసీలకే గత ప్రభుత్వం అంగీకరించిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు. మేడిగడ్డ మరమ్మతులపై ఎల్‌అండ్ టీకీ నోటీసులు ఇచ్చామన్నారు. మేడిగడ్డలో పలు పరీక్షలు, ఇతర తనిఖీలకు ఎల్‌అండ్ టీ అంగీకరిచిందన్నారు.  త్వరలోనే మేడిగడ్డ పనులు మొదలవుతాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.