calender_icon.png 2 January, 2026 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త లుక్స్ అదుర్స్

02-01-2026 12:22:06 AM

నూతన ఆంగ్ల సంవత్సరాదిన తెలుగు చిత్రసీమలో సరికొత్త సందడి నెలకొంది. సినీప్రియులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పలు సినిమాల నుంచి మేకర్స్ పోస్టర్లు, ఫస్ట్‌లుక్‌లు విడుదల చేశారు. మరి కొన్ని కొత్త చిత్రాలు ప్రకటించారు. ముఖ్యంగా ప్రభాస్ వంగా చిత్రం ‘స్పిరిట్’ నుంచి బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు ప్రభాస్ లుక్‌ను విడుదలైంది. ఈ పవర్‌ఫుల్ ఫస్ట్‌లుక్ నిమిషాల వ్యవధిలో వైరల్‌గా మారింది. ‘ఇండియన్ సినిమా.. మీ అజానుబాహుడిని చూడండి.

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026. స్పిరిట్ ఫస్ట్‌లుక్’ అని డైరెక్టర్ సందీప్‌రెడ్డి ట్వీట్ చేశారు. పోస్టర్‌లో.. ఒళ్లంతా గాయాలతో, బ్యాండ్-ఎయిడ్‌లు కట్టుకుని వెనక్కి తిరిగి నిలబడివున్న ప్రభాస్ రా అండ్ రస్టిక్ పోస్టర్ అదిరిపోయింది. ఆయన పక్కన ఉన్న త్రిప్తిడిమ్రీ ఒక ఎమోషనల్ మూమెంట్‌లో అతని సిగరెట్‌ను వెలిగిస్తూ కనిపించడం మరింత ఆసక్తిని పెంచింది. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ ప్రారంభ దశలో ఉంది. ప్రభాస్  మరో చిత్రం ‘ది రాజాసాబ్’ ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కానుంది.

మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి కూడా న్యూ ఇయర్ విషెస్ పోస్టర్ రిలీజైంది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో భుజాన తుపాకీతో ఉన్న చిరంజీవి లుక్ ఆకట్టుకుంటోంది. పవన్‌కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి కొత్త పోస్టర్ పంచుకున్నారు. ఇదిలా వుండగా పవన్‌కల్యాణ్  మరో సినిమా రానుంది. రామ్ తుళ్లూరి కొత్త బ్యానర్ జైత్ర రామ్ మూవీస్‌లో ఈ కొత్త సినిమాను ప్రక టించారు. వక్కంతం వంశీ కథ అందిస్తుం డగా, సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించను న్నారు.

గతంలో వీరి కాంబోలో ‘రేసుగుర్రం’, ‘కిక్’ సినిమాలు రావటంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు నెలకొన్నాయి. ఇక ‘ది ప్యారడైజ్’ సినిమా నుంచి నాని పోస్టర్‌ను మేకర్స్ పంచుకున్నారు. ఈ సినిమాలో నాని జడల్ అనే పాత్రలో నటిస్తున్నారు. దీంతో చిత్రబృందం ఈ పోస్టర్‌కు ‘జడల్ జమానా’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చి సినీప్రియుల దృష్టిని తిప్పుకున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిసున్న ఈ సినిమా 2026 మార్చి 26న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల కానుంది.

రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి నటిస్తున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. న్యూ ఇయర్ విషెస్‌తో ఈ సినిమా బృందం ఓ పోస్టర్‌ను పంచుకున్నారు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నటిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’ సినిమా సంక్రాంతి బరిలో నిలుస్తోంది. జనవరి 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా కొత్త పోస్టర్‌లో నవీన్, మీనాక్షి బీచ్‌లో నడుస్తూ ఆకట్టుకుంటున్నారు.

అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ నుంచి సాంగ్ అప్‌డేట్ ఇస్తూ పంచుకున్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీగౌరిప్రియ జంటగా నటిస్తున్న చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’. సాయిరాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. స్కంద ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘మన డాక్టర్ బాబే’. శ్రీస్కంద హీరోగా ఈ మూవీని చలపతి కుమార్ పువ్వల తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో మోహన సిద్ధి, శ్రుతిశంకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌తోపాటు, గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  సుమన్, సాయికుమార్, నటరాజ్ వరుణ్ సందేశ్, వితికా షేరు, ప్రధాన పాత్రధారులుగా వస్తున్న పొలిటికల్ ఎంటర్‌టైనర్ ‘ధర్మస్థల నియోజవర్గం’.  జై జ్ఞానప్రభ తోట దర్శకత్వంలో  మేరు, భాస్కర్ నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్  పోస్టర్ రిలీజ్ చేశారు. శివకుమార్ రామచంద్రవరపు నటిస్తున్న చిత్రం ‘సువర్ణ టెక్స్‌టైల్స్’.

ప్రశాంత్ నామాని రచనాదర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అనిల్ ఇరుగుడిండ్ల నిర్మిస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా మేకర్స్ ఈ సినిమాను ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో కథానాయకుడు శివకుమార్ లంగావోణీ ధరించి ద్విచక్రవాహనంపై వెళుతూ చిరునవ్వులు చిందిస్తున్న లుక్ చూస్తే..

ఈ సినిమా పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపుదిద్దుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి భరత్ ఎం సంగీతం సమకూర్చుతుండగా, రాంబాబు గోశాల గీత సాహిత్యం అందిస్తున్నారు. చందు ఏజే డీవోపీగా, బొంతల నాగేశ్వ ర్‌రెడ్డి ఎడిటర్‌గా, విజయ్‌కుమార్ గాజుల ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.