29-07-2025 01:35:32 AM
తుంగతుర్తి, జులై 28 : గత కొన్ని సంవత్సరాలుగా ప్రయాణానికి ఇబ్బందులు పడుతున్న నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు, ప్రయాణికులు, రైతుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. వానాకాలం వచ్చిందంటే చాలు వాగు దాటాలంటేనే భయపడేవారు.
నెలల తరబడి వాగుపై రైతన్నలు, ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఈ క్రమంలో వాగులో పడి కొందరు మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అక్కడ బ్రిడ్జి నిర్మాణం, రోడ్డు ఏర్పాటు చేస్తుండడంతో ఈ నియోజకవర్గ ప్రజల ఏండ్ల కల.. అలా తీరనుంది.
సవ్యంగా సాగని పయనం
జిల్లాలోని తుంగతుర్తి మండల పరిధిలోని గల సంగెం, కోడూరు గ్రామాల మధ్య బంధం వాగు ఉంది. వర్షాకాలం వచ్చిందంటే కురుస్తున్న వానలకు రుద్రమ చెరువు నుండి ఉద్రిక్తంగా ప్రవహించే వరదతో ఆ మార్గంలో ప్రయాణం సవ్యంగా సాగేది కాదు. సంగెం మీదుగా ఇతర ప్రాంతాలకు ప్రయాణికులు, వ్యవసాయదారులు వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వచ్చేది.
ఈ వాగుపై వర్షాకాలంలో ప్రయాణిస్తున్న సమయంలో వరద ఉధృతికి దానిలో కొట్టుకుపోయి ప్రాణాలు పోయిన ఘటనలు సైతం ఉన్నాయి. ఎండ్లపెల్లి రుద్రమ చెరువు వద్ద ప్రారంభమైన ఈ వాగు సుమారుగా 70 కిలో మీటర్లు సుదూర ప్రయాణం చేసి చివరికి మూసి నదిలో కలవడం గమనార్హం.
ఎమ్మెల్యే చొరవతో నిధుల మంజురి
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ ప్రాంతంలో పర్యటించిన మందుల సామేల్ గెలిచిన వెంటనే తిమ్మాపురం నుండి కోడూరు, కొమ్మాలా, సంగెం వెంకేపల్లి, చిల్పకుంట్ల నూతనకల్ వరకు డబుల్ రోడ్డు వేయించడమే కాకుండా సంగెం గ్రామంలోని బంధం వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చాడు.
ఇచ్చిన మాటకు కట్టుబడి గెలిచిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళ్ళాడు. వారి సూచనల మేరకు బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపగా రూ.12 కోట్లు నిధులు మంజూరు చేయడమే కాక వెంటనే పనులు సైతం ప్రారంభం కాగా ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఎన్నో ఏళ్ల కల ఎమ్మెల్యే సామేల్ కృషితో తీరుతుంది అంటూ ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏండ్ల బాధలు తీరనున్నాయి
ఎన్నో ఏండ్లుగా ఈ వాగుపై బ్రిడ్జి లేకపోవడం కారణంగా ప్రయాణానికి చాలా బాధలు పడ్డాం. ఎమ్మెల్యే సామేల్ నిధులు మంజూరీ చేయించడంతో ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఐదు గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
కలకోట్ల మల్లేష్. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు
ఇంగ పయనం ఆగదు
గతంలో వానలు వస్తే వాగులు పారి అటు, ఇటు పోవడానికి వీలు ఉండేది కాదు. కానీ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ కృషితో సంగెం గ్రామంలోని బంధం వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. దీంతోని బ్రిడ్జి కట్టడంతో పాటు, రోడ్డు కూడా వేస్తుండ్రు. ఇక ఈ రోడ్డులో పయనం ఆగదు. ఆ బాధలు ఉండవు,
యేషమల్ల. వెంకన్న, సంగెం గ్రామస్తుడు