calender_icon.png 8 September, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అస్తిత్వ స్వరం ‘అసిపె’

08-09-2025 12:28:49 AM

కవిత్వం  విభిన్న ఆలోచనల ధారావాహిక. అది కేవలం హృదయానికి హత్తుకునే కళ మాత్రమే కాదు. సామాజిక వర్గాల పట్ల స్పృహను మేల్కొలిపే సాధనం. వస్తు వైవిధ్యంతో సమాజ హితాన్ని గుండె లోతుల్లో తడిపే శక్తి కవిత్వానిది. కవులు నిజాన్ని, సామాజిక పరిస్థితులను అంచనా వేసి అక్షరబద్ధం చేస్తారు. అందువల్లే కవిత్వం కరిగిన కొవ్వొత్తిలా, వెలుగునిచ్చే దీపంలా, ప్రజా సమస్యలపై నిరంతరం కొట్లాడుతూ ఉంటుం ది.

కవిత్వ ప్రక్రియల్లో దీర్ఘ కవితది ప్రత్యేక స్థానం. కవులు తనలోని భావోద్వేగాలను, ఆలోచనలను, అనుభూతులను, వర్గపోరాటాలను ఈ ప్రక్రియ లో ఆవిష్కరిస్తారు. ఆ తరహా ప్రక్రియను అవలంబించే కవుల్లో వనపట్ల సుబ్బయ్య ఒకరు. ప్రజా సమస్యలే తన సమస్యలుగా భావించి కవిత్వం అల్లడం ఆయన నైజం. అలాంటి కోవలోనే ఆయన ‘అసిపె’ అనే దీర్ఘకావ్యం రచించారు. అసిపె అంటే మంగలి వృత్తిదారులు వస్తువులు ఉంచే పెట్టె.

క్షవర వృత్తిలో ఉన్న సాధక బాధకాలను, కష్టాలను, అనుభవాలను తన లోతైన  స్పృహ, గాఢమైన విశ్లేషణ పదాలతో అల్లాడు. ఇందులో పాఠకుల హృదయాలను మెలిమి తిప్పే వర్గపోరాట స్పృహ, బహుజనవాదం ప్రతిబింబించాయి. ఈ కావ్యం వృత్తి జీవితపు అనుభవాల సారాన్ని సమాజ సమస్యలతో కలిపిన ప్రతీకాత్మక అద్దం. సుబ్బయ్య శైలిలోని వినూత్నత కవిత్వానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. సమాజ సమస్యలను, పల్లె బ్రతుకులను, మంగలి వృత్తి వైభవాన్ని చిత్రించే అద్భుతమైన కవనం ఆయనది.

ఒకవైపు వృత్తిని, మరొకవైపు ప్రవృత్తిని సమన్వయం చేసుకున్న సవ్యసాచి. ‘మా ఊరిలో /కోడికూత /మా నాయన కత్తి నూట / రెండొక్కటే సారి’.. అంటూ మొదలైన ఈ దీర్ఘకావ్యం వృత్తి జీవన కోసం కుటుంబ బాధ్యతలు మోసే తండ్రి గొప్పతనాన్ని, పల్లె భాషలను, ఊరి బతుకులను కష్టాల కడగండ్లను, పల్లె పరిస్థితులను పలవరిస్తారు. మంచి అలంకారాలతో కోడి కూత, కత్తి నూట అనే ప్రాసాపదాలను పాఠక లోకానికి అందిస్తారు.

కవికి లోతైన విశ్లేషణ ఉంటే కానీ ఈ పదజాలం సాధ్యం కాదు. ‘భుజాన నాగలితో/ రైతు / లేలేత కిరణాలతో/ భాస్కరుడు /కసిర గొంగడి /సంకన అసిపేతో/ మంగలి బాలయ్య / పల్లెకు వెలుగు/ ఊరుకు అందం నాగరికతకు తొలి పొద్దు’ అంటూ  వేకువనే లేచి రైతు నాగలితో జీవనాధారం, ఉదయాన్నే ఉదయించే భాస్కరుడు  కిరణాలతో ఆశ, ఆశయం, బాధ్యత ప్రతిబింబిస్తూ మంగలి వృత్తితో ఊరి అందం ఆవిష్కరిస్తారు.

మంచి తాత్వికతతో కలసే పల్లె ప్రాణం, నాగరికతకు తొలి వెలుగు. మంచి ఉపమానాలు, ప్రతీకలను ఆవిష్కరిస్తారు. ‘అసిపే మా ఇంట్లో దీపం వాకిట్ల మందారం.. అదే మా వైభోగం’ అంటూ తమ ఆస్తిత స్వరాన్ని అక్షరాలతో ప్రచురిస్తారు. అది మంగళ వృత్తికి జీవనస్వరం. ‘గడ్డం గీస్తే మూడు రోజుల వరకు వెంట్రుకలు తగులవు కత్తి తగిలినట్లు ఉండని పనితనం దారంలా సన్న మీసం.. బంగారానికి వరమద్దినంత సుకుమారం.. ముక్కెర మలచినంత అందంగా 

కొబ్బరి పీచులు తీసిన టెంకాయలా’ పని నైపుణ్యాన్ని, రూపక సౌందర్యాన్ని, మృదుత్వాన్ని పాటకలోకానికి సూదిలో దారం దిగినట్లుగా వివరిస్తారు. తమ కత్తికున్న పదునును, పనిచేసే  సున్నితత్వాన్ని, బంగారము, ముక్కెర అనే రెండు ఉపమానాలతో శిల్ప సౌందర్యాన్ని చెక్కుతారు. ‘రాజులకు రాజ్యాలున్నట్లే/ పనోళ్లకు ఊళ్లు /ఎన్ని ఊర్లుంటే అంత ఆస్తి/ ఈయాల ఈ ఊరులు/ రేపు ఇంకో ఊరుల సవురాలు’ రాజుకు రాజ్యం ఎంత బలమో పనివానికి పల్లెటూర్లు అంత బలం.

ఆ ఊరిని తన ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యంగా భావించే మంచి మనసు వారిది. ఇక్కడ వృత్తి జీవన సత్యాన్ని, వలస పోయిన అనిశ్చితత్వ దృష్టి కోణాన్ని స్పృశిస్తూ ఉంటారు. ‘అసిపే చేతుల పట్టందే పూట గడువని బతుకు.. సవురం కత్తులు నూరి నూరి.. రాయి అయినట్లే బతుకు కరిగిపాయే..’ అంటూ సుబ్బయ్య తనలోని ఆవేదనను, భావోద్వేగాన్ని, ఆక్రోశాన్ని వెలిబుచ్చుతారు.

“రెక్కాడితే కానీ డొక్కాడని” శ్రమజీవుల సౌందర్యాన్ని తడుముతారు. మంగలి వృత్తి జీవనంలో పూట గడవని బ్రతుకులకు కత్తులు నూరి నూరి రాయి అరిగిపోయినట్లు బ్రతుకు కూడా చివరికి రాయి లాగా అరిగిపోయింది.. అనే భావనను స్పర్శిస్తారు. 

కంచర్ల మహేశ్