03-01-2026 10:34:07 PM
- 50 శాతం చేసి 90 శాతం పనులు చేశామని కేసీఆర్ అబద్దాలు చెప్పారు
- అసెంబ్లీలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆగ్రహం
జడ్చర్ల : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తయిపోయాయని ఎన్నికలకు ముందు నార్లాపూర్ లో జరిగిన సభలో అప్పటి సీఎం కేసీఆర్ అబద్దాలు చెప్పారని, వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 50శాతం పనులు మాత్రమే పూర్తి చేసారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చిందని, ఉదండాపూర్ నిర్వాసితులకు ఆర్ అండ్ ప్యాకేజీ కింద రూ.223 కోట్ల నిధులు కూడా వచ్చాయని వివరించారు.
శనివారం సాయంత్రం అసెంబ్లీలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై జరిగిన చర్చలో అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల ద్వంద్వ విధానాలను ఆవలం బిస్తున్నారని విమర్శలు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కు గుండె కాయవంటి ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తయితే 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఈ రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా మునుగోడు వరకూ నీళ్లు చేరుతాయని చెప్పారు. అయితే అత్యంత ప్రధానమైన ఈ రిజర్వాయర్ ను బీఆర్ఎస్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, నాలుగురేళ్లపాటు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులివ్వకుండా వారి బతుకులను రోడ్డు పాల్జేసిందని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రజా పాలన మొదలైన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క ఈ విషయంపై దృష్టిసారించి ఇప్పటి వరకూ రూ.223 కోట్ల రుపాయలను ఉదండాపూర్ నిర్వాసితులకు అందించారని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఉదండాపూర్ నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సమస్యను డిసెంబర్ 9 వ తేదీలోపుగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ ప్రకారంగానే వారి ప్యాకేజీ మొత్తాలను పెంచుతూ మంత్రివర్గ సమావేవంలో నిర్ణయం తీసుకున్నారని అనిరుధ్ రెడ్డి వివరించారు.
2014 ఎన్నికలకు ముందు తమ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇస్తామని మహబూబ్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో నరేంద్ర మోదీ ప్రకటించారని, అయితే ఇప్పుడు ఆ విషయం గురించి బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీసారు. గతంలో సినీనటి రోజా ఇంటికి వెళ్లి చేపల పులుసు తిని రాయలసీమను రతనాల సీమను చేస్తానని కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. రోజా ఇంటికి వెళ్లి చేపల పులుసు తినడానికి కేసీఆర్ కు టైమ్ ఉందని, కానీ ఉదండాపూర్ నిర్వాసితులు ఆయనను కలవడానికి వెళ్తే టైమ్ లేదని వారిని అరెస్ట్ చేయించారని విమర్శించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పై మొసలి కన్నీరు కారుసక్తున్న కేసీఆర్ ఇప్పుడు పాలమూరు లో బహిరంగ సభ పెడతానని అంటున్నారని, ఆయన ఈ సభ పెట్టకముందే ఉదండాపూర్ నిర్వాసితులకు క్షమాపణ చెప్పాలని అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు లో భాగమైన కరివెన రిజర్వాయర్ వద్ద కుర్చీ వేసుకొని కూర్చొని పనులు పూర్తి చేయిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు కేసీఆర్ కనిపించడం లేదు, ఆయన కుర్చీ కూడా కనిపించడం లేదంటూ అనిరుధ్ రెడ్డి ఎద్దేవా చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణపనులు 90శాతం పూర్తయ్యాయని నార్లాపూర్ లో కేసీఆర్ అబద్దాలు చెప్పారని, వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని స్పష్టం చేశారు. ప్రాజెక్టులు పూర్తి చేయడం బీఆర్ఎస్ నేతల లక్ష్యం కాదని, వాటిని అసంపూర్తిగా పెట్టి అంచనాలు పెంచి కమీషన్లు దండుకోవడమే వారి విధానమని తీవ్రస్థాయిలో విమర్శించారు. రైతులకు సంకెళ్లు వేసి, కాంట్రాక్టర్ల జేబులు నింపడమే బీఆర్ఎస్ నేతల నీతి అని దుయ్యబట్టారు.
తమ ప్రభుత్వ హయాంలోనూ ఉదండాపూర్ నిర్వాసితులు ధర్నాలు చేసినా తాము వారిని అరెస్టులు చేయించలేదని, అందరినీ ఒప్పించి ఈరోజున ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజర్వాయర్ పనులు చేయిస్తున్నామని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే మూడేళ్ల కాలంలో ప్రాజెక్టు పనులు, రిజర్వాయర్ కు సంబంధించిన కుడి, ఎడమ కాల్వల పనులు పూర్తి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా వాసి కావడంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ను పూర్తి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారని చెబుతూ, సీఎం రేవంత్ కు, డిప్యుటీ సీఎం భట్టికి అనిరుధ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.