calender_icon.png 8 September, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మమకారం నిండిన నుడికారం

08-09-2025 12:33:34 AM

డా.ఎన్.బాలాచారి :

9న తెలంగాణ భాషా దినోత్సవం (కాళోజీ జయంతి) :

* కాళోజీ కవిత్వం తెలంగాణ ఆత్మకు ప్రతీక. ఆయన రచనల్లో మట్టి వాసన, తెలంగాణ పల్లె జీవితం, సామాన్యుడి బతుకు జీవనం తొణికిసలాడతాయి. ‘ఎవని వాడుక భాష వాడు రాయాలె. అట్లా రాస్తే అవతలోనికి తెలుస్తదా.. ఆని ముందరనే మనకు మనం అనుకుంటే, మనకు మనం తక్కువ చేసుకున్నట్లే. ఈ బానిస భావన పోవాలె. నేనెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు - ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష. పలుకుబడుల భాష గావాలె’ అంటూ కాళోజీ ఎన్నోసార్లు చాటిచెప్పారు.

* ఓటీటీ పుణ్యమా.. అని చిన్న సినిమాల సందడితో తెలంగాణ కథలు కనిపిస్తున్నాయి. ఇది ప్రత్యేక తెలంగాణ సాధించిన సాహిత్య సంస్కృతుల విజయం. తెలంగాణ భాషా దినోత్సవం ఒక వేడుక కాదు.. అది ఒక జ్ఞాపకం -మన భాషపై గర్వభావాన్ని కలిగిం చే ఆత్మగౌరవ స్ఫూర్తి, కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఆయన సేవలకు గొప్ప గుర్తింపు. 

భావ వినిమయ సాధనం భాష. ఆ భాష ఒక ప్రాంతపు ఆత్మను ప్రతిబింబింస్తుంది. ఏ ప్రాంతపు భాషలోని పదాల ఉచ్ఛారణ, పద ప్రయోగాలు ఆ ప్రాంతపు జీవన విధానాన్ని ప్రతిబింబిస్తా యి. ఏ భాషకైనా ప్రాంతీయ మాండలికాలు ఉండడం సహజం. అనంతర కాలంలో ఆ మాండలికాలు స్వతంత్ర భాషగా రూపాంత రం చెందడాన్ని గమనిస్తున్నాం. ఉదాహరణకు తమిళ భాషకు మాండలిక భాషగా ఉన్న మలయాళ భాష కాలక్రమంలో ప్రత్యే క భాషగా మారింది.

అలాగే తెలుగు భాషీయుల ప్రాంతాల్లో ఆంధ్ర ప్రాంత పాలకు లుగా ఆంగ్లేయులుంటే, తెలంగాణ ప్రాం తాన్ని ముస్లింలు పరిపాలించారు. పాలకుల భాషా ప్రభావం పాలితులపై ఉండడమేగాక, ప్రాంతీయ భాష హేళన పాలుగావడం అనుభవించాం. ప్రపంచంలో ఏ భాష ‘స్వచ్ఛంగా’ ఉండదు. అన్య భాషల ప్రభావంతో ఆదానప్రదానాలు అనివార్యం. అదే మన తెలుగు భాషలోనూ జరిగింది. ఆంధ్రాప్రాంతపు తెలుగు భాషలో ఆంగ్లం మిళితమైతే, తెలంగాణ భాషలో ఉర్దూ భాష కలిసింది.

పాలకుల ప్రభావం వల్ల ఆంధ్రా ప్రాంతం ఆధునికత వైపు అడుగులు వేస్తే, తెలంగాణ ప్రాంతం మధ్య యుగాల్లోకి వెళ్లి పాలితుల్ని బానిసలుగా చూస్తూ అణచివేస్తుంటే భరించలేకే సాయుధ పోరాటం జరగడం చారి త్రక అవసరమైంది. పక్కనున్న తెలుగువారితో ‘తౌరక్యాంధ్రం’గా చిన్నచూపునకు గురైంది. ఆ సందర్భంలో భాషా భివృద్ధికి ‘శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం’ (1901), ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ (1943) ఆవిర్భవించాయి.

తెలుగు భాషపై ఉర్దూ ప్రభావం ‘తామరాకు మీద నీటిబొట్టులా కాకుండా, పాలూనీళ్లలా కలిసిపోయింది. అందుకే దవాఖాన, టపాఖాన, సడక్, నల్లా మొదలైన పదాలు పక్కా తెలుగు పదాలుగా అనిపిస్తాయి. అయితే, తెలంగాణ భారతదేశంలో మిళితమయ్యే వరకు తెలుగు వారు ఉర్దూ మాధ్యమంలోనే విద్యను గడించారు. దీంతో ఉర్దూ సాహిత్యపు సొగసులు తెలు గు వారు నేర్వడం వల్ల తెలంగాణ తెలుగు సారస్వతం సొగసులు మరింత పెరిగి తెలంగాణ భాష నేటికీ ప్రత్యేకతను చాటుకుంటు న్నది.

తెలంగాణ 2014 నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతపు భాషా, సాహిత్యాలకు ప్రాధాన్యం పెరిగింది. అందుకు ఈ ప్రాంతపు ప్రజాకవుల పేరున అవార్డును ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. దీనిలో భాగంగా పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సెప్టెంబర్ 9వ తేదీన ‘తెలంగాణ భాషా దినోత్సవం’గా ప్రభుత్వం ప్రకటించింది. ఏటా కవిని ఎంపిక చేసి కాళోజీ పురస్కారం అందజేస్తున్నది. 

చిన్న వయస్సులోనే ఉద్యమంలోకి..

1914 సెప్టెంబర్ 9వ తేదీన జన్మించిన కాళోజీ నారాయణరావు చిన్న వయస్సులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో అడుగుపె ట్టారు. నిజాం పాలనలో ప్రజలపై జరుగుతున్న అన్యాయాలపై తన గళాన్ని వినిపిం చారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని ప్రజల హక్కుల కోసం జైలు జీవి తం గడిపారు. రాజకీయ, సామాజిక, సాహి త్య రంగాల్లో కాళోజీ సేవలు అపారమైనవి. అందుకే ఆయన ప్రజాకవి అయ్యారు. కాళోజీ కవిత్వం తెలంగాణ ఆత్మకు ప్రతీక.

ఆయన రచనల్లో మట్టి వాసన, తెలంగాణ పల్లె జీవితం, సామాన్యుడి బతుకు జీవనం తొణికిసలాడతాయి. ‘ఎవని వాడుక భాష వాడు రాయాలె. అట్లా రాస్తే అవతలోనికి తెలుస్తదా.. ఆని ముందరనే మనకు మనం అనుకుంటే, మనకు మనం తక్కువ చేసుకున్నట్లే. ఈ బానిస భావన పోవాలె. నేనెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు - ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. పలుకుబడుల భాష గావాలె’ అంటూ కాళోజీ ఎన్నోసార్లు చాటిచెప్పారు.

దీనిలో భాగంగానే తెలంగాణ పలుకు బడులు కాళోజీ కవిత్వంలో కనిపించేవి. ‘నా గొడవ‘ కవితా సంపుటిలో ఆయన వాడిన పదాలు, అలంకారాలకు దూరంగా ఉంటూనే.. సూటిగా కటువైన వ్యంగ్యంతో ఉంటాయి. ఆయన కవిత్వం విద్యావంతులకే కాదు, సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా ఉం టుంది. తెలంగాణ భాష అనేది తెలుగులోని ఒక మధురమైన రూపం. కొన్ని దశాబ్దాల పాటు తెలంగాణ భాషను బట్టి ‘పల్లెటూరి మాటలు‘ అని తక్కువజేసి చూసేవారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ భాష పలుకుబడులను అవమానపరిచే విధంగా మాట్లాడేవారు. కానీ కాళోజీ తెలంగాణ భాషలో ఉన్న అందాన్ని, శక్తిని సమాజానికి చూపించారు. ఆ ప్రేరణతోనే తెలంగాణ ప్రభుత్వం 2014లో అధికారికంగా ‘కాళోజీ‘జయంతి. అయిన సెప్టెంబర్ 9న తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది.

ఆప్యాయత నిండి ఉన్న భాష..

రోజు మన భాషలో ఉన్న మాధుర్యం. పదాల విన్యాసం, జానపద పదజాలాన్ని మననం చేసుకునే రోజిది. తెలంగాణ భాష లో వట్టి పల్లె పలుకులే కాదు.. అది మన సంస్కృతీ, మన చరిత్ర, మన అస్థిత్వం. తెలంగాణ ప్రజలు మాట్లాడేది ఎంతో అర్థవంతమైన భాష. మచ్చుకు తెలంగాణలో వ్యవహరించే కాపోళ్లు, కాపుదనపోల్లు అనే మాటలు అసలు సిసలు తెలుగు పదాలు. పంట పండించి వాటికి కాపు (కాపలాగా) ఉండేవాళ్లు కాపోళ్లు.

కానీ దీనికి సమానార్థం ఆంధ్రాలో రైతులు అంటున్నారు కానీ, రైతు ఉర్దూ పదం. అంగాన్ని లేదా శరీరాన్ని కప్పి ఉంచేది అంగీ. లాగుతూ వేసు కొని లాగు తీరునీ తీసి పారేస్తాం కాబట్టి.. లాగు (పంట్లము) అయింది. గుల్లగా ఉండే ది గుల్ల (గంప) అనీ, లోన బోలుగా ఉంటా యి కాబట్టి బోలుప్యాలాలు (మరమరాలు) అనేటప్పుడు కంచంలో ఒక అంచుకు, అంటే పక్కకు పెట్టుకుంటారు కాబట్టి..

అంచుకు పెట్టుకొనుడు (నంజుకోవడం) తడిగల్గిన భూమి కాబట్టి తరి (మాగాణి), శుష్కమైన ఎండిన నేల కాబట్టి కుష్కీ (మెట్ట) అనీ, కళ్లు బైర్లు కమ్ముతూ మన కళ్ల ముం దు చక్రం తిరిగినట్లు తిరగడం చెక్కరచ్చుడు (తల తిరగడం) గుండ్రంగా ఉండేది గుండీ (బొత్తరం).. ఇలా సరళమైన అర్థవంతమైన పదాలగలది మన తెలంగాణ భాష. అన్ని భాషల్లాగే తెలంగాణ భాషకు జవజీవాలు, జాతీయాలు, సామెతలే. తెలంగాణ భాష పలుకు అంతా నుడికారంలో ఉంది.

జానపదం ప్రతిపదంలో తొణికసలాడుతుంది. మట్టి వాసనల గుబాళింపే మట్టి భాష. తెలంగాణలో చిన్న పిల్లల ముక్కుల్లోంచి చీముడు పారితే ముక్కు వచ్చింది తియ్యండి.. అంటారు. కళ్ల కలకలను కండ్లు వచ్చినయి అనీ, అందంగా నవ్వితే శిల్క నవ్వు అనీ, అర్థవంతమైన భాషా సొబగులు మనకు తెలంగాణ పల్లెల్లో గుబాళిస్తాయి. తెలంగాణ ప్రజల మనసులాగే భాష కూడా ఎంతో ఆత్మీయమైనది. ‘అన్నా ఎటువోతున్నవే’, ‘ఓ అవ్వా మంచిగున్నావా’.

‘పైలం తమ్మి’, ‘ఏం పరాశికాలు తాత’, బావా! ‘శెల్లె’ను బతుకమ్మ పండుగకు పంపరాదే’ లాంటి ఆప్యాయత తెలంగాణ భాషకే సొం తం. మనిషికి మనిషికి నిచ్చెనలు వేసినట్లు పదాలు దొర్లుతుంటాయి. భాషావేత్తలకు, సాహితీకారులకు, నిఘంటువు నిర్మాణానికి సమాచారం ఇవ్వగలిగిన అక్షయ పాత్ర. ఇట్లాంటి భాషకు భాషావేత్తలంతా మన భాషను గ్రంథీకరణ చేయాలె. సమగ్ర పదకోశం తేవాలె. భాషాభిమానులు. భాషావే త్తలు కృషి చేసి మనదైన తెలంగాణ పద సౌందర్యానికి పట్టం గట్టాలె. 

ఆస్తిత్వ జెండా ఎగురుతున్నది.. 

తెలంగాణ జీవభాష ఇప్పుడు అస్తిత్వ జెండా ఎగురవేస్తున్నది. తెలంగాణా ఉద్యమంలో తెలంగాణ భాషకు నుడికారాలు ప్రధాన అంశాలై ఉద్యమ దీప్తిని రగిలించాయి. తత్ఫలితంగా తెలంగాణ ఏర్పాటు తర్వాత వచ్చిన సినిమాల్లో, టీవీ సీరియళ్లలో హీరో ఇప్పుడు తెలంగాణ భాషను మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు విలన్ల భాష అయిన తెలంగాణ భాష తన అస్తిత్వ జెండా ఎగురవేసింది. తెలంగాణా మట్టి మనుషుల గాథలే సినిమా కథలవుతున్నాయి.

ఓటీటీ పుణ్యమా.. అని చిన్న సినిమాల సందడితో తెలంగాణ కథలు కనిపిస్తున్నాయి. ఇది ప్రత్యేక తెలంగాణ సాధించిన సాహిత్య సంస్కృతుల విజయం. తెలంగాణ భాషా దినోత్సవం ఒక వేడుక కాదు.. అది ఒక జ్ఞాపకం -మన భాషపై గర్వభావాన్ని కలిగిం చే ఆత్మగౌరవ స్ఫూర్తి, కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఆయన సేవలకు గొప్ప గుర్తింపు. మన భావితరాలకు మన భాషను అందించడం ద్వారా మనం బాధ్యతను నెరవేర్చాలి.

వాడవాడలా రాష్ట్రం నలుమూల భాషా దినోత్సవం జరగాలి. తద్వారా మన సంస్కృతిని, సంప్రదాయాలను నిలబెట్టాలి. అదే తెలంగాణా భాషకు సరైన గుర్తింపు. కాళోజీ మనకు గర్వకారణం. ఈ సందర్భం గా తెలంగాణ ప్రభుత్వం కాళోజీ అవార్డును సాహితీవేత్తలకు ప్రదానం చేయడం రాష్ట్ర సాహిత్య అకాడమీ కాళోజీ జయంతిని నిర్వహించడం, ఈ సందర్భంగా కాళోజీ రచిం చిన ‘కాళోజీ కథల’ సంకలనాన్ని ఆవిష్కరించడం ద్వారా మనం మరోసారి తెలంగాణ భాష ఔన్నత్యాన్ని పునరంకితం అవ్వడమే.

రచయిత: తెలంగాణ సాహిత్య 

అకాడమీ కార్యదర్శి