02-01-2026 01:46:01 AM
అమరావతి, జనవరి 1: కొత్త సంవత్సర వేడుకల వేళ ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో దారుణం వెలుగు చూసింది. ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తుడుములదిన్నె గ్రామానికి చెందిన వేములపాటి సురేంద్ర(35) తన ముగ్గురు పిల్లలు కావ్యశ్రీ(౭), జ్ఞానేశ్వరి(4), సూర్యగగన్(2)లకు విషం కలిపిన కూల్‌డ్రింక్‌ను తాగించాడు.
దీంతో ఆ ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం సురేంద్ర కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గతేడాది ఆగస్టు 16న సురేంద్ర భార్య మహేశ్వరి(32) అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంది. అప్పటినుంచి సురేంద్ర మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే సురేంద్ర తన ముగ్గురు పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనకు గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయన్నారు.