23-07-2025 10:22:41 PM
200 కోట్ల మంది మహిళలకు ఉచిత ప్రయాణం..
కల్వకుర్తి బస్‌స్టేషన్‌లో ఘనంగా మహోత్సవం..
కల్వకుర్తి: తెలంగాణ రాష్ట్రంలో మహిళల సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం మరో కీలక మైలురాయిని చేరుకుందని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి(MLA Kasireddy Narayan Reddy) అన్నారు. బుధవారం కల్వకుర్తి బస్‌స్టేషన్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉచిత ప్రయాణ పథకం అమలుకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.6700 కోట్లు ఖర్చు చేసినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వేడుకల్లో భాగంగా 97 డిపోలు, 341 బస్ స్టేషన్లలో సంబరాలు, సత్కార కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉత్తమ సేవలు అందిస్తున్న 5 మంది డ్రైవర్లు, 5 మంది కండక్టర్లను, ట్రాఫిక్ గైడ్లు, భద్రతా సిబ్బందిని సత్కరించాలని ఆర్టీసీ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ పథకం ద్వారా దూరప్రాంతాల మహిళలు నగరాల్లో ఉద్యోగాలు చేయగలుగుతున్నారని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయని వివరించారు. ప్రతి మహిళ నెలకు రూ. 45 వేల వరకు ప్రయాణ ఖర్చు ఆదా చేసుకుంటున్నారని తెలిపారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు నూతన బస్సులు నూతన బస్టాండ్ ప్రాంతాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.