calender_icon.png 9 January, 2026 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ‘లీజు’ దందా..!

07-01-2026 12:37:19 AM

  1. గంజ్ హైస్కూల్ దుకాణాల లీజుదారుల దోపిడీ

ఓపెన్ యాక్షన్ నిర్వహించా లంటున్న నగరవాసులు

కరీంనగర్, జనవరి 6 (విజయ క్రాంతి): కరీంనగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల(గంజ్) అతిపురాతనమైనది. 1928లో కరీంనగర్ నడిబొడ్డునగల గంజ్ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారు. నగర ప్రధాన వ్యాపార కూడలిగా ప్రకాశం గంజ్ నేటికి కొనసాగుతున్నది. ఈ ప్రకాశం గంజ్ వ్యాపార కూడలి సముదాయానికి ఆనుకొని గంజ్ హైస్కూల్ ఉంటుంది. ఈ గంజ్ హైస్కూలో వ్యాపార కూడలివైపు 21 దుకాణాల సముదాయాన్ని 1981 లో నిర్మించారు. పాఠశాల అభివృద్ధికి గాను కిరాయి ద్వారా వచ్చే సొమ్ము పనికి వస్తుందని భావించి ఈ నిర్మాణం చేపట్టారు.

21 దుకాణాలను లీజు పద్ధతిలో కేటాయించారు. తొలుత 25 సంవత్సరాల లీజు, అది ముగిసిన తర్వాత 10 సంవత్సరాల లీజుకు ఇచ్చారు. ఈ లీజుకు పీరియడ్ 2028తో ముగియనుంది. ఈ దుకాణాల సముదాయాల లీజును నెలకు వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు. అయితే ఈ సముదాయంలో ఒకరిద్దరు తప్ప లీజుదారులెవరు వ్యాపారం చేయడం లేదు. వీటిని సబ్ లీజు కింద ఇతరులకు ఇచ్చేశారు. వీరి వద్ద నుండి వారు నెలకు 15 వేల వరకు, కొందరు 20 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు.

ఈ సబ్ లీజుదారులు కూడా గంజ్ రహదారిని ఆక్రమించి ముందు వరకు షెడ్లను నిర్మించి స్వంత దుకాణాల తరహాలో వ్యాపారం కొనసాగిస్తున్నారు. లీజుదారులు చెల్లించే వెయ్యి రూపాయలు సంవత్సరానికి 21 వేల రూపాయలు ప్రభుత్వానికి వస్తుండగా, లీజుదా రులు మాత్రం 3 లక్షల నుంచి 4 లక్షల వరకు సంపాదిస్తున్నారు. కొందరు గంజ్ పెద్దలు, రాజకీయ నాయకుల సహకారంతో ఈ లీజు ధరను పెంచకుండా వ్యాపారులు ఈ దందాను. కొనసాగిస్తున్నారు.

కొందరు అమ్మేశారు..

లీజు వ్యవహారం ఇలా ఉంటే ముగ్గురు లీజుదారులు ఏకంగా ప్రముఖ వ్యాపారులకు అగ్రిమెంట్ పద్ధతిలో అమ్మేశారు. ఈ వ్యవహారం తెలిసినప్పటికి ఇటు విద్యాశాఖ అధికారులుగాని, ఆర్ అండ్ బి అధికారులుగాని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ ’గ’లీజు దందాను అరికట్టాలని, గంజ్ హైస్కూల్ ఆదాయ వనరులు పెంచేందుకు ఈ దుకాణాల సముదాయానికి ఓపెన్ యాక్షన్ ద్వారా లీజుకు ఇవ్వాలని కోరుతున్నారు.