19-06-2025 10:28:48 PM
పార్టీలతో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఇల్లు..
స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): అత్యంత నిరుపేదలు చదివే ప్రభుత్వ జూనియర్ కళాశాలను అత్యంత ఆధునిక హంగులతో నూతన భవనాన్ని నిర్మిస్తామని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి(MLA Kuchukulla Rajesh Reddy) అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లోని గ్రామాల్లో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం దళిత, బహుజన, నిరుపేదలేనని వారిని అభివృద్ధి పథంలోకి నడిపించాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని అందులో భాగంగానే పూర్తిగా ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పూర్తిగా ఇల్లు కట్టుకునేందుకు భూమి కూడా లేనివారికి ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇళ్లను మరమ్మత్తు పనులు చేసి ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి పలుమార్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల సందర్శనార్థం వచ్చిన సందర్భంగా కళాశాల స్థితిగతులను చూసి చలించి పోయినట్లు తెలిపారు.
ఎట్టి పరిస్థితులోనూ నూతన భవనాన్ని నిర్మించాల్సిందేనని కంకణం కట్టుకొని ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్యమంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ప్రభుత్వం నూతన హంగులతో కళాశాల నిర్మాణం కోసం 9 కోట్లు నిధులు విడుదల చేసినట్లు వెనువెంటనే నిర్మాణ పనులు కూడా ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల మెప్పు పొందుతోందని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు చిల్లర ఆరోపణలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. వారితో పాటు ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ, ఇతర శాఖల ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు వెంట ఉన్నారు.