calender_icon.png 4 August, 2025 | 1:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇచ్చిన మాట నెరవేరుస్తున్న ప్రభుత్వం

04-08-2025 12:34:50 AM

-అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

- నిమ్స్‌లోనే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది 

-యశోద, అపోలోకి వెళ్ళకండి 

-కాళేశ్వరం అక్రమాలలో నిర్ణయాలు తీసుకున్న అందరికి శిక్ష పడాలి

-గజే ్వల్ లో రేషన్ కార్డుల పంపిణీలో ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్

 గజ్వేల్, ఆగస్టు 3 : ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలను నెరవేరుస్తుందని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నూతనంగా  మంజూరు చేసిన 3,967 రేషన్ కార్డులను గజ్వేల్, వర్గల్,జగదేవపూర్, ములుగు, మర్కుక్ మండల కేంద్రాలలో లబ్ధిదారులకు మంత్రి వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు 12 కోట్ల వ్యయంతో సన్న బియ్యం పంపిణీ చేశామన్నారు. జిల్లాలో ఇప్పటికే 12 వేల ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయని ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మించిన లబ్ధిదారులకే డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు.  సిద్దిపేట జిల్లాకు 350 కోట్ల రైతు భరోసా, 22 కోట్ల గ్యాస్ సబ్సిడీ రెండు లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు.

ఇప్పటికే జిల్లా మహిళలు నాలుగు కోట్ల ఉచిత బస్ టికెట్లను వినియోగించుకున్నట్లు తెలిపారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్లు అప్పు అప్పజెప్పినా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.  నిమ్స్ ఆసుపత్రిలో మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని, ప్రజలు యశోద అపోలో ఆసుపత్రులకు వెళితే ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పారు.

ఇప్పటివరకు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న వారికి కూడా సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.900 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని 10000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని రూ. 36 కోట్లతో జిల్లాలో పాఠశాల మరమ్మత్తు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి ఫలితాలు వస్తున్నాయని ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. 

కాళేశ్వరం అక్రమాలలో నిర్ణయాలు తీసుకున్న అందరికి శిక్ష పడాలి

కాళేశ్వరం అక్రమాలలో నిర్ణయాలు తీసుకున్న అందరికి శిక్ష పడాలని మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో ఉన్నారు. రేషన్ కార్డుల పంపిణీ అనంతరం గజ్వేల్ లో విలేకరులతో ఆయన మాట్లాడారు. కాక వెంకటస్వామి ప్రజలకు తాగునీరు సమస్య పరిష్క రించాలని ఎంతో అనుకున్నారని, అప్పటి సీఎం వైఎస్సార్ హయాంలోనే ప్రజల దాహార్తి తీర్చడానికి రూ. 36 వేలకోట్లతో ప్రాణహిత చేవెళ్ల  ప్రాజెక్టును రూపొందించి 11 వేల కోట్లతో పనులు కూడా చేశామన్నారు.

దానిలో భాగంగానే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించినట్లు తెలిపారు. వేలకోట్ల ప్రాజెక్టును లక్ష కోట్లుగా ప్రణాళిక మార్చి కెసిఆర్ కాంట్రాక్టర్ల జేబులు నింపారన్నారు. ప్రస్తుతం మల్లన్న సాగర్ కు ఎల్లంపల్లి ప్రాజెక్టునుండే నీరు వస్తున్నట్లు వెల్లడించారు. లక్ష కోట్లు పెట్టినా వృధాగా మారిన కాలేశ్వరం మారిందన్నారు.

కాలేశ్వరం అక్రమాలలో నిర్ణయాలు తీసుకున్న ప్రతి ఒకరికి శిక్ష పడాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, కలెక్టర్ హైమావతి, అడిషనల్ కలెక్టర్లు గరిమ అగర్వాల్ అబ్దుల్ హమీద్, డీఎస్‌ఓ తనూజ, ఆర్డీవో చంద్రకళ, తహసిల్దార్లు, అధికారులు కాంగ్రె స్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

  కాంగ్రెస్ నాయకుల రచ్చ 

 గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఎదుటే కాంగ్రెస్ నాయకులు రచ్చ చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ఆత్మ కమిటీ చైర్మన్ మద్దూరు మల్లారెడ్డి మంత్రి సూచన మేరకు వేదికపైకి  వెళుతుండడంతో  డిసిసి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి వర్గ నాయకులు, కార్యకర్తలు స్టేజ్ పైకి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో కార్యక్రమం ప్రాంగణం రసాభాసగా మారింది.

దాదాపు 15 నిమిషాల పాటు కార్యకర్తలు నర్సారెడ్డి జిందాబాద్ అంటూ ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డిని కిందికి దించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను అదుపు చేసి పక్కకు తీసుకు వెళ్తుండగా ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డిని, ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు విజయ్ కుమార్ ను నర్సారెడ్డి వర్గ నాయకులు కొట్టి గొడవ చేస్తుండడంతో  మంత్రి వివేక్ వెంకటస్వామి కల్పించుకున్నారు.

వేదిక పైనుండే ప్రభుత్వ కార్యక్రమంలో గొడవ చేయొద్దని, పార్టీ విషయాలు తర్వాత మాట్లాడుకుందామని నర్సారెడ్డిని గొడవ ఆపించాలని చెప్పారు. బయట మాట్లాడుకుందాం అంటూ కార్యకర్తలకు మెసేజ్ చెప్పడంతో బయటకు వెళ్లారు. కార్యక్రమం అనంతరం నర్సారెడ్డి నాయకులు మంత్రి వివేక్ తో మాట్లాడడానికి అవకాశం కల్పించారు.

కాగా డిసిసి అధ్యక్షుడు  నర్సారెడ్డి తమపై దాడి చేశారని, ప్రోటోకాల్ పాటించకుండా అడ్డుపడ్డారని, కులం పేరుతో దూషించాడని ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు విజయ్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నాయిని యాదగిరి గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.