calender_icon.png 30 December, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ సర్పంచ్‌ల అసెంబ్లీ ముట్టడి

30-12-2025 01:49:40 AM

  1. ఎక్కడిక్కడ అరెస్ట్ చేసిన పోలీసులు
  2. ‘పెండింగ్ బిల్లులు చెల్లించండి.. మా ప్రాణాలు కాపాడండి’
  3. ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు

హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): పెండింగ్ బిల్లు లు చెల్లించాలని మాజీ సర్పంచ్‌ల సోమవారం తలపెట్టిన అసెంబ్లీ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారిని ఎక్కడిక్కడ అరెస్ట్ చేశారు. పోలీసుల బందోబస్తును తప్పించుకుని వచ్చిన వేలాది మంది మాజీ సర్పంచ్‌లు, అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకు న్నారు. పోలీసులకు, మాజీ సర్పంచ్‌లకు తోపులాట జరగడంతో  పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఆందోళనకారులను అరెస్ట్ చేసి, నగరంలోని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ ధర్నాకు రాకుండా ఆదివారం అర్ధరాత్రే వివిధ మండలాల్లో చాలా మంది మాజీ ర్సంచ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ గేటు ఎదుట ‘మా పెండింగ్ బిల్లులు చెల్లించండి.. మా ప్రాణాలు కాపాడండి.. ముఖ్యమంత్రి గారూ.. మాపై కక్ష సాధింపు వద్దు.. అభివృద్ధి కోసం వడ్డీలు తెచ్చాం.. రెండు సంవత్సరాలుగా వడ్డీలు పెరిగిపోతున్నాయి’ అని మాజీ సర్పంచ్‌లు, సంఘం నాయకులు ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినదించారు.

ఈ సందర్భంగా  తెలంగాణ సర్పంచ్‌ల సంఘం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు యాదయ్యగౌడ్ మాట్లాడుతూ.. మాజీ సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లే మంత్రులు, ఎమ్మెల్యేల్లారా ‘మా తాజా మాజీ సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచండి’ అని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో మనస్థాపానికి గురై సర్పంచ్‌లు చలో అసెంబ్లీ బాటబట్టారని తెలిపారు.

అసెంబ్లీని ముట్టడించేందుకు చేరుకుంటున్నారని చెప్పారు. అయితే కొంత మంది తాజా, మాజీ సర్పంచ్‌లను హైదరాబాద్‌కు చేరుకోకుండా కట్టుదిట్టంగా వివిధ మండలాల్లో పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్టు చేస్తున్నారని, ఇది అన్యాయం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేసి దేశానికి ఆదర్శంగా వాటిని తీర్చిదిద్దినారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటివారు అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్‌లు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.

ప్రభుత్వం కనీసం పెండింగ్ బిల్లులపై స్పష్టత ఇవ్వకపోవడం చాలా బాధాకరం అన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో తాజా మాజీ సర్పంచ్‌లపై కక్ష సాధింపు ఎందుకని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కేశ బోయిన మల్లయ్య, రంగల్ రవీందర్రావు, సిద్దిపేట సుభాష్‌గౌడ్, సూర్యాపేట యాకూబ్ నాయక్, అరవింద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు