03-01-2026 10:35:59 PM
చారకొండ: హెల్మెట్ బరువు అనుకోకుండా బాధ్యతగా భావించి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ధరించాలని ఎస్ఐ వీరబాబు సూచించారు. శనివారం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మండల కేంద్రంలో పోలీస్‌స్టేషన్ నుంచి ఉన్నత పాఠశాల వరకు 50 ద్విచక్ర వాహనాలతో హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించి, హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించక పోవడంతో చాలా మంది మృత్యువాత పడుతున్నారని చెప్పారు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడిపితే ప్రమాదం జరిగినా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. త్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. హెల్మెట్ మా శాసనం కాదు, మీ సంక్షేమం, హెల్మెట్ ఒక వస్తువు కాదు ప్రాణాన్ని కాపాడే ఆయుధమని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీశైలం గౌడ్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.