07-07-2025 12:00:00 AM
ఎవ్వరి కథ వారే చెప్పుకోవాలి. ఆ చెప్పడంలో నిజాయతీ, నిర్భీతి ఉండాలి. కానీ అందరికీ ఈ ఆలోచన రాదు. కొన్ని సమూహాలకైతే ఇప్పటివరకూ కూడా తమ గొంతు విని పించే అవకాశమైనా రాలేదు. దీని వలన సోకాల్డ్ సాహిత్యం పేరిట జరిగిన ప్రమాదం ఏమంటే ఒకరి గురించి వేరెవరో తమకి తోచినట్టుగా రాసుకుపోతేనూ, చెప్పుకుపోతేనూ అదే నిజమనుకొనింది సమాజం.
చింతా దీక్షితులు 1924 లో రాసిన ‘చెంచురాణి’ లోనిది అసలైన చెంచు జీవితం కాదని చెంచు రచయిత తోకల గురవయ్య ‘చెంచు కథలు’ రాసేవరకూ లోకానికి తెలియదు. రచనల మాటున ‘ప్రమాదం’ ఎటువంటిదో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలుగు సాహిత్యం నుంచి ఇటువంటి ఉదాహరణలు ఎన్ను నా ఇవ్వొచ్చు.
కనుక దీనికి విరుగుడుగా ప్రతి కులం (అందమైన, సౌఖ్యమైన ‘సామాజిక వర్గం’ అనే ముసుగు పదబంధం వాడనందుకు జడుసుకోకండి) నుంచి ఓ రచయిత రావా లి. తాను ఏ ప్రభావాలకీ లోనుకాకుండా తననూ, తనవారినీ, తాను మాత్రమే చెప్పగల తన కుదురుకు సంబంధించిన అన్నింటినీ నమోదు చేయగలగాలి.
అలాగ రచయిత తాను చెప్పాలనుకున్నదానితో అనుభవపూర్వకంగా మమేకమై ఉన్నప్పుడు లేదా అది తన జీవితంతో ముడిపడినది ఐనప్పుడు - ఏమి రాశాడు, ఎలా రాశాడు, దానితో సామాజిక ప్రయోజనం ఏముంది, ఏమి సందేశం ఇచ్చినాడు వగైరా బూజు పట్టిన పాత చింత తొక్కు విమర్శక కొలమానాల్లోంచి కాకుండా ఎంత ప్రేమతో, తపనతో, పారదర్శకతతో, ఎంతగా గుండె చీల్చుకుని రాశాడన్న దృక్కోణం నుంచి చూడాల్సి ఉంటుంది.
జానపద వీరుడి వంటి బెస్త మైరావణుడు ప్రధాన పాత్రగా భారతదేశ గత ఎనభై ఏళ్ల సామాజిక చరిత్రకి వర్తమాన రాజకీయ అంశాలను చేర్చి బలమైన తర్కంతో సాగిం ది ఈ నవల. జానపద వీరుడు అంటేనే ‘అధికార మదానికి, పీడనకీ’ లొంగనివాడు, తల తెగిపడుతున్నా చెదరనివాడు కనుక రచయిత దీని ద్వారా ఏమి చెప్పదలచినాడో పాఠకులు సులభంగానే గ్రహించగలరు.
మరొక విశేషం ఏమంటే బెస్తవారి నిజజీవితాన్ని తెలుగులో ఈ నవలే తొలిసారిగా స్పష్టంగా చిత్రిస్తోంది. సమూ హాన్ని బట్టి ఏవో అపోహలు స్థిరపడి వున్న సమాజంలో చావుకి తెగించే బెస్తల వేట వైనాన్నీ, కడుపు చేతపట్టుకొని తరలిపోయే వారి వలస జీవనాన్నీ బయట ప్రపంచానికి తెలియని కోణాల నుంచి దగ్గరగా చూపుతోంది.
ఇలా తన నేపథ్యాన్ని మరచిపోకుండా ప్రయోగాత్మకంగా రచన చేయడంలో సఫలమైనాడు ప్రసాద్ సూరి. రెండవ రచనకే అతను ఈ ఒడుపు, నేర్పు సాధించడంలో ఆశ్చర్యమేమీ లేదు. తనదైన కథ చెప్పుకోవడంలో అతని తపన, ప్రేమ వొంక పెట్టలేనివి కనుకనే ఇలా సాధ్యమై ఉంటుంది.
లోతుగా వల వేయండి అంటూ మనుషుల్ని పట్టే జాలరి గురించి బైబిల్ చెప్పినట్టు ఇతను తన మూలాల లోతుల్లో వలవేసి కథలు తెచ్చే జాలరి.
ఈ ముద్రణలాగే ముప్పు ఐదేళ్లలోపు వయస్కుల రచనలను తీసుకురావాలనే ఛాయా పబ్లికేషన్స్ ఆలోచన, ప్రతిభగల ప్రతి యువ రచయితకూ ఊతంగా నిలబడటంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని నమ్ముతున్నాను.
(ప్రసాద్ సూరి ‘మైరావణ’ నవలకు రాసిన ముందుమాట)