calender_icon.png 2 January, 2026 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గందరగోళంగా డివిజన్లు!

02-01-2026 12:38:13 AM

ఇష్టారాజ్యంగా జోన్ల ఏర్పాటు 

పోలీస్ కమిషనరేట్ల పరిధి అదే పరిస్థితి 

ప్రజల సౌకర్యం పరిగణనలోకి తీసుకొని వైనం 

కొరవడిన శాస్త్రీయత అంతా అధికారుల ఇష్టారాజ్యమే! 

మేడ్చల్‌కు తీవ్ర అన్యాయం 

మేడ్చల్, జనవరి 1 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పునర్వ్యవస్థీకరణ తీరు అయోమయానికి, గందరగోళానికి గురిచేస్తోంది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా అధికారులు కార్యాలయంలోనే కూర్చొని డివిజనులు, జోనులు విభజన చేయడంతో అనేక సమస్యలు, అపోహలు తెచ్చిపెడుతోంది. దేనిని ప్రామాణికంగా తీసుకుని పునర్వ్యవస్థీకరించారో ఎవరికి అర్థం కావడం లేదు. రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని ఏకైక లక్ష్యంగానే పునర్వ్యవస్థీకరణ చేశారే గాని ప్రజల సౌకర్యాలను, జీవన ప్రమాణాలను, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదు. పునర్వ్యవస్థీకరణలో శాస్త్రీయత కనిపించడం లేదు.

గతంలో ఆరు జోన్లు ఉండగా 12 జోన్లకు పెంచారు. జోన్లను ఇష్టానుసారంగా ఏర్పాటు చేశారు. మేడ్చల్ జిల్లా కు చెందిన కూకట్పల్లి జోన్ ఇదివరకే జిహెచ్‌ఎంసి లో ఉంది. కొత్తగా మేడ్చల్ జిల్లాకు చెందిన మూడు జోన్లు కుతుబుల్లాపూర్, మల్కాజ్గిరి, ఉప్పల్ ఏర్పాటు చేసినప్పటికీ ఇవి ఎప్పటినుంచో జిహెచ్‌ఎంసి పరిధిలోనే ఉన్నాయి. కొత్తగా జిహెచ్‌ఎంసి లో వీలైనమైన మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో ఒక్క జోన్ కూడా ఏర్పాటు చేయలేదు. మేడ్చల్ జిల్లాకు చెందిన నాలుగు కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు జిహెచ్‌ఎంసి లో విలీనమయ్యాయి. 

పోలీస్ కమిషనరేట్‌లు అంతే! 

ప్రభుత్వం కొత్తగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ను ఏర్పాటు చేసింది. పాతవాటి పరిధిలో మార్చింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పేరు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ రేటుగా మార్చింది. వీటి పరిధిలో కూడా ఇష్టరాజ్యంగా నిర్ణయించారు. ప్రజల సౌకర్యాన్ని, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని పరిధి నిర్ణయించాల్సి ఉండగా ఆదరాబాదరగా చేశారు. రాజీవ్ రహదారిలో షామీర్పేట్ పోలీస్ స్టేషన్ మల్కాజిగిరి కమిషనరేట్ లో చేర్చి, దాని తర్వాత ఉన్న జినోము వ్యాలీ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ కమీషనరేట్లో చేర్చారు.

మేడ్చల్ జోన్ ను తీసేసి కుత్బుల్లాపూర్ జోన్ ఏర్పాటు చేశారు. మేడ్చల్ జోన్ ఎందుకు తీసేయాల్సి వచ్చిందో అధికారులకే తెలియాలి. జిహెచ్‌ఎంసి మూడు కార్పొరేషన్లకు తుది రూపం వచ్చిన తర్వాత మున్సిపల్ సరిహద్దు ఆధారంగా కమీషనరేట్ల పరిధి నిర్ణయిస్తే పాలనాపరంగా సౌలభ్యంగా ఉండేది. కార్పొరేషన్లు పూర్తికాకముందే కమిషనరేట్ పరిధి మార్చారు.

మేడ్చల్‌కు తీరని అన్యాయం 

జిహెచ్‌ఎంసి, పోలీస్ కమిషనరేట్ ల పునర్విభజనలో మేడ్చల్ కు తీరని అన్యాయం జరిగింది. ఒకప్పుడు మేడ్చల్ తాలూకా కుతుబుల్లాపూర్, నిజాంపేట్, కొంపల్లి, మేడ్చల్, కీసర ,ఘట్కేసర్ మల్కాజ్గిరి, బోడుప్పల్ వరకు విస్తరించి ఉండేది. అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా అంతే పెద్దగా ఉండేది. కానీ నేడు జిహెచ్‌ఎంసి సర్కిల్ కు పరిమితమైంది. మేడ్చల్ జోన్ ఏర్పాటుచేసే అవకాశం ఉన్నప్పటికీ చేయలేదు. కుత్బుల్లాపూర్ జోన్ కొత్తగా ఏర్పాటు చేసి అందులో మేడ్చల్ సర్కిల్ చేర్చారు.

కుత్బుల్లాపూర్ జోన్లో అత్యధికంగా ఏడు సర్కిల్ ఉన్నాయి. మిగతా జోన్లలో 4, 5 సర్కిల్ మాత్రమే ఉన్నాయి. కుతుబుల్లాపూర్ నుంచి మూడు సర్కిల్ తీసి షామీర్పేట్ కీసర కలిపి కొత్త జోన్ ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ మేడ్చల్ లో డివిజన్ కార్యాలయానికి పరిమితం చేసింది.